
సాక్షి,హైదరాబాద్ : రెండురోజుల తెలంగాణ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హైదరాబాద్ బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్,మేయర్ గద్వాల్ విజయలక్ష్మిలు స్వాగతం పలికారు.
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటనలో భాగంగా..శిల్పారామం వేదికగా నవంబర్ 21 (ఈరోజు) నుంచి 24వ తేదీ వరకు లోక్‌మంథన్-2024 కార్యక్రమం జరగనుంది. లోక్‌మంథన్-2024లో 22న వివిధ దేశాల ప్రతినిధులతో జరిగే మేధోమథన కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రారంభించనున్నారు.
ఇందులో భాగంగా కొద్ది సేపటి కిత్రమే బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము ఈ రోజు సాయంత్రం 6.20 గంటల నుంచి 7.10 గంటల వరకు రాజ్‌భవన్‌లో ఉండనున్నారు. ఈ రోజు రాత్రి రాజ్‌భవన్‌లో బస చేయనున్నారు. రేపు మధ్యాహ్నం 12.05 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి తిరుగుపయనం కానున్నారు.
