హేమంత్‌ హత్య : అసలు తప్పెవరిది? | Intresting Matter About Hemanth Murder Case In Hyderabad | Sakshi
Sakshi News home page

హేమంత్‌ హత్య : అసలు తప్పెవరిది?

Published Sun, Sep 27 2020 8:21 AM | Last Updated on Sun, Sep 27 2020 4:38 PM

Intresting Matter About Hemanth Murder Case In Hyderabad - Sakshi

పోలీసుల్లో బాధ్యతారాహిత్యం పెరుగుతోందా..? ప్రేమ వివాహం చేసుకొని..భార్యవైపు బంధువుల చేతుల్లో హతమైన హేమంత్‌ ఉదంతాన్ని పరిశీలిస్తే ఈప్రశ్నలే ఉదయిస్తున్నాయి. హేమంత్‌ను కిడ్నాప్‌ చేసిన కారును..వారి గొడవలను గమనించిన కొందరు స్థానికులు అడ్డుకోకపోగా సెల్‌ఫోన్‌లలో ఫొటోలు, వీడియోలు తీయడంలో మునిగిపోయారు. కనీసం పోలీసులకూ సమాచారం ఇవ్వలేదు. ఇక సరైన సమాచారం అందినా..పోలీసులు వేగవంతంగా స్పందించ లేదని, సమన్వయం చేసుకోవడంలో విఫలమయ్యారనే విమర్శలు విన్పిస్తున్నాయి. అందువల్లే ఓ యువకుడి నిండుప్రాణాలు గాల్లో కలిశాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 

సాక్షి, సిటీబ్యూరో : గచ్చిబౌలిలో కిడ్నాప్‌ అయి..సంగారెడ్డి జిల్లా మల్కాపూర్‌ శివారు కిష్టాయిగూడెం వద్ద విగత జీవిగా మారిన హేమంత్‌ కుమార్‌ హత్యోందంతం ఇటు పౌరుల బాధ్యతారాహిత్యాన్ని ఎత్తిచూపుతూ...అటు పోలీసింగ్‌ విధానం మారాలనే పాఠాన్నీ చెబుతోంది. గోపన్‌పల్లి తండా చౌరస్తా వద్ద కార్లు ఆగడం..వాటిలో పెనుగులాట జరిగిన తతాంగాన్ని సెల్‌ఫోన్‌లో ఫొటోలు, వీడియోలు చిత్రీకరించేందుకు ఆసక్తి చూపిన జనాలు..కాస్త మానవత్వం ప్రదర్శించి..అడ్డుకుని..పోలీసులకు సమాచారం ఇచ్చి ఉంటే ఈ దారుణ ఘటన జరిగి ఉండేది కాదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 3.42 గంటల ప్రాంతంలో మూడు కార్లు ఆగిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలకు చిక్కిన వాటిని పరిశీలిస్తే అవంతి రెడ్డి కుటుంబ సభ్యుల వద్ద ఎటువంటి దాడి చేసే ఆయుధాలు లేవు.

అయితే అక్కడ జరిగిన గలాటాను జనాలు చూశారే తప్ప ఎవరూ ఆపేందుకు ప్రయత్నించకపోవడంతో వారు మరింత రెచ్చిపోయారు. ఇలా దాదాపు 20 నిమిషాలకు పైగానే గడబిడ జరగడం..హేమంత్‌పై చేయిచేసుకోవడం జరిగింది. ఎలాగోలాగూ వారి నుంచి తప్పించుకొని హేమంత్‌ కుమార్‌ తెల్లాపూర్‌ రోడ్డువైపు పరుగులు తీశాడు. దీంతో అప్పటికే కిరాయి హంతకులు బిచ్చు యాదవ్, ఎరుకల కృష్ణలు కూర్చొని ఉన్న స్విఫ్ట్‌ కారు (టీఎస్‌08 ఈటీ 3031)ను డ్రైవ్‌ చేసిన అవంతి రెడ్డి మేనమామ యుగంధర్‌ రెడ్డి చేజ్‌ చేసి మరీ పట్టుకున్నారు. ఆ తర్వాత కారులో ఎక్కించుకొని తెల్లాపూర్‌ మీదుగా ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) ఎక్కి పటాన్‌చెరు వద్ద ఆగి అటు నుంచి జహీరాబాద్‌ వెళ్లారు. (చదవండి : హేమంత్ రిమాండ్‌లో సంచలన విషయాలు)

ఇంతవరకు బాగానే ఉన్నా 3.50 గంటల ప్రాంతంలో అవంతి మామ (హేమంత్‌ తండ్రి) డయల్‌ 100కు కాల్‌చేస్తే 4.30 గంటలకు పెట్రోలింగ్‌ వాహనంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వీరొచ్చే 10 నుంచి 15 నిమిషాల ముందే హేమంత్‌ను కిడ్నాప్‌ చేసి వాహనంలో తీసుకెళ్లారని అక్కడి స్థానికులు చెబుతున్నారు. అయితే గోపన్‌పల్లి తండా చౌరస్తా వద్ద 11 మందిని అదుపులోకి తీసుకొని, అవంతిని, ఆమె అత్తమామలను ఠాణాకు తీసుకెళ్లారు. ఇక్కడా హేమంత్‌ను కారులో బలవంతంగా తీసుకెళ్లారని తెలిసిన పోలీసులు అటువైపుగా దృష్టి సారించకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.  

సమన్వయం చేసి ఉంటే బాగుండేది... 
అయితే అక్కడ పట్టుకున్న 11 మందిని విచారించారే తప్ప కిడ్నాప్‌ అయిన హేమంత్‌పై దృష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తోంది. బలవంతంగా లాక్కొని పారిపోయారని హేమంత్‌ భార్య అవంతిరెడ్డి చెప్పినా మరుక్షణమే పోలీసులు ఆ కారు నంబర్‌ను చుట్టుపక్కల ప్రాంత పోలీసులకు చేరవేసి ఉంటే దొరికి ఉండేది కావొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సుమారు 4.15 గంటల ప్రాంతంలో కిడ్నాప్‌ అయిన హేమంత్‌కుమార్‌ను దాదాపు మూడు గంటలకుపైగా కారులో తిప్పడంతో ఎక్కడోఒక్క దగ్గర పోలీసులు తనిఖీలు చేస్తే ఇంతటి దారుణం జరిగి ఉండేది కాదన్న వాదన వినిపిస్తోంది.

కేవలం యుగంధర్‌రెడ్డి, హేమంత్‌కుమార్‌ సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ట్రేసింగ్‌పైనే ప్రధానంగా దృష్టి సారించడం...ప్రత్యామ్నాయలుగా ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజీలను సాధ్యమైనంత తొందరగా పరిశీలించకపోవడంలో పోలీసుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. హేమంత్‌ కుమార్‌ను తీసుకెళ్లిన కారు వెళ్లిన మార్గంలో గస్తీ వాహనాలు ఉండి కూడా పట్టుకోకపోవడం పోలీసుల సమన్వయ లోపాన్ని వేలెత్తి చూపుతోంది. ‘హేమంత్‌ కుమార్‌ను తీసుకెళ్లిన కారు తెల్లాపూర్‌ వైపు వెళ్లిందని మాత్రమే తెలుసు. అటు నుంచి ఓఆర్‌ఆర్‌ మీదుగా పటాన్‌చెరు నుంచి జహీరాబాద్‌ వెళ్లిన విషయం తెలియదు. నిందితుడు యుగంధర్‌రెడ్డి నోరు విప్పితేనే కారు ఏయే మార్గంలో వెళ్లిందో తెలిసింద’ని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ పోలీసు అధికారి వ్యాఖ్యానించారు. (చదవండి : ‘అన్నయ్య మొహం మొత్తం దెబ్బలే’)

నోరు విప్పని లక్ష్మారెడ్డి
హేమంత్‌ కుమార్‌ను చంపేందుకు సుపారీ ఇచ్చిన విషయాన్ని అవంతి రెడ్డి తండ్రి లక్ష్మారెడ్డి పోలీసులకు చెప్పలేదు. అతన్ని 4.30 గంటలకు పట్టుకుని..కొన్ని గంటలపాటు విచారించినా అసలు ఏ విషయం తెలపలేదు. గుండె సంబంధిత వ్యాధులు ఉన్నాయని నమ్మించే ప్రయత్నం చేశాడు. ఒకవేళ అతడు నోరు విప్పి ఉంటే ఇంకాస్త సీరియస్‌గా తీసుకొని హేమంత్‌ ఆచూకీ కోసం వెతికేవాళ్లమని గచ్చిబౌలి ఠాణాలోని ఓ అధికారి పేర్కొన్నారు. మామూలుగా గొడవలతో తీసుకెళ్లి ఉంటారని అనుకున్నామనే చెప్పుకొచ్చారు. 

‘హేమంత్‌..ఒక్కసారి కళ్లు తెరు’


శేరిలింగంపల్లి : కిడ్నాప్‌నకు గురై కిరాతకంగా హత్యకు గురైన హేమంత్‌ అంత్యక్రియలు  శేరిలింంపల్లి తారానగర్‌లోని శ్మశాన వాటికలో అశ్రునయనాల మధ్య శనివారం నిర్వహించారు. అంతకుముందు హేమంత్‌ మృతదేహాన్ని భద్రపరిచిన కాంటినెంటల్‌ ఆస్పత్రి నుంచి తారానగర్‌లోని హేమంత్‌ నివాసానికి తీసుకొచ్చారు. మృతదేహాన్ని చూడగానే హేమంత్‌ భార్య అవంతిరెడ్డి, ఆయన తల్లిదండ్రులు లక్ష్మీరాణి, మురళీకృష్ణలు బోరున విలపించారు.  ‘ఒక్కసారి కళ్ళు తెరువు...హేమంత్‌..’అంటూ అవంతిరెడ్డి భర్త మృతదేహంపై పడి రోదిచడం...అరేయ్‌... తమ్ముడూ అంటూ ఒక్కసారి పిలువురా. పిలువు.... వాడొచ్చాడురా...చూడురా....వాడి మొహం చూడరా..అంటూ హేమంత్‌ తల్లి లక్ష్మీరాణి కన్నీరు మున్నీరుగా విలపించడం అందరినీ కలచివేసింది. అంతకుముందు లండన్‌ నుంచి హేమంత్‌ తమ్ముడు సుమంత్‌ రావడంతో అతన్ని చూడగానే తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.  అనంతరం తారానగర్‌లోని శ్మశాన వాటికలో దహన సంస్కారాలు తండ్రి మురళీకృష్ణ నిర్వహించారు. హేమంత్‌ స్నేహితులు ‘అమర్‌ హై హేమంత్‌’అంటూ నినాదాలు చేశారు. (చదవండి : వాళ్లను ఎన్‌కౌంటర్‌ చేయండి: అవంతి)

రెండు రోజుల క్రితమే ఫోన్‌లో మాట్లాడా: సుమంత్‌ 
హేమంత్‌ హత్యకు కారణమైన వారికి నూరు శాతం శిక్ష పడాలని అతని తమ్ముడు సుమంత్‌ డిమాండ్‌ చేశారు. తారానగర్‌లో విలేకరులతో మాట్లాడుతూ  కులాంతర వివాహం చేసుకుంటే చంపుతారా...? అని ప్రశ్నించారు. పోలీసులు ఇప్పటి వరకు కేసు విషయంలో బాగా చేశారని, డబ్బు ఆశ చూపినా పట్టించుకోకపోవడంతో వారు మాకు న్యాయం చేస్తారనే నమ్మకం పెరిగిందని, సీఐ ఎవరో...నాకు తెలియదు...కానీ భవిష్యత్‌లో కూడా ఈ కేసు విషయంలో న్యాయం చేస్తారనుకుంటున్నామన్నారు. డబ్బుతో ఏదైనా చేయవచ్చు అనే ధీమాలో హంతకులు ఉన్నారన్నారు.  రెండు రోజుల క్రితం ఫోన్‌లో మాట్లాడాను. చిన్నతనం నుంచి అన్నీ నాకు వాడే...వాడిని నాకు దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 


నా భవిష్యత్తును నాశనం చేసిన వారికి శిక్ష పడాలి : అవంతిరెడ్డి 
హేమంత్‌తో వివాహమైన నాలుగు నెలలకే ఈ విధంగా చేయడం ఏంటి? అని  హేమంత్‌ సతీమణి అవంతిరెడ్డి ప్రశ్నించారు. 15 మంది కలిసి నా భర్తను హత్య చేస్తారా..?  నాపై ప్రేమ ఉంటే నేనుప్రేమించిన వ్యక్తిని చంపుతారా? అని ప్రశ్నించారు. నా భవిష్యత్‌ను నాశనం చేసి ఈ హత్యలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ శిక్షపడాలన్నారు. యుగంధర్‌రెడ్డిని ఎన్‌కౌంటర్‌ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement