టార్గెట్‌ మల్లారెడ్డి: రూ.8.8 కోట్ల నగదు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం | IT Raids At Telangana Minister Malla Reddy House In Hyderabad | Sakshi
Sakshi News home page

టార్గెట్‌ మల్లారెడ్డి.. మంత్రి ఆస్తులు లక్ష్యంగా ఐటీ దాడులు

Published Wed, Nov 23 2022 1:31 AM | Last Updated on Wed, Nov 23 2022 6:28 AM

IT Raids At Telangana Minister Malla Reddy House In Hyderabad - Sakshi

 సాక్షి, హైదరాబాద్‌/మేడ్చల్‌/కుత్బుల్లాపూర్‌:  తెలంగాణలో గత రెండు నెలలుగా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), సీబీఐతో పాటు ఆదాయ పన్ను (ఐటీ) శాఖ వరుసగా నిర్వహిస్తున్న దాడులు సంచలనం కలిగిస్తున్నాయి. మంగళవారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి లక్ష్యంగా ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. తెల్లవారుజామున ఐదు గంటల నుంచే, మంత్రి ఇంట్లో ఉండగానే.. కేంద్ర పోలీసు బలగాల పహారాలో ఆయన నివాసంతో పాటు వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు ప్రారంభమయ్యాయి. మొత్తం 50 బృందాలు దాడుల్లో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సోదాల్లో పెద్ద ఎత్తున ఆదాయానికి మించిన ఆస్తులను గుర్తించిన అధికారులు, రూ.8.8 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మెడికల్‌ సీట్ల కేటాయింపుల్లో అవకతవకలు, రియల్‌ ఎస్టేట్‌లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు  గుర్తించినట్లు సమాచారం. దాడులు రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం కూడా సోదాలు కొనసాగవచ్చని తెలుస్తుండగా.. ఐటీ అధికారుల నుంచి మంగళవారం ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. 

పన్ను చెల్లింపు, ఎగవేతపై పక్కా సమాచారం! 
బోయిన్‌పల్లిలో నివాసం ఉంటున్న మల్లారెడ్డి ఇంటి నుంచే దాడులు మొదలయ్యాయి. మంత్రి, ఆయన బంధువులు నిర్వహిస్తున్న పలు విద్యా సంస్థలకు..ముఖ్యంగా మెడికల్‌ కళాశాలలకు సంబంధించిన ఆదాయం, వాటిపై చెల్లిస్తున్న పన్ను, ఎగవేతకు సంబంధించి అందిన పక్కా సమాచారం మేరకు ఐటీ అధికారులు దాడులకు దిగినట్లు తెలుస్తోంది. మంత్రి నిర్వహిస్తున్న విద్యా సంస్థలు, వారి బంధువుల ఇళ్లను, మంత్రి భాగస్వామిగా ఉన్న విద్యా సంస్థలను జల్లెడ పడుతున్నారు. సోదాల సమయంలో మంత్రి తన మొబైల్‌ఫోన్‌ను తన నివాసం పక్కనే ఉన్న క్వార్టర్స్‌లో జూట్‌ బ్యాగ్‌లో దాచి పెట్టారు. ఈ విషయాన్ని పసిగట్టిన ఐటీ అధికారులు ఆ మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. మిగతా ప్రాంతాల్లో కూడా అందరి మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మల్లారెడ్డి విద్యా సంస్థల్లో డైరెక్టర్లుగా ఉన్న కుమారులు మహేందర్‌రెడ్డి, భద్రారెడ్డి, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి, ఇళ్లతో పాటు వియ్యంకుడు లక్ష్మారెడ్డి, బంధువు త్రిశూల్‌రెడ్డి, విద్యా సంస్థల ఖాతాలు ఉన్న బాలానగర్‌లోని క్రాంతి కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ చైర్మన్‌ రాజేశ్వరరావు ఇళ్లల్లోనూ, ప్రధాన విద్యా సంస్థల్లోనూ దాడులు నిర్వహించారు. మెడికల్‌ సీట్ల కేటాయింపునకు సంబంధించిన అవకతవకలు కూడా గుర్తించినట్లు తెలిసింది. మొత్తం 30 కళాశాలల్లో దాడులు చేసినట్లు సమాచారం. 

అల్లుని ఇంట్లో రెండు ఎలక్ట్రానిక్‌ లాకర్లు 
    మంత్రి ఇంటికి సమీపంలోనే సౌజన్య కాలనీలో నివాసం ఉండే అల్లుడు రాజశేఖర్‌రెడ్డి ఇంట్లోనూ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల సమయంలో ఆయన ఇంట్లో లేరని, టర్కీ దేశ పర్యటనలో ఉన్నట్లు సమాచారం. ఆయన ఇంట్లో రెండు ఎలక్ట్రానిక్‌ లాకర్లను అధికారులు గుర్తించారు. వాటిని తెరవడానికి ప్రయత్నిస్తున్నారు. సీఎంఆర్‌ కాలేజీలకు చైర్మన్‌గా వ్యవహరిస్తున్న మంత్రి సోదరుడు గోపాల్‌రెడ్డి ఇంట్లోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కొంపల్లిలోని ఫామ్‌ మిడోస్‌ విల్లాలోని మహేందర్‌రెడ్డి నివాసంలో, వియ్యంకుడు లక్ష్మారెడ్డి ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. కాగా మంత్రి మల్లారెడ్డి ఆర్థిక వ్యవహారాలు చూసే సంతోష్‌రెడ్డి ఇంట్లోనే ఉండి తలుపులు తీయకుండా మొండికేయడంతో, ఐటీ అధికారులు బలవంతంగా ఇంటి ద్వారాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. మల్లారెడ్డికి సంబంధించిన ఆర్థిక సమాచారం మొత్తం ఆయన వద్దనే లభిస్తుందన్న ఉద్దేశంతోనే అధికారులు బలవంతంగా లోపలికి వెళ్లినట్లు సమాచారం. సోదాల సందర్భంగా అధికారులు పలు కీలక డాక్యుమెంట్లు, బ్యాంకు లావాదేవీల పత్రాలు, కొన్ని హర్డ్‌ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.  

విద్యాసంస్థల విస్తృత సామ్రాజ్యం! 
    మంత్రి విద్యా సంస్థల సామ్రాజ్యం విస్తుగొల్పేస్థాయిలో ఉండడం గమనార్హం. ఆయనకు మొత్తం 36 ఇంజనీరింగ్‌ కాలేజీలు, మూడు మెడికల్‌ కళాశాలలు, డీమ్డ్‌ యూనివర్సిటీ, రెండు అంతర్జాతీయ పాఠశాలలతో పాటు, మరిన్ని విద్యా సంస్థలు, వందల ఎకరాల భూములున్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. మంత్రి కుమారులు రియల్‌ ఎస్టేట్‌ సంస్థల్లోనూ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టినట్లు అధికారులకు కీలక ఆధారాలు లభించినట్లు చెబుతున్నారు. మెడికల్, ఇంజనీరింగ్‌ కళాశాలల సీట్ల విక్రయంలో పెద్ద ఎత్తున ఆదాయం సమకూరినా.. ఆ మొత్తానికి సంబంధించిన పన్ను చెల్లించకుండా ఎగ్గొట్టినట్లు గుర్తించినట్లు తెలిసింది. కాలేజీల్లో సీట్ల కేటాయింపునకు సంబంధించిన రికార్డుల్లోనూ భారీ వ్యత్యాసాలు బయటపడినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి మెడికల్‌ కాలేజీల బ్యాంకు లావాదేవీలను కూడా ఐటీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

వస్తున్న ఆదాయమెంత.? ఐటీ రిటర్న్‌ దాఖలు చేసింది ఎంత..? పన్ను ఎగ్గొట్టింది ఎంత.? బినామీ వ్యక్తులపైనున్న ఆస్తులెన్ని.? క్రాంతి కో ఆపరేటివ్‌ బ్యాంకులో ఉన్న ఖాతాల్లో బినామీ ఖాతాలెన్ని.? అన్న అంశాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నట్టు సమాచారం. సీఎంఆర్‌ స్కూల్స్‌లో మంత్రి మల్లారెడ్డి, నర్సింహయాదవ్‌ భాగస్వాములుగా ఉన్నట్లు తెలిసింది. దీనితో ఆయన ఇంటిపై కూడా దాడులు కొనసాగాయి. మహేందర్‌రెడ్డికి సన్నిహితుడైన జైకిషన్‌ ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహించారు. జైకిషన్‌ కేసినోలో పెట్టుబడులు పెట్టినట్లు ఐటీ అధికారులకు సమాచారం ఉంది. దాడుల నేపథ్యంలో మల్లారెడ్డి కుమారుడు మహేందర్‌రెడ్డి స్నేహితుడు సుచిత్రా ప్రాంతంలో ఉండే త్రిశూల్‌రెడ్డి కార్యాలయం, ఇంట్లోనూ సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు అక్కడ రెండు కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అలాగే రఘునాథ్‌రెడ్డి వద్ద మరో రూ.2.8 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. సంతోష్‌రెడ్డి నివాసంలో ఎంత పట్టుబడిందీ తెలియరాలేదు.  

ప్రవీణ్‌రెడ్డిని తీసుకెళ్లిన ఐటీ అధికారులు 
    మంత్రి మల్లారెడ్డి మరదలు కుమారుడు ప్రవీణ్‌రెడ్డికి చెందిన దూలపల్లిలోని ఇంట్లోనూ సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు అక్కడ పలు డాక్యుమెంట్లు, నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. కాగా డాక్యుమెంట్లతో పాటు ప్రవీణ్‌రెడ్డిని, మరొక వ్యక్తిని అధికారులు తమ వెంట తీసుకెళ్లారు. అయితే వారిని ఎక్కడికి తీసుకెళ్లిందీ కుటుంబసభ్యులకు కూడా చెప్పలేదని తెలిసింది. 

హార్డ్‌డిస్కులు దాచిపెట్టిన కళాశాలల సిబ్బంది 
    సీఎంఆర్‌ గ్రూప్‌ కళాశాలల్లోని సిబ్బంది ఐటీ అధికారులకు దొరకకుండా పలు కంప్యూటర్లు, వాటి హార్డ్‌ డిస్క్‌లు రహస్య ప్రదేశాల్లో దాచిపెట్టినట్లు తెలిసింది. కాలేజీలకు అధికారులు రాకముందు వరకు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన ఫుటేజ్‌లను కూడా డిలిట్‌ చేసినట్లు సమాచారం. సోదాల సందర్భంగా అధికారులు కళాశాలల గేట్లు మూసివేశారు. మీడియాను సైతం అనుమతించలేదు. 

ఉలిక్కి పడ్డ టీఆర్‌ఎస్‌ శ్రేణులు 
    టీఆర్‌ఎస్‌ రాజకీయాల్లో ఫైర్‌ బ్రాండ్‌గా పేరున్న మేడ్చల్‌ ఎమ్మెల్యే, మంత్రి మల్లారెడ్డి ఆస్తులపై ఐటీ సోదాలతో ఆయన వెంట తిరిగే టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి. ప్రసార మాధ్యమాల్లో వార్తలు రావడంతో అధికసంఖ్యలో కార్యకర్తలు ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. అయితే అధికారులు ఎవరినీ లోనికి అనుమతించలేదు.  

ఒక కళాశాలతో ప్రారంభించి.. 
    పాలవ్యాపారి నుండి మంత్రి స్థాయికి ఎదిగిన మల్లారెడ్డి ప్రస్ధానం మేడ్చల్‌ మండలం నుండే మొదలైంది. తన అమ్మమ్మ ఊరుగా చెప్పుకునే మైసమ్మగూడలోనే ఆయన మొదటి ఇంజనీరింగ్‌ కళాశాల స్ధాపించారు. మైసమ్మగూడలో వందల ఎకరాల భూమి ఉండగా అందులోనే పదుల సంఖ్యలో మల్లారెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలు, మల్లారెడ్డి యూనివర్సిటీ ఉంది. కండ్లకోయలో ఆయన సోదరులు నర్సింహారెడ్డి, గోపాల్‌రెడ్డి నేతృత్వంలో సీఎంఆర్‌ గ్రూపు పేరుతో ఇంజనీరింగ్‌ కళాశాలలు, సీఎంఆర్‌ ఆసుపత్రి ఉన్నాయి. మేడ్చల్‌ పట్టణంలో పదుల సంఖ్యలో కమర్షియల్‌ ప్లాట్లు, ఎల్లంపేట్, పూడూర్‌ తదితర గ్రామాలలో గోదాంలు ఉన్నాయి.

ఇదీ చదవండి: మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ రైడ్స్‌.. ఒకేసారి 50 బృందాలతో..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement