జోరుగా సీఎం, మంత్రులు
మాజీ మంత్రుల ప్రచారం
విజయమే లక్ష్యంగా కాంగ్రెస్, గెలుస్తామన్న ధీమాలో బీఆర్‌ఎస్, పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నాలు
తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక
సాక్షి, హైదరాబాద్: అధికార, ప్రతిపక్షాల మధ్య జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం హీటెక్కుతోంది. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ రాజకీయ వాతావరణం హాట్‌హాట్‌గా మారుతోంది. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ ఇంటింటి ప్రచారంలో ఆరోపణలు, ప్రత్యారోపణలు, వ్యక్తిగత విమర్శనాస్త్రాలు గుప్పిస్తూనే.. నియమావళి ఉల్లఘనలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదుల పరంపర కొన సాగిస్తున్నాయి. తాజాగా శుక్రవారం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌ల్లో పాల్గొనగా.. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి కోసం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డోర్ టు డోర్ ప్రచారం చేయడంతో పొలిటికల్ హీట్ మరింత పెరిగినట్లయింది. మరోవైపు రాష్ట్ర మంత్రులు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ సెగ్మెంట్లో డివిజన్లవారీగా తిష్ట వేసి తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు ఓటర్లను ఆకర్షించేందుకు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అధికార కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా అభివృద్ధి మంత్రం జపిస్తుండగా, విజయం సాధిస్తామని ధీమాతో బీఆర్‌ఎస్, పాగా వేసేందుకు బీజేపీ ప్రతిష్టాత్మకంగా పోరాడుతున్నాయి.
అందరి దృష్టి ఇక్కడే..
తెలుగు రాష్ట్రాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హాట్ టాపిక్‌గా మారింది. ఈ నియోజకవర్గంలో సెటిలర్లు, సెలబ్రిటీలు, సంపన్నుల ఓట్లు కూడా ఉండటంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రధాన పక్షా లు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఊ హకు అందని విధంగా నిర్ణయాలతో ట్విస్టులపై ట్విస్టు లు ఇస్తున్నాయి. అధికార కాంగ్రెస్ మైనారిటీ ఓట్లను తమ వైపు తిప్పుకునేందుకు ఏకంగా సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన అజహరుద్దీన్‌కు మంత్రి పదవి కట్టబెట్టింది. బీఆర్‌ఎస్ దూకుడు పెంచింది. మాటా ముచ్చటా కార్యక్రమంతో టీ దుకాణాలు, ఇతర రద్దీ ప్రాంతాల్లో ప్రజలను కలిసి ఓట్లు అభ్యర్థించడంతో పాటు పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన విజయాలను.. రెండేళ్ల కాంగ్రెస్ పాలన వైఫల్యాలను ప్రజలకు వివరిస్తోంది.
రోడ్ షోలు అదుర్స్
అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ శుక్రవారం రాత్రి పోటా పోటీగా నిర్వహించిన రోడ్ షోలు ఆ పారీ్టల శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేపట్టిన రోడ్ షోకు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యాయి. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్‌షో గులాబీవనాన్ని తలపించింది. నందినగర్‌లోని నివాసం నుంచి రోడ్ షోకు బయలుదేరేముందు పార్టీ మహిళా నేతలు కేటీఆర్‌కు హారతి పట్టారు. అడుగడుగునా గులాబీ జెండాలతో ఘన స్వాగతం పలికారు. వారి ఉత్సాహం చూసి కేటీఆర్ సైతం జెండా ఊపారు. ‘అందరూ బాగున్నారా. ‘కొడుతున్నామా జూబ్లీహిల్స్‌ను మళ్లీ. కేసీఆర్ నాయకత్వం వరి్ధల్లాలి’ అన్నారు. దీనికి స్పందిస్తూ జనం చేయి చూపడంతో అది చూపొద్దు. మొండిచేయి డేంజర్. పిడికిలి బిగించాలి అని పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇంటింటికీ వెళ్లి బీజేపీ అభ్యర్థి దీపక్‌రెడ్డికి ఓటు వేయాలని అభ్యర్థించారు.


