సాక్షి, వరంగల్: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మె ఉధృత రూపం దాల్చేలా కనిపిస్తోంది. తాజాగా.. జిల్లాకు చెందిన ఓ మహిళా జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఒకవైపు సమ్మె.. మరోవైపు ప్రభుత్వం ఎక్కడ ఉద్యోగం తీసేస్తుందో అనే బెంగతో అఘాయిత్యానికి పాల్పడింది. ఈ ఘటనతో జేపీఎస్‌లు ప్రభుత్వంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు .
జిల్లాలోని ఖానాపూర్ మండలం కొత్తూరు రంగాపురం గ్రామ జూనియర్ పంచాయతీ కార్యదర్శి బైరి సోనీ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. సోని రెండు రోజుల కిందటే.. సమ్మె నుంచి బయటికి వచ్చి విధులకు హాజరైంది. ఈ నేపథ్యంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిందామె. దీంతో నర్సంపేట ఆసుపత్రికి తరలించగా.. మార్గం మధ్యలోనే ఆమె కన్నుమూసింది.
సోనీ వివాహిత. ఎనిమిదేళ్ల పాప కూడా ఉంది. మొత్తం పదకొండు రోజులపాటు సమ్మెలో పాల్గొన్న ఆమె.. హఠాత్తుగా విధుల్లో చేరింది. ఉద్యోగ భద్రత లేదని ఆవేదనతో ఆత్మహత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు కుటుంబ సభ్యులు. సొంత ఊరు నర్సపేటలో తన తల్లి ఇంటి వద్దే సొంతంగా సోని ఓ ఇల్లు కట్టుకుంది. అయితే ప్రభుత్వ హెచ్చరికతో ఉద్యోగం పోతే.. ఇంటి కోసం చేసిన హౌసింగ్ లోన్ ఈఎంఐ కి ఇబ్బంది ఏర్పడుతుందని ఆమె సమ్మెను వీడి వీధులకు హాజరైనట్లు సహచరులు చెబుతున్నారు.
సోనీ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, మరొకరు బలికాకుండా ఉండేందుకు ప్రభుత్వం వెంటనే జేపీఎస్ లను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
చెప్పుడు మాటలు వినొద్దు: తెలంగాణ సర్కార్
హైదరాబాద్: జూనియర్ పంచాయతీ కార్యదర్శులు విధుల్లో చేరాలని తెలంగాణ ప్రభుత్వం పిలుపు ఇచ్చింది. ‘‘మీ సమస్యలు పరిష్కరిస్తాం. ప్రభుత్వం మీ పట్ల సానుకూలత తో ఉంది. గ్రామ పంచాయతీలకు అవార్డులు రావటంలో కార్యదర్శుల కృషి ఎంతో ఉంది. కొంత మంది రెచ్చగొట్టడం వల్లే జేపీఎస్ లు సమ్మె చేస్తున్నారు. సమ్మె అనేది చివరి ఆస్త్రం.. కానీ తొందరపడి జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మెకు వెళ్ళారు.
జూనియర్ పంచాయతీ కార్యదర్శులైనప్పటికీ రాష్ట్రపతి దగ్గర అవార్డులు తీసుకునే అవకాశం దక్కింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో ఏర్పాటు చేసిన పోస్టులే ఈ పంచాయతీ కార్యదర్శులు. అలాంటిది ప్రభుత్వంపై ఉద్యోగులు నమ్మకంతో ఉండాలి అని ఒక ప్రకటనలో జేపీఎస్‌లకు పిలుపు ఇచ్చింది.
మరోవైపు జూనియర్ పంచాయతీ సెక్రటరీల సమ్మెపై అడిషనల్ కలెక్టర్లు డిస్టిక్ పంచాయతీరాజ్ ఆఫీసర్లతో సీఎస్ శాంతి కుమారి తెలంగాణ సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు విధుల్లో చేరకపోవడంపై ప్రధానంగా ఈ సమావేశం జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment