కట్టగూరు పొలం గట్టున అలనాటి చరిత్ర | Kakatiya Dynasty Stone Inscription Found In Khammam | Sakshi
Sakshi News home page

కాకతీయుల గుర్తులు: ఒకే శిల.. రెండు శాసనాలు

Feb 5 2021 9:38 AM | Updated on Feb 5 2021 1:12 PM

Kakatiya Dynasty Stone Inscription Found In Khammam - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఒకే శిల.. రెండు శాసనాలు.. ఒకటి ముత్తాత, మరోటి మునిమనవడు రాయించారు. అవి ఒకే దేవాలయానికి దానం ఇచ్చే క్రమంలో రూపొందినవే. ఆ శాసనాల వయసు 718 ఏళ్లపై మాటే.. కానీ, అవి నేటికీ పొలం గట్టు మీద పదిలం. అనగనగా ఓ ఊరు.. రచ్చబండ మీద ఓ బృందం కూర్చుంది. ఆ ఊరి దేవుడికి ఉత్సవాలకు పన్ను ద్వారా డబ్బులు వసూలు చేయాలనేది ఆ బృందం సంకల్పం. ఆ బృందం మాటను చక్రవర్తి కూడా సమ్మతించి ఆ మేరకు ఓ శాసనం రాయించారు. ఆయన మునిమనవడు చక్రవర్తి అయ్యాక అదే దేవాలయానికి పన్నురూపంలో నిధి సేకరణ ద్వారా దేవుడికి దానం ఇస్తూ తానూ శాసనం చేశారు. దానిని ముత్తాత రాయించిన శిలకే మరోవైపు రాయించారు. ఆ ముత్తాత కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడు.. ఆ మునిమనవడు రాణిరుద్రమ మనవడు ప్రతాపరుద్రుడు. ఆ పల్లె కట్టగూరు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో ఉంది. ప్రస్తుతం అక్కడ శాసనాల స్తంభం ఉన్నా ఆలయం మాత్రం లేదు. 


ఇదీ కథ..
కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడి కాలంలో ఈ ఊళ్లో దేవాలయ నిర్మాణాన్ని చేపట్టారు(శాసనం ఆధారంగా గుర్తింపు). తిరుప్రతిష్ట కోసం దానం ఇచ్చినట్టుగా క్రీ.శ.1258లో శాసనం లిఖించి ఉంది. బుర్ర సుంకం (తల పన్ను.. ప్రతి మనిషి చెల్లించాల్సిన పన్ను) నుంచి దేవాలయానికి చెల్లించాలని అందులో పేర్కొన్నారు. పౌర సేవలకు గాను విధించే పన్ను నుంచి అదనంగా కొంత రాబడి చేసుకుని దేవాలయ నిర్వహణకు చెల్లించాలన్నది ఆ శాసన ఉద్దేశం. సరిగ్గా 45 ఏళ్ల తర్వాత 1303లో అదే శిలపై మరోవైపు మునిమనవడు ప్రతాపరుద్రుడి కాలంలో అదే దేవాలయానికి దానం ఇస్తూ మరో శాసనం వేయించారు. ఆ ఊళ్లోని అష్టాదశ ప్రజలు (18 రకాల వృత్తులవారు) మహాజనులు(బ్రాహ్మణులు), నగరము (వ్యాపారుల సంఘం), కాపులు, బలంజి సెట్టిల ఆస్థానం ఈ దాన ప్రక్రియను రూపొం దించినట్టుగా అందులో ఉంది. అంటే ప్రత్యేక కమిటీలాంటిదన్నమాట. కట్టంగూరి మల్లేశ్వర, కేశవ దేవరుల భోగాలకు ఒక్కొక్క మాడ(మాడకు ఐదు రూకలు)కు ఐదు వీసాల(రూకలో 16వ వంతు) చొప్పున ఆ చంద్రార్కం చెల్లేట్టు పన్ను నుంచి చెల్లించాలని ఉంది. రెండు శాసనాల్లో గోపీనాథస్వామి పేరు ఉంది. అంటే ఇక్కడ శైవ, వైష్ణవాలయాలు ఉండేవన్నమాట. 

మొత్తం మూడు శాసనాలు
ఈ గ్రామంలో మొత్తం మూడు దాన శాసనాలున్నాయని 1956లో ప్రచురితమైన ‘ఏ కార్పస్‌ ఆఫ్‌ ఇన్‌స్క్రిప్షన్స్‌ ఇన్‌ ది తెలంగాణ డిస్ట్రిక్ట్స్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌’హైదరాబాద్‌ ఆర్కియోలాజికల్‌ సీరీస్‌ 19వ సంపుటంలో నమోదై ఉంది. ఆ మూడింటిలో రెండు ఇవే. మరోటి లభించాల్సి ఉంది. 

శిథిలాలు ఆ ఆలయానివే: కొత్త తెలంగాణ చరిత్ర బృందం
ఇటీవల కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కట్టా శ్రీనివాస్‌ ఈ శాసనాలను పరిశీలించారు. దానిపై లిఖించిన విషయాన్ని ఆ బృందం మరో ప్రతినిధి శ్రీరామోజు హరగోపాల్‌ పరిష్కరించారు. అవి ఆ పుస్తకంలో పేర్కొన్న మూడు శాసనాల్లో భాగమేనని వారు పేర్కొన్నారు. తాజా పరిశీలనలో అక్కడ ఆ ఆలయానికి సంబంధించిన కొన్ని శిథిల విగ్రహాలను గుర్తించారు. శాసన శిలకు చేరువలో.. శిశువులను ఎత్తుకుని ఇద్దరు స్త్రీమూర్తులు శ్రీదేవీభూదేవిల విగ్రహాలున్నాయి. ఆ రెంటి మధ్య ఖాళీ స్థలంలో రెండు పాదాల ఆనవాళ్లు ఉన్నాయి. అది వేణుగానముద్రలో ఉన్న గోపాలకృష్ణుడి విగ్రహం, మరోటి శాసనాల్లో పేర్కొన్న గోపీనా«థుడి విగ్రహమని తెలిపారు. మరో పక్కన శివలింగానికి చెందిన పానవట్టం, నంది విగ్రహాలున్నాయి. ఇలాంటి ప్రాంతాలను పరిశోధించి అవశేషాలు వెలుగులోకి తెస్తే, అలనాటి రాజకీయ, సామాజిక పరిస్థితులు, దేవాలయాలకు దానాలు, వాటిల్లోని విశేషాలు తెలుస్తాయని, ఆ మేరకు ప్రభుత్వం పూనుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement