
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నానని, ఎర్రవల్లి తరహాలో అభివృద్ధి చేస్తానని సీఎం కేసీఆర్ ఆదివారం ప్రకటించారు. సీఎం శనివారం జనగామ జిల్లా కొడకండ్లకు రోడ్డుమార్గంలో వెళ్లి వస్తూ వాసాలమర్రిలో ఆగి గ్రామస్తులతో మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గ్రామ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో సర్పంచ్‌ను ఆదివారం ఫాంహౌస్‌కు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ మేరకు సర్పంచ్ ఆంజనేయులు ఆధ్వర్యంలో ఎంపీపీ సుశీల, ఎంపీటీసీ సభ్యుడు నవీన్, కొందరు టీఆర్‌ఎస్ నేతలు ఎర్రవల్లి ఫాంహౌస్‌లో సీఎంను కలిశారు. వినతిపత్రం ఇవ్వబోగా అవసరం లేదని, వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకుని రూ.100 కోట్లు ఖర్చయినా అభివృద్ధి చేస్తానని సీఎం ప్రకటించారు.
వెంటనే జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్‌తో మాట్లాడి వాసాలమర్రిని ఎర్రవల్లి తరహాలో అభివృద్ధి చేయాలని, గ్రామానికి ఏమేం కావాలనే అంశాలపై బ్లూ ప్రింట్ తయారు చేయాలని ఆదేశించారు. గ్రామస్తులను ఎక్స్‌పోజర్ విజిట్ కోసం నిజామాబాద్ జిల్లా అంకాపూర్‌కు తీసుకుపోవాలని ఆదేశించారు. మరో 10 రోజుల్లో ఊరుకు వచ్చి గ్రామస్తులతో సహపంక్తి భోజనం చేస్తానని చెప్పారు. ఎర్రవల్లిని అభివృద్ధి చేసిన అప్పటి సిద్దిపేట, ప్రస్తుత సంగారెడ్డి కలెక్టర్ వెంకట్‌రామ్‌రెడ్డి, అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ శోభ, కలెక్టర్ అనితారామచంద్రన్, పలువురు అధికారులు సోమవారం వాసాలమర్రికి రానున్నారు. గ్రామసమస్యలపై సర్వే చేపట్టనున్నారు. గ్రామాభివృద్ధికిగాను బ్లూ ప్రింట్ తయారీ కోసం ప్రత్యేకాధికారిగా డీఆర్‌డీవో పీడీ మందడి ఉపేందర్‌రెడ్డిని నియమించారు. కలెక్టర్ అనితారామచంద్రన్ ఆదివారం వాసాలమర్రిని సందర్శించి సర్పంచ్, గ్రామస్తులతో అభివృద్ధి, ఉపాధి అంశాలపై చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment