సాక్షి, మేడ్చల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ముచ్చటగా మూడోసారి మూడు చింతలపల్లి (ఎంసీపల్లి) మండల కేంద్రంలో పర్యటించి వెళ్లిన తర్వాత.. ఆ మండలంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలపై జిల్లా అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ఎంసీపల్లిపై రాష్ట్ర ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నందునే జిల్లా అధికార యంత్రాంగంలో కదలిక వచ్చినట్లు తెలుస్తోంది. ‘ధరణి’ పోర్టల్ ప్రారంభోత్సవంలో భాగంగా గురువారం ఎంసీపల్లికి వచ్చిన ముఖ్యమంత్రి మూడోసారి ఈ మండలంలో పర్యటించారు. గతంలో 2017 ఆగస్టులోనూ రెండు సార్లు పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతోపాటు ఎస్‌డీఎఫ్ నుంచి నిధులు కేటాయించారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గానికి మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం పక్కనే ఉన్నందున సమీప గ్రామాల అభివృద్ధిపై సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే అధికారయంత్రాంగం ఎంసీపల్లి అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.
పెండింగ్ పనులు వేగవంతం
2017లో మూడు చింతలపల్లి మండలంలో పర్యటించిన ముఖ్యమంత్రి ఐదు గ్రామాల పరిధిలో 117 అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడమేగాక, సీడీఎఎఫ్ నుంచి రూ.66 కోట్లు మంజూరు చేయించారు. అయితే మూడేళ్లు గడచినా పనులు 20 శాతం కూడా పూర్తి కాలేదు. దీనిపై సీఎంకు సమాచారం అందడంతో పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఎంసీపల్లి పర్యటన సందర్భంగా సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం పెండింగ్ పనులపై దృష్టి సారించింది.
కేశవరంలో నిర్మాణంలో ఉన్న మల్టీ పర్పస్ ఫంక్షన్‌హాల్
అభివృద్ధి పనులివీ..
- ఎంసీపల్లి మండల పరిధిలోని కేశవరం, లక్ష్మాపూర్, మూడు చింతలపల్లి, నాగిశెట్టి పల్లి, లింగాపూర్ తండాలో 117 అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడంతోపాటు దాదాపు రూ.66 కోట్లు నిధులు మంజూరు చేశారు.
- అదే పర్యటనలో పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. మిగిలిన పనులకు నెల రోజుల వ్యవధిలోనే అప్పటి రాష్ట్ర మంత్రులు లక్ష్మారెడ్డి, మహేందర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు.
- ఆయా గ్రామాల్లో చేపట్టిన పనులను ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్, పీఆర్, విద్య, విద్యుత్, వ్యవసాయ శాఖలు పర్యవేక్షిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు పూర్తి కాలేదు.
- పనుల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించినా పురోగతి కనిపించకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
- మూడేళ్లలో 78 కార్యక్రమాలకు సంబంధించి 80 పనులు శాతం పూర్తికాగా, మరికొన్ని నత్తనడకన సాగుతున్నాయి.
- మూడు చింతలపల్లి, లక్ష్మాపూర్‌ల్లో చేపట్టిన 200 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు పునాది దశలో ఉండగా,
- కేశవరంలో 100 ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి.
నిధుల మంజూరు ఇలా..
- కేశవరం, లక్ష్మాపూర్ గ్రామాల్లో మౌలిక సదుపాయాలతోపాటు, అభివృద్ధి పనులకు సీఎంఓ ప్రత్యేక అభివృద్ధి ఫండ్స్ కింద రూ.27.76 కోట్లు విడుదల చేశారు.
- ఇందులో కేశవరం గ్రామానికి రూ. 12.26 కోట్లు కాగా, లక్ష్మాపూర్ గ్రామానికి 15.50 కోట్లు మంజూరు చేశారు.
- మూడు చింతలపల్లి గ్రామస్తులతో సీఎం కేసీఆర్ ముఖాముఖి నిర్వహించి, పంచాయతీ పరిధిలో మౌలిక వసతులు,పలు అభివద్ధి కార్యక్రమాలకు రూ. రూ.27.29 కోట్లు మంజూరు చేశారు.
- ఐదు గ్రామాల్లో సీసీరోడ్లు, మురికికాలువలు, కమ్యూనిటీ హాలు, మినీ స్టేడియం, దోభిఘాట్, స్మశానవాటిక, ట్రాన్స్‌పార్మర్లు, మహిళా భవనం, నీటి ట్యాంక్, ఆసుపత్రి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు తదితర 117 అభివృద్ధి కార్యక్రమాలకు రూ.66 కోట్లు మంజూరు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment