
సాక్షి,హైదరాబాద్: జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఉనికి లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించడం అనాలోచితమని, ఇదే విషయాన్ని రాజకీయ నేతలైన శరద్‌పవార్, దేవెగౌడ, మమతాబెనర్జీ, స్టాలిన్, ఉద్ధవ్ ఠాక్రేల పక్కన ఆయన కూర్చొని మాట్లాడ గలరా అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఎనిమిది మంది ఎంపీలున్న టీఆర్‌ఎస్ పార్టీ నేతలు 57 మంది ఎంపీలున్న కాంగ్రెస్ పార్టీకి ఉనికేలేదని మాట్లాడటం హాస్యాస్పదమన్నారు.
గాంధీభవన్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ లేదా ప్రపంచ పార్టీ అయినా పెట్టుకోవచ్చని, అది ఆయన ఇష్టమని వ్యాఖ్యానించారు. కేసీఆర్ చేస్తున్న ప్రకటనలు, అస్పష్ట రాజకీయాలతో ఆయన ప్రజల్లో చులకనవడమే కాకుండా రాష్ట్రంలో బీజేపీకి ప్రాణం పోస్తున్నట్లుందని అభిప్రాయపడ్డారు. బీజేపీకి కేసీఆర్ వ్యతిరేకమా కాదా అన్నది త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో తేలిపోతుందన్నారు. మతతత్వ పార్టీ బీజేపీతో లౌకిక భావజాలం ఉన్న కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.