ఇందిరాగాంధీ మొదలు మోదీ ప్రభుత్వం వరకు ఒకటే తీరు. ఇప్పటివరకు కేంద్రంలో పాలన సాగించిన పార్టీలన్నీ ఒకే తరహాలో పథకాలను అమలు చేశాయి. కాకుంటే పేర్లు మారుస్తారు. వైఖరి మారదు. ఈ ధోరణి విడనాడాలి. రాష్ట్రాలు సొంతంగా పనిచేసుకునే విధంగా మార్పు రావాలి.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను హరించడంలో కేంద్రంలో పాలన సాగించిన బీజేపీ, కాంగ్రెస్‌లు దొందూ దొందేనని సీఎం కేసీఆర్ విమర్శించారు. రాష్ట్రాల అధికారాలను కాలరాస్తూ, రాష్ట్రాల్లోని పాలనను కేంద్రం నియంత్రణలోకి తీసుకుంటోందని ఆందోళన వ్యక్తం చేశా రు. ఇటీవల పొరుగున ఉన్న తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా తనతో ఫోనులో మాట్లాడి కేంద్రం వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు.
శాసనసభలో గురువారం పల్లెప్రగతిపై జరిగిన స్వల్పకాలిక చర్చలో సీఎం మాట్లాడారు. ఒక్కొక్కటిగా హక్కులను దెబ్బతీస్తోంది. ‘ఉపాధి హామీ డబ్బును లబ్ధిదారు ఖాతాలోకి వేయడమొక్కటే కాదు.. పెట్రోలు, డీజిల్‌ను జీఎస్‌టీ పరిధిలోకి తెస్తానంటోంది. ఈ నిర్ణయాన్ని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించాయి. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కూడా భగ్గుమంటున్నా యి. యూపీ ఆర్థిక మంత్రి ఏకంగా గొడవకు దిగారు. ఇలా ఒక్కొక్కటిగా రాష్ట్రాల హక్కులను కేంద్రం దెబ్బతిస్తోంది. జీఎస్టీతో రాష్ట్రాలకు భారీగా నష్టం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి చాలా రాష్ట్రాలతో నేరుగా సంబంధాలుండవు.
విద్యాసంస్థలు, వైద్యశాఖల నిర్వహణ తదితర అంశాల్లో కేంద్రానికి నేరుగా సంబంధం ఉండదు. కేంద్రం లోని విద్యాశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, పట్టణాభివృద్ధి శాఖలకు సంబంధించిన కార్యాలయాలు రాష్ట్రాల్లో ఉండవు. ఇదివరకు నేను కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంతో పనిచేసిన అనుభవంతో చెప్తున్నా. ఇవన్నీ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది..’అని కేసీఆర్ అన్నారు.
స్థానిక సంస్థలకు ప్రతినెలా రూ.339.5 కోట్లు
‘స్థానిక సంస్థలను గాడిలో పెట్టిన ప్రభుత్వం మాదే. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల పరిస్థితి దారుణంగా ఉండేది. వాటిల్లో పనిచేసే కార్మికులకు నాలుగైదు నెలలకోసారి వేతనాలు వచ్చేవి. చాలాచోట్ల కారోబార్ దయతోనే జీతాలు అందుకునేవారు. ఇక పారిశుధ్య నిర్వహణ, అభివృద్ధి పనుల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుని అధికారం చేపట్టిన మా ప్రభుత్వం స్థానిక సంస్థల నిర్వహణలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపింది. ప్రతి స్థానిక సంస్థకు ప్రణాళికను తయారు చేయించాం.
వాటి నిర్వహణకు నెలకు ఠంచనుగా రూ.339.5 కోట్లు విడుదల చేస్తున్నాం. ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చే నిధులు ఆలస్యం అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఈ నిధులు క్రమం తప్పకుండా ఇస్తున్నాం. దేశంలో ఇలా ఠంచనుగా నిధులిస్తున్న ప్రభుత్వం మరొకటి లేదు. రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీకి కార్యదర్శిని నియమించి పాలనను గాడిలో పెట్టాం. స్థానిక సంస్థల అభివృద్ధి కోసం గత కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్లలో రూ.12,173 కోట్లు ఖర్చు చేస్తే, మా ప్రభుత్వం ఏడేళ్లలో రూ.58,303 కోట్లు ఖర్చు చేసింది.
బిందెలతో ధర్నాలు ఇప్పుడు లేవు
ఇదివరకు గ్రామాల్లో మంచి నీళ్లు లేక బిందెలతో ధర్నాలు చేసిన సంఘటనలు అనేకం ఉండేవి. ఇప్పుడు మిషన్ భగీరథతో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాం. గ్రామం, పట్టణం అనే తేడా లేకుండా అంతటా పచ్చదనాన్ని పెంచేందుకు హరితహారాన్ని పెద్ద ఎత్తున చేపట్టాం. ప్రతి పల్లెలో హరితవనాలు ఏర్పాటు చేశాం. వైకుంఠధామాలు, ప్రకృతి వనాలు.. ఇలా రకరకాలుగా పచ్చదనాన్ని పెంచుతున్నాం. ప్రతి మండలంలో 5 ఎకరాల విస్తీర్ణంలో బృహత్ వనాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశించాం..’అని ముఖ్యమంత్రి చెప్పారు.
పైసా ఇవ్వని కేంద్రం
‘తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలకు గాను.. పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు సంస్థలు అవార్డులతో సత్కరించాయి. మిషన్ భగీరథ, ఉపాధి హామీ పథకం అమలు తదితరాలపై నీతి అయోగ్ ప్రశంసలు కురిపించింది. మిషన్ భగీరథ ప్రాజెక్టుపై పలు రకాలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించడమే కాకుండా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రానికి సూచించింది. చివరకు కేంద్ర ప్రభుత్వం కూడా అవార్డులు ఇచ్చింది. అభినందనలు తెలిపింది. కానీ ఒక్క పైసా ఇవ్వలేదు. శుష్కప్రియాలు... శూన్య హస్తాలు అన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పైగా కేంద్రం ఇవ్వాల్సిన వాటాల్లో 25 శాతాన్ని తగ్గించడం దారుణం.
దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగికీ ఇవ్వనంతగా తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు ఇస్తున్నాం. ఇటీవల 30 శాతం పెంచాం. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, సొసైటీ ఉద్యోగులకు కూడా వేతనాలు పెంచి అందిస్తున్నాం. స్థానిక సంస్థలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులకూ గౌరవ వేతనాన్ని ఉత్తమంగా ఇస్తున్నాం, ఇక గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పనిచేసే పారిశుధ్య కార్మికుల వేతనాలు కూడా రెట్టింపు చేశాం..’అని ముఖ్యమంత్రి తెలిపారు.
వక్ఫ్ ఆస్తుల ఆక్రమణపై సీబీసీఐడీ విచారణ
‘వక్ఫ్ బోర్డు ఆస్తుల ఆక్రమణలపై సీబీసీఐడీతో విచారణ జరిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దేవాదాయ భూములు, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఎక్కడ ఆక్రమణలు జరిగినా ఉపేక్షించేది లేదు. సభ్యులు అక్బరుద్దీన్ కోరినట్లుగా సీబీసీఐడీతో విచారణ చేయించేందుకు మేము సిద్ధమే. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు తక్షణమే జారీ చేస్తాం.
వైద్యం, ఆరోగ్యంపై ప్రత్యేక కార్యాచరణ
వైద్య, ఆరోగ్యంపై మరింత శ్రద్ధ తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వ ఆస్పత్రులు నిర్మించాలని నిర్ణయించాం. గచ్చిబౌలిలో అత్యాధునిక సాంకేతికతతో టిమ్స్ ఏర్పాటు చేశాం. మరో మూడుచోట్ల కూడా వీటిని నిర్మించనున్నాం. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను తరలించి అక్కడ మరో ఆస్పత్రిని నిర్మిస్తాం. అల్వాల్ సమీపంలో, మంచిరేవులలో మరో రెండు ఆస్పత్రులు నిర్మిస్తాం. నగరానికి నాలుగు దిక్కులా ఈ ఆస్పత్రుల్ని అన్ని రకాల సదుపాయాలతో అందుబాటులోకి తీసుకొస్తాం..’అని సీఎం చెప్పారు.
సలహా బాగుందన్నారు కానీ..
‘హైదరాబాద్ చారిత్రక నగరం. ఈ నగరాన్ని ఎవరో ఒక్కరు నిర్మించడం సాధ్యం కాదు. కాలక్రమేణా అభివృద్ధి చెందుతూ, విస్తరిస్తూ వస్తోంది. దేశంలో ఇలాంటి చార్రితక నగరాలు ఐదు ఉన్నాయి. కొల్‌కతా, బెంగళూరు, చెన్నై, ముంబయి నగరాలను కూడా మరింత అభివృద్ధి చేయాలని ప్రధాని మోదీతో చాలాసార్లు చెప్పా. ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని అడగడంతో.. ప్రతి సంవత్సరం ఒక్కో నగరంలో రూ.10 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించా. ఈ సలహా బాగుందని కితాబిచ్చారు. కానీ ఇప్పటికీ పైసా ఇవ్వలేదు. నేను తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నెలరోజుల్లో హైదరాబాద్ స్థితిని చూశా. సీఎం ఇంటి ముందు చాలాచోట్ల నీళ్లు నిలవడం చూసి ఇదేందని జీహెచ్‌ఎంసీ అధికారులను అడిగితే వారంలో కొత్త ప్రణాళికతో వచ్చారు. రూ.15 వేల కోట్లు ఇస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు.
గత ప్రభుత్వాలు నగరాన్ని ఇంత దారుణంగా చేశాయని అప్పుడు తెలిసింది. కానీ ఈ నగరాన్ని మరింత బాగు చేసుకుందాం. విశ్వనగరంగా తీర్చిదిద్దుదాం. హైదరాబాద్‌ను ఇస్తాంబుల్ చేస్తానని చెప్పా. ప్రజల్లో పాజిటివ్ ఆలోచన పెంచే విధంగా చెప్పాను. కరీంనగర్‌ను డల్లాస్ చేస్తానని అనలేదు. అక్కడ గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మిస్తే లండన్ నగరంలా మారుతుందని చెప్పా. రూ.330 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతుంది..’అని కేసీఆర్ తెలిపారు.
గుండెమీద చెయ్యి వేసుకుని మాట్లాడాలి
‘ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ముందు, తర్వాత పరిస్థితిని బేరీజు వేసుకుని సభ్యులు మాట్లాడాలి. సభ్యులు చేసే చర్చ, మాట్లాడే తీరు సభ ఔన్నత్యాన్ని, హుందాతనాన్ని పెంచేలా ఉండాలి. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో చేసిన పనులు, ఇప్పుడు మా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను పోల్చి చూడండి. మంచి చేస్తే ప్రశంసించాల్సిన అవసరం కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి విమర్శలు చేయాలి.
కానీ ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై గుండె మీద చెయ్యి వేసుకుని మాట్లాడాలి..’అని సీఎం హితవు పలికారు. క్షేత్రస్థాయిలో ప్రత్యేకించి ఏమైనా సమస్యలుంటే అధికారుల దృష్టికి, మంత్రుల దృష్టికి తేవాలని, వాటిని యుద్ధప్రాతిపదికన పరిష్కరిస్తామని కేసీఆర్ చెప్పారు.
చదవండి: ఈటల స్వార్థం వల్లే ఉపఎన్నిక
Comments
Please login to add a commentAdd a comment