శనివారం ప్రగతిభవన్‌లో యాదాద్రి ఆలయ నిర్మాణ పనుల పురోగతిపై సమీక్షిస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో సీఎస్ సోమేశ్‌కుమార్, రాజీవ్‌శర్మ తదితరులు
సాక్షి, హైదరాబాద్: ‘భారతదేశంలోని పలు ప్రతిష్టాత్మక పుణ్యక్షేత్రాల స్థాయిలో యాదాద్రిని తీర్చిదిద్దుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా భక్తులు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్ర ప్రారంభం ఎప్పుడు జరుగుతుందా అని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. పనుల వేగాన్ని పెంచి మరో రెండు మూడు నెలల్లో ప్రారంభించుకునే దిశగా ఆలయ అధికారులు పూనుకోవాలి’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేపిన యాదాద్రి ఆలయం, నిర్మాణాలు పూర్తి చేసుకునే సమయానికి మరింతగా ప్రాచుర్యాన్ని పొందుతుందన్నారు. ప్రభుత్వం కూడా యాదాద్రి ప్రాశస్త్యాన్ని భక్తలోకానికి తెలియచెప్పే విధంగా సమాచారాన్ని అందిస్తుందని, చివరి అంకానికి చేరుకున్న నిర్మాణాల్లో ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలా వుండాలన్నారు.
ఆలయ పరిసరాలన్నీ ప్రశాంతతతో అలరారేలా ప్రకృతి సుందరీకరణ పనులను తీర్చిదిద్దాలని ఆదేశించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు అత్యంత సమీపంలో ఉండడంతో ఈ పుణ్యక్షేత్రానికి ప్రాధాన్యత మరింతగా పెరుగుతుందని, దేశ విదేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన టూరిస్టులు, భక్తులు యాదాద్రిని దర్శించే అవకాశాలుంటాయన్నారు. యాదాద్రి ఆలయ నిర్మాణ పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో శనివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. దేవాలయ ప్రాంగణం, టెంపుల్ టౌన్, కాటేజీలు, బస్టాండ్, ఆలయ పరిసర ప్రాంతాల సుందరీకరణ, ల్యాండ్ స్కేపింగ్, గుట్టమీదికి బస్సులు వెళ్లే మార్గాలు, వీఐపీ కార్ పార్కింగ్, కల్యాణకట్ట, పుష్కరిణి ఘాట్లు , బ్రహ్మోత్సవ, కల్యాణ మండపాలు, పోలీస్ అవుట్ పోస్టు, అన్నప్రసాదం కాంప్లెక్స్, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాల పురోగతిని సమీక్షించారు.
అయోధ్య, అక్షరధామ్ శిల్పులను రప్పించండి
క్యూలైన్ కాంప్లెక్స్ నిర్మాణం సహా ఆలయానికి తుదిమెరుగులు దిద్దేందుకు అయోధ్య, అక్షరధామ్ వంటి పుణ్యక్షేత్రాలకు పనిచేసిన అనుభజ్ఞులైన శిల్పులను పిలిపించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రస్తుత ఆర్టీసీ డిపో స్థలాన్ని దేవాలయ నిర్మాణ అవసరాల కోసం వినియోగించుకుంటున్న నేపథ్యంలో బస్‌స్టేషన్ నిర్మాణానికి గుట్ట సమీపంలో ఏడు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తున్నట్టు సీఎం ప్రకటించారు. 11 ఎకరాల స్థలంలో మూడువేలకు పైగా కార్లు పట్టే విధంగా పార్కింగ్ ఏర్పాటు చేయాలన్నారు. పూర్తిగా శాకాహారం అందించే ఫుడ్ కోర్టులను నిర్మించాలని, ఇందులో సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ వంటకాలను అందించాలన్నారు. ఎక్కడ ఖాళీ జాగ కనిపిస్తే అక్కడ భవిష్యత్తులో పచ్చదనం శోభిల్లే విధంగా మొక్కలను నాటాలన్నారు. వేప, రావి, సిల్వర్ వోక్ తదితర ఎత్తుగా పెరిగే చెట్లను నాటాలన్నారు. యాదాద్రికి సమీపంలోని గండి చెరువును అత్యద్భుతమైన ల్యాండ్ స్కేపింగుతో, వాటర్ ఫౌంటెయిన్లతో తీర్చిదిద్దాలన్నారు. బ్రహ్మోత్సవాలు, తెప్పోత్సవాలను నిర్వహించుకునేందుకు వీలుగా సుందరీకరణ పనులుండాలన్నారు.
90 ఎకరాల్లో భక్తి ప్రాంగణం
యాదాద్రి టెంపుల్ సిటీలో 250 డోనార్ కాటేజీలను అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దాలని సీఎం అన్నారు. ప్రతి యాభై కాటేజీలకు ప్రత్యేక డిజైన్ ఉండాలన్నారు. భక్త ప్రహ్లాద సహా అమ్మవార్ల పేర్లను కాటేజీలకు పెట్టుకోవాలన్నారు. ప్రెసిడెన్షియల్ సూట్ నిర్మాణంపై సీఎం ఆరా తీశారు. వేలాది మంది హాజరయ్యే విధంగా కల్యాణ మండపాల నిర్మాణాలుండాలన్నారు. పుణ్యక్షేత్ర ప్రాంగణంలో ఆధ్యాత్మిక ప్ర సంగాలు, స్వాములతో ప్రవచనాలను కొనసాగించేందుకు లక్షలాది మంది కూర్చునే విధంగా తొంభై ఎకరాల్లో భక్తి ప్రాంగణాన్ని నిర్మించాలని సీఎం చెప్పారు. దేవాలయ విమాన గోపురాన్ని బంగారు తాపడంతో తీర్చిదిద్దాలన్నారు. రింగు రోడ్డు నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టరును సీఎం ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment