Telangana Job Notification 2021: 65 వేల ఉద్యోగాల భర్తీపై రేపు కీలక ప్రకటన! - Sakshi
Sakshi News home page

Telangana: 65 వేల ఉద్యోగాల భర్తీపై రేపు కీలక ప్రకటన!

Sep 15 2021 3:52 AM | Updated on Sep 15 2021 9:08 AM

Key Announcement Tomorrow on Job Notification Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై గురువారం స్పష్టత రానుంది. ఏయే శాఖల్లో, ఎన్ని పోస్టుల భర్తీ, వాటికి సం బంధించిన నోటిఫికేషన్ల జారీ, ఇతర అంశాలపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో కేబినెట్‌ భేటీ జరగనుంది. అందులో ఉద్యోగాల భర్తీతోపాటు పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి. 

65 వేల పోస్టులతో.. 
రాష్ట్రంలో సుమారు 50 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపడతామని సీఎం కేసీఆర్‌ గత ఏడాది డిసెంబర్‌ 13న ప్రకటించిన విషయం తెలిసిందే. అర్హులైన ప్రభుత్వ ఉద్యోగులందరికీ పదోన్నతులు కల్పించాలని, తద్వారా ఏర్పడే కొత్త ఖాళీలను సైతం గుర్తించి భర్తీ చేయాలని కూడా నిర్ణయించారు. అయితే.. ఉద్యోగుల పదోన్నతులు, స్థానికతపై రాష్ట్రపతి ఉత్తర్వులు, జిల్లా, జోనల్, మల్టీ జోనల్‌ కేడర్లుగా పోస్టుల విభజన, ఖాళీల గుర్తింపు ప్రక్రియలు సుదీర్ఘంగా సాగాయి. ఆర్థిక శాఖ ఇటీవలే ఈ అంశాలను కొలిక్కి తెచ్చింది. 65వేలకుపైగా ఖాళీ పోస్టులను గుర్తించింది.

ఈ ప్రతిపాదనలపై మంత్రివర్గ భేటీలో చర్చించి ఆమోద ముద్ర వేసే అవకాశం ఉందని ఉన్నతాధికారవర్గాలు తెలిపాయి. 50 వేల నుంచి 65వేల పోస్టుల భర్తీకి ఒకేసారి నోటిఫికేషన్లు జారీ దిశగా నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొన్నాయి. దీనితోపాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఆదాయ అవసరాలు, వనరుల సమీకరణ, దళితబంధు పథకానికి చట్టబద్ధత తదితర అంశాలపైనా కేబినెట్‌ చర్చించనున్నట్టు వెల్లడించాయి. వనరుల సమీకరణలో భాగంగా మైనింగ్‌ రంగంలో సంస్కరణల అమలు, భూముల వేలానికి సంబంధించిన పలు ప్రతిపాదనలపైనా నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొన్నాయి. 

రెండు కొత్త ఎత్తిపోతల పథకాలు 
సింగూరుపై రెండు భారీ ఎత్తిపోతల పథకాలను నిర్మించాలనే ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించే అవకాశాలు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, ఆందోల్, నారాయణ్‌ఖేడ్, జహీరాబాద్‌ నియోజకవర్గాల పరిధిలో 3.84 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చే లక్ష్యంతో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల డీపీఆర్‌లు ఇప్పటికే సిద్ధమయ్యాయి. వాటిపై మంత్రివర్గ భేటీలో చర్చించి ఆమోదించనున్నారు. సంగమేశ్వర ఎత్తిపోతలను రూ.3,916 కోట్లతో, బసవేశ్వర లిఫ్టును రూ.2,750 కోట్లతో చేపట్టేలా ప్రతిపాదనలు రూపొందించారు. అయితే వ్యయాన్ని తగ్గించడం కోసం సీసీ లైనింగ్‌ పనులను తొలగించి మొత్తం రూ.4,500 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టులను పూర్తిచేయాలని, నాబార్డ్‌ నుంచి రూ.2వేల కోట్ల సాయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. 
  
వరి సాగుపై అనిశ్చితిపై.. 
బాయిల్డ్‌ రైస్‌ కొనుగోళ్లపై కేంద్రం విముఖత నేపథ్యంలో వచ్చే యాసంగిలో వరి సాగుపై ప్రతిష్టంభన నెలకొంది. వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు వేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సూచించింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో రైతులను సన్నద్ధం చేయడం, వానాకాలం సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు తదితర అంశాలపై కేబినెట్‌లో నిర్ణయాలు తీసుకోనున్నారు. 
 
22 నుంచి వర్షాకాల సమావేశాలు! 
ఈ నెల 19తో హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జనం పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో 22వ తేదీ నుంచి శాసనసభ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహాలు, ఇతర అంశాలపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement