సాక్షి, ఖమ్మం లీగల్ : ఇంట్లో మగపిల్లాడు పుట్టగానే సంతోషపడే వారున్నారు. కానీ ఆ పుత్రుడు వృద్ధిలోకి వస్తేనే తల్లిదండ్రులకు అసలైన సంతోషమన్నది జగమెరిగిన సత్యం. ఈ విషయం రిక్షా కార్మికుడైన ఓ వ్యక్తి విషయంలో అక్షరాలా నిజమైంది. రిక్షా నడుపుకునే వ్యక్తి తన కొడుకు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని తపించగా... ఆ కుమారుడు ఏకంగా న్యాయమూర్తిగా ఎంపికై తన తండ్రికి పుత్రోత్సాహం కలిగించాడు.. నలుగురితో శభాష్ అనిపించుకున్నాడు. ఆయనే ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జడ్జి డాక్టర్ టి.శ్రీనివాసరావు. మా కుటుంబం పేదరికంలో ఉంది. మాకు సరైన వనరులు లేవు. అందుకే చదువుకోలేకపోయాం.. జీవితంలో సాధించలేకపోయాం అని బాధపడే ఎందరో యువతకు న్యాయమూర్తి జీవితం, ఆయన ప్రస్థానం స్ఫూర్తిదాయకం.
పనిచేస్తూనే చదువు
ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌లో జల్లయ్య – నాగమ్మ దంపతులకు శ్రీనివాసరావు జన్మించారు. తండ్రి రిక్షా కార్మికుడు కాగా, తల్లి నాగమ్మ సాధారణ గృహిణి. ఈ నేపథ్యంలో ప్రాథమిక విద్య ప్రభుత్వ పాఠశాలలో పూర్తి చేశాక, పదో తరగతి చదువుతున్నప్పుడు జాతీయ పర్వదినాల్లో ప్రముఖులు జాతీయ జెండా ఎగురవేయడం చూసిన ఆయన తాను కూడా జాతీయజెండా ఎగురవేసే స్థాయికి చేరుకోవాలని నిశ్చయించుకున్నారు. అయితే అందుకు కుటుంబ ఆర్ధిక పరిస్థితులు సహకరించకపోవడంతో ఒక బట్టల షాపులో పనికి కుదిరాడు.
అయినప్పటికీ తన లక్ష్యాన్ని మరిచిపోకుండా ఒకవైపు పనిచేస్తూనే.. మరోపక్క చదువుకుంటూ అత్యధిక మార్కులతో పట్టభద్రుడయ్యారు. ఆ తర్వాత ఆయన న్యాయశాఖపై దృష్టి సారించారు. ఒక న్యాయమూర్తిగా న్యాయార్థులకు సేవలు అందించవచ్చని, అక్రమార్కులను శిక్షించవచ్చని భావించిన శ్రీనివాసరావు న్యాయశాస్త్ర పట్టా పొంది 1995లో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. వృత్తిలో రాణిస్తూనే 2005లో మెజిస్ట్రేట్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం జిల్లా ప్రధాన న్యాయమూర్తి స్థాయికి చేరుకున్నారు.
ఆత్మసంతృప్తికి తావ్వివక..
చాలా మంది ప్రభుత్వ ఉద్యోగం సాధించామనో, వ్యాపారంలో రాణించామనో ఓ స్థాయికి చేరుకున్నాక సంతృప్తి పడతారు. అయితే శ్రీనివాసరావు మాత్రం దీనికి పూర్తిగా భిన్నం. న్యాయమూర్తిగా తన విధులు సమర్థవంతంగా నిర్వర్తిస్తూనే న్యాయపాలన, వివిధ దేశాల చట్టాలు తదితర అంశాలపై తులనాత్మక అధ్యయనం చేశారు. 2007 నుంచి 2017 వరకు 52 అంశాలపై పేపర్ ప్రజెంటేషన్ చేశారు. ‘సత్వర న్యాయం’ అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందారు. ఆయన రాసిన వ్యాసాలు అనేక ప్రఖ్యాత జర్నళ్లలో ప్రచురితం కావడం విశేషం. అంతేకాకుండా ‘మోరాలిటీ ఇన్ లీగల్ సిస్టమ్’ అనే పుస్తకాన్ని కూడా రాశారు.
సంచలనాత్మక కేసుల్లో తీర్పులు
హైదరాబాద్‌లో సెషన్స్ జడ్జిగా పనిచేసిన కాలంలో శ్రీనివాసరావు ఎన్నో సంచలనాత్మక కేసుల్లో తీర్పులిచ్చారు. గోకుల్‌చాట్, లుంబినీపార్క్, దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసుతో పాటు పాస్‌పోర్ట్ ఆఫీస్‌లో పేలుళ్లు, అక్బరుద్దీన్ ఒవైసీపై దాడి తదితర సంచలనాత్మక కేసుల్లో తీర్పులిచ్చారు శ్రీనివాసరావు. కాగా, ఉగ్రవాద సంబంధ కేసుల్లో తీర్పులు ఇచ్చిన ఆయన భద్రత కోసం ప్రభుత్వం అంగరక్షకులను నియమించింది. న్యాయశాస్త్రంలో చివరి అంచులను చూసి డాక్టరేట్ పట్టా పొంది జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నా ఆయన సాధారణ జీవితం గడపడానికే ఇష్టపడతారు.
సమయపాలనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే శ్రీనివాసరావు వృత్తి పట్ల నిబద్ధతతో ఉండడమే కాక సిబ్బంది సంక్షేమం విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. ఖమ్మంలో పదవీ బాధ్యతలు స్వీకరించిన మరుసటి రోజు నుంచే అర్హులైన ఉద్యోగులకు పదోన్నతి ఇవ్వడం ప్రారంభించిన ఆయన, న్యాయవాదుల సమస్యలు పరిష్కరించేందుకు పూనుకున్నారు. కాగా, సమస్య ఎవరిదైనా తన పరిధిలో ఉంటే సకా రాత్మక ధోరణిలో పరిశీలించే శ్రీనివాసరావు, కేసుల సత్వర పరిష్కారంలో జిల్లాను ఆగ్రస్థానంలో నిలపడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment