సాగర్ నీటిమట్టం స్కేల్
సాక్షి, హైదరాబాద్/దోమలపెంట(అచ్చంపేట)/గద్వాల రూ రల్/నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ వైపు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. శనివారం సాయంత్రం 6 గంటలకు 1,15,389 క్యూసెక్కులు ప్రాజెక్టులోకి చేరుతుండటంతో సాగర్‌లో నీటి నిల్వ 539.3 అడుగుల వద్ద 186.87 టీఎంసీలకు చేరుకుంది. శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకోవడం.. ఎగువ నుంచి వరద కొనసాగుతుండటంతో శనివారం ఉదయం 11కి ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మూడు గేట్లను 10 మీటర్ల మేర ఎత్తి 80 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు.
గతేడాది కంటే ఈ ఏడాది ఐదు రోజుల ముందే శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తేయడం గమనార్హం. శనివారం సాయంత్రానికి వరద ప్రవాహం తగ్గడంతో ఒక గేటును మూసేసి రెండు గేట్లను 10 మీటర్ల మేర ఎత్తి 53,580 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో నాగార్జునసాగర్ వైపు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. శనివారం సాయంత్రం 6కి శ్రీశైలం ప్రాజెక్టులోకి 1,21,893 క్యూసెక్కులు చేరుతుండగా కుడిగట్టు కేంద్రంలో ఏపీ జెన్‌కో విద్యుదుత్పత్తి చేస్తూ 26,273 క్యూసెక్కులను, ఎడమగట్టు కేంద్రంలో తెలంగాణ జెన్‌కో విద్యుదుత్పత్తి చేస్తూ 31,784 క్యూసెక్కులను..
రెండు గేట్ల ద్వారా 53,580 క్యూసెక్కులు వెరసి 1,11,167 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 17 వేలు, హంద్రీ–నీవా ద్వారా 1,013 వెరసి 18,013 క్యూసెక్కులు ఏపీ తరలిస్తుండగా.. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 800 క్యూసెక్కులను తెలంగాణ తరలిస్తోంది. ప్రస్తుతం శ్రీశైలంలో 882.20 అడుగుల్లో 201.19 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
ఆల్మట్టి, నారాయణపూర్ గేట్లు బంద్..
కర్ణాటకలో కృష్ణా ప్రధాన పాయపై ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లతోపాటు ప్రధాన ఉప నది తుంగభద్రపై ఉన్న తుంగభద్ర డ్యామ్‌లోకి చేరుతున్న వరద తగ్గిపోయింది. దీంతో శనివారం సాయంత్రం ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌ల గేట్లను మూసేశారు. తుంగభద్ర డ్యామ్ నుంచి 23,844 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.
సాగర్ దిగువన కృష్ణమ్మ పరవళ్లు...
సాగర్‌కు దిగువన కురిసిన వర్షాల వల్ల మూసీ నుంచి కృష్ణాలోకి చేరుతున్న 6,150 క్యూసెక్కులు పులిచింతలలోకి చేరుతున్నాయి. దీంతో పులిచింతలలో నీటినిల్వ 38.18 టీఎంసీలకు చేరుకుంది. పులిచింతలకు దిగువన పరీవాహక ప్రాంతంలో కురిసిన వర్షాల వల్ల మున్నేరు, కట్టలేరు వంటి వాగులు, వంకల ద్వారా కృష్ణా నదిలోకి 23,464 క్యూసెక్కులు చేరుతోంది. ఆ ప్రవాహం ప్రకాశం బ్యారేజీకి చేరుతుండటంతో కృష్ణా డెల్టాకు 6,706 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 16,758 క్యూసెక్కులను గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment