వివక్ష వీడితేనే దేశాభివృద్ధి | KTR Released Telangana Industries Department Annual Report 2022 | Sakshi
Sakshi News home page

వివక్ష వీడితేనే దేశాభివృద్ధి

Published Tue, Jun 7 2022 12:59 AM | Last Updated on Tue, Jun 7 2022 12:59 AM

KTR Released Telangana Industries Department Annual Report 2022 - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై కేంద్రం వివక్షను విడనాడి రాజకీయాలకు తక్కువ ప్రాధాన్యతనిస్తూ ఆర్థిక విధానాలకు పెద్దపీట వేసినపుడే దేశంలో అభివృద్ధి సాధ్యమవు తుందని మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. రాష్ట్రాలు బాగుపడితేనే దేశం పురోగమి స్తుందనే విషయాన్ని కేంద్రంలో అధికారంలో ఉన్నవారు గుర్తించాలని కోరారు.

ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయం అన్నారు. తెలంగాణ పరిశ్రమల శాఖ 2021–22 వార్షిక నివేదికను సోమవారం హైదరాబాద్‌లో ఆయన విడుదల చేశారు. ‘దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయినా ఇంకా మూడో ప్రపంచ దేశాల జాబితాలోనే భారత్‌ ఉంది. తయారీ రంగాన్ని ప్రోత్సహించడం ద్వారానే అమెరికా, చైనా, ఇండోనేషియా వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థలతో పోటీ పడటం సాధ్యమవుతుంది. సహకార సమాఖ్య వ్యవస్థ మీద ప్రధాని మోదీకి నమ్మకం ఉంటే అభివృద్ధి చెందే రాష్ట్రాలను శిక్షించకుండా, ప్రోత్సహించాలి..’ అని కేటీఆర్‌ హితవు పలికారు.

కలిసికట్టుగా ముందుకు సాగుదాం
‘1987లో భారత్, చైనా ఆర్థిక వ్యవస్థలు ఒకే రీతిలో ఉన్నా.. 35 ఏళ్లుగా చైనా అవసరమైన అంశాలపైనే దృష్టి పెట్టింది. భారత్‌తో పోలిస్తే చైనా 5.78 రెట్ల వృద్ధి సాధించి ప్రపంచంలో అమెరికా తర్వాత రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఈ నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ వెనుకబాటుకు కారణాలు తెలుసుకుని కలిసికట్టుగా ముందుకు సాగుదాం’ అని మంత్రి పిలుపునిచ్చారు.

త్వరలో రాష్ట్రంలో ‘ఎల్లో రివల్యూషన్‌’
‘2014తో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయంలో 128 శాతం, జీఎస్‌డీపీలో 130 శాతం వృద్ధి సాధించింది. ఇప్పటికే వ్యవసాయ (గ్రీన్‌), క్షీర (వైట్‌), మత్స్య (బ్లూ), మాంసం (పింక్‌) విప్లవాలు సాధించిన తెలంగాణ త్వరలో ఆయిల్‌పామ్‌ సాగు ద్వారా పసుపు (ఎల్లో) విప్లవం సాధిస్తుంది..’ అని తెలిపారు. వీధి వ్యాపారుల కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలనే సూచనలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు.

ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, పారిశ్రామిక రంగ ప్రముఖులు రంజిత్‌ రామచంద్రన్, మహేశ్‌ అడప, దివ్యప్రకాశ్‌ జోషి, శేఖర్‌రెడ్డి, నర్రా రవికుమార్, కొండవీటి సుధీర్‌రెడ్డి తెలంగాణ ప్రభుత్వ విధానాలు, పెట్టుబడులు, విద్యుత్, ఎంఎస్‌ఎంఈలు తదితర అంశాలపై మాట్లాడారు. పారిశ్రామిక పురోగతి వేగంగా జరుగుతున్న రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లా పరిశ్రమల కేంద్రం అధికారులను కేటీఆర్‌ సన్మానించారు. సమావేశంలో టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, టీఎస్‌ఐడీసీ చైర్మన్‌ అమరవాది లక్ష్మీనారాయణ, పరిశ్రమల శాఖ కమిషనర్‌ కృష్ణ భాస్కర్, టీఎస్‌ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డితో పాటు పరిశ్రమల శాఖ అనుబంధ విభాగాల డైరెక్టర్లు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement