సాక్షి, హైదరాబాద్: డాలర్‌తో పోలిస్తే రూపా యి మారకం విలువ ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి పడిపోవడంపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘రూపాయి విలువ ఎన్నడూ లేనంత దిగజారింది. కానీ అబద్ధాలు మాత్రం ఎన్నడూ లేనంతగా పెరిగా యి. రూపాయి విలువ ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి పడిపోతున్నా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం రేషన్ షాపుల్లో ప్రధాని మోదీ ఫొటోను వెతకడంలో తీరిక లేకుండా ఉన్నారు.
రూపాయి తన సహజ మార్గంలో వెళ్తోందని, ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం తదితరాలన్నీ దేవుడి లీలలు అని మీకు చెప్తారు. విశ్వగురు వర్ధిల్లాలి అని నినదించమంటారు’అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘రూపాయి విలువను ప్రపంచ మార్కెట్లు, ఫెడ్ రేట్లు ఎలా ప్రభావితం చేస్తున్నాయో చూడండి అంటూ జ్ఞానా న్ని అందజేస్తున్న భక్తులందరూ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది.
విశ్వగురు మోదీ మీ వాదనను అంగీకరించరు. ఆయన జ్ఞాన సంపదలోని కొన్ని ఆణిముత్యాలను మీ దృష్టికి తెస్తున్నా. ‘కేంద్రంలో అవినీతి పెరగడం వల్లే రూపాయి విలువ పడిపోతోంది. రూపా యి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంది’ అంటూ 2013లో గుజరాత్ సీఎంగా మోదీ నాటి యూపీఏ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చేసిన ట్వీట్లను పదుల సంఖ్యలో కేటీఆర్ తన వ్యాఖ్యలకు జోడించారు.
ప్రభుత్వ పనితీరుకు మన్ననలు..
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రాష్ట్రానికి అవార్డుల పంట పండటంపై పంచాయతీరాజ్ మంత్రి దయాకర్‌రావును మంత్రి కేటీఆర్ అభినందించారు. రాష్ట్రంలోని 12,769 మంది సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, పంచాయతీ సెక్రటరీలకు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ ర్యాంకుల్లో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలవడం గర్వకారణమన్నారు.
సీఎం కేసీఆర్ మానసపుత్రిక ‘పల్లె ప్రగతి’ద్వారానే ఇది సాధ్యమైందన్నారు. రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేసినా తమ ప్రభుత్వ పనితీరు అనేక మంది మన్ననలు పొందుతూ, మనసు చూరగొంటోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రైతుబీమాకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,450 కోట్లు విడుదల చేయడంపై స్పందిస్తూ దేశంలో కేవలం తెలంగాణ ప్రభుత్వమే రైతులకు జీవిత బీమా చేస్తోందని, ఇప్పటివరకు రైతు బీమా ద్వారా 85 వేల మంది రైతు కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున సాయం అందించిందన్నారు. ఈ ఏడాది 34 లక్షల మంది రైతులకు వర్తించేలా రూ. 1,450 కోట్లు ప్రీమియంగా చెల్లించామన్నారు.
సెర్బియా సదస్సుకు ఆహ్వానం...
అక్టోబర్ 20న సెర్బియాలోని బెల్‌గ్రేడ్‌లో జరిగే ‘బయోటెక్ ఫ్యూచర్ ఫోరమ్’సదస్సుకు హాజరు కావాలంటూ సెర్బియా ప్రభుత్వం మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం పంపింది. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ సెర్బియా ప్రధాని అనా బ్న్రాబిక్‌కు కృతజ్ఞతలు తెలిపారు. లైఫ్ సైన్సెస్ రంగంలో ప్రత్యేకించి బయో టెక్నాలజీ రంగంలో తెలంగాణ సామర్థ్యానికి ఈ ఆహ్వానాన్ని గుర్తింపుగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment