అమెరికా ఇండియా వర్చువల్ సదస్సులో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, కార్యదర్శి జయేశ్ రంజన్
సాక్షి, హైదరాబాద్: పెట్టుబడుల ఆకర్షణ మొదలుకుని పరిపాలన, పథకాల అమల్లో తెలంగాణ స్వయం సమృద్ధి సాధన దిశగా పయనిస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు చెప్పారు. తెలంగాణ నుంచి ఇతరులు స్ఫూర్తి పొందాల్సిన అవసరముందన్నారు. యూఎస్–ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరం శుక్రవారం నిర్వహించిన అమెరికా ఇండియా వర్చువల్ సదస్సులో కేటీఆర్ ప్రసంగించారు. కరోనా సంక్షోభంలోనే అనేక అవకాశాలున్నాయని, దేశంలోని ప్రగతిశీల రాష్ట్రాలు చేపడుతున్న కార్యక్రమాలు, విధానాలను దృష్టిలో పెట్టుకుని పెట్టుబడులతో ముందుకు రావాలని కోరారు. ప్రపంచ దేశాలతో పోల్చిచూస్తే సులభతర వాణిజ్య విధానం (ఈఓడీబీ)లో తెలంగాణకు టాప్ 20లో చోటు దక్కే అవకాశముందని వెల్లడించారు. యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ఆరేళ్లుగా టాస్క్ ద్వారా శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. విద్యార్థులు చదువుతూ పనిచేసుకునే రీతిలో డ్యూయల్ డిగ్రీ విధానం తేవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.
డిజిటలైజేషన్ ద్వారానే సేవలు..
ప్రస్తుత పరిస్థితుల్లో డిజిటలైజేషన్ ద్వారానే అనేక సేవలు అందుకునే అవకాశముందని కేటీఆర్ అన్నారు. విద్యా రంగంలో డిజిటలైజేషన్ అవసరముందని చెప్పారు. భారత్‌లో ఆవిష్కరణలకు మరింత ప్రోత్సాహం ఇవ్వాలని, టీహబ్, వీహబ్, టీ వర్క్స్ వంటి వినూత్న కార్యక్రమాలతో ముందుకు పోవాలన్నారు. నూతన ఐటీ సాంకేతికత కృత్రిమ మేధస్సు (ఏఐ) ద్వారా ఆరోగ్య, వ్యవసాయ రంగాలను మరింత బలోపేతం చేసేందుకు ముందుకు వచ్చే వారికి ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం అందిస్తామని మంత్రి ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment