హైదరాబాద్: మద్యం షాపులకు దరఖాస్తులు పోటెత్తుతున్నాయి. మరో నాలుగు రోజుల్లో గడువు ముగియనుండడంతో దరఖాస్తులు దాఖలు చేసేందుకు సోమవారం క్యూకట్టారు. సరూర్‌నగర్ ఎక్సైజ్ జిల్లా పరిధిలో 134 షాపులు ఉండగా, వీటిలో ఇప్పటి వరకు 2,700పైగా దరఖాస్తులు వచ్చాయి.శంషాబాద్ ఎక్సైజ్ జిల్లా పరిధిలో వంద షాపులు ఉండగా, 3,300 వచ్చాయి. ఇన్నర్‌రింగ్‌రోడ్డుకు అటు ఇటుగా ఉన్న ఒక్కో షాపునకు సగటున 25 దరఖాస్తులు రావడం విశేషం. ఎలాగైనా షాపులను దక్కించుకోవాలనే ఉద్దేశంతో కొంతమంది వ్యాపారులు సిండికేట్‌గా మారి.. బినామీ పేర్లతో ఒకే షాపుపై టెండర్లు దాఖలు చేస్తున్నారు.
ఒకరు టెండరు వేసిన చోట మరొకరు వేయకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇలా ఇప్పటి వరకు కేవలం ఈ దరఖాస్తుల ద్వారానే ప్రభుత్వానికి సుమారు రూ.12 కోట్ల ఆదాయం సమకూరినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నెల 18తో దరఖాస్తుకు గడువు ముగియనుంది. వచ్చే చివరి మూడు రోజుల్లో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. శేకిలింగంపల్లి ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని షాపులకు దరఖాస్తులు భారీగా వచ్చాయి. ఈ ఒక్క స్టేషన్ పరిధిలోనే 1,700 పైగా రావడం గమనార్హం.
21న లక్కీడ్రా
మద్యం షాపుల లైసెన్సుల గడువు నవంబర్ 30తో ముగియనుంది. డిసెంబర్ నుంచి కొత్త లైసెన్సుల విధానం అమల్లోకి రావాల్సి ఉంది. అంతకు ముందే సాధారణ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండడంతో ప్రభుత్వం అప్రమత్తమై ముందస్తు లైసెన్సుల జారీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 4న దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించింది. ఒక్కో దరఖాస్తుకు ఫీజు రూ.2 లక్షలుగా(నాన్ రిఫండబుల్) నిర్ణయించింది. ఈ పది రోజుల్లోనే 234 షాపులకు 6,000 దరఖాస్తుల అందడం విశేషం. గతంలో మాదిరే ఈసారి కూడా గౌడ, ఎస్సీ, ఎస్టీ కులాలకు రిజర్వేషన్లు వర్తింపజేసింది. ఈ మేరకు లాటరీ ద్వారా ఆయా కులాలకు కేటాయించే షాపుల సంఖ్యను నిర్ధారించింది. ఈ నెల 21న శంషాబాద్‌లోని మల్లికా కన్వెన్షన్‌లో లక్కీడ్రా నిర్వహించనుంది. ఈ డ్రా ద్వారా దరఖాస్తుదారులకు షాపులను కేటాయించి, ఆయా షాపులకు 30న కొత్త సరుకును అందజేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment