తెలంగాణలో మరో పదిరోజులు లాక్‌డౌన్‌ పొడిగింపు | Lockdown In Telangana Extended More 10 Days Says Cabinet Meeting By KCR | Sakshi
Sakshi News home page

తెలంగాణలో మరో పదిరోజులు లాక్‌డౌన్‌ పొడిగింపు

Published Sun, May 30 2021 6:37 PM | Last Updated on Mon, May 31 2021 3:49 AM

Lockdown In Telangana Extended More 10 Days Says Cabinet Meeting By KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ను మరో పది రోజుల పాటు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే సమయంలో లాక్‌డౌన్‌ మినహాయింపు సమయాన్ని పెంచింది. ఈ మేరకు ఆదివారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ప్రగతిభవన్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సుదీర్ఘంగా జరిగిన ఈ భేటీలో లాక్‌డౌన్‌తోపాటు పలు ఇతర అంశాలపైనా కేబినెట్‌ చర్చించి ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం ఉదయం 6 నుంచి పది గంటల వరకు మినహాయింపు ఉండగా.. దీనిని మధ్యాహ్నం ఒంటి గంట వరకు పొడిగించారు. జనం ఇళ్లకు తిరిగి చేరుకునేందుకు మరో గంట సమయం ఇచ్చారు. అంతా 2 గంటలకల్లా గమ్యస్థానాలకు వెళ్లిపోవాల్సి ఉంటుంది. 

కరోనా నియంత్రణపై దృష్టి పెట్టాలి 
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీరు, నియంత్రణ, బాధితులకు అందుతున్న వైద్యం, నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై మంత్రివర్గం చర్చించింది. కరోనా వ్యాప్తి తగ్గుతోందని ఉన్నతాధికారులు ఈ సందర్భంగా వివరించగా.. వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ఖమ్మం, మధిర, సత్తుపల్లి, అలంపూర్, గద్వాల, నారాయణపేట్, మక్తల్, నాగార్జునసాగర్, కోదాడ, హుజూర్‌నగర్‌ వంటి రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో వైద్యారోగ్య శాఖ కార్యదర్శి పర్యటించాలని కేబినెట్‌ సూచించింది. సెకండ్‌ వేవ్‌ తగ్గుతున్నట్టు వార్తలు వస్తున్నా.. థర్డ్‌ వేవ్‌ వస్తుందన్న అంచనాలు ఉన్నాయని, దీనిపై అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖను ఆదేశించింది. మూడో వేవ్‌ వస్తే ఎదుర్కొనేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని పేర్కొంది. రాష్ట్రంలోని అన్ని ఏరియా, జిల్లా ఆస్పత్రులు, పీహెచ్‌సీల్లో పరిస్థితులను సమీక్షించి, మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. 

నెల రోజుల్లో జైలు ఖాళీ చేయండి 
వరంగల్‌ సెంట్రల్‌ జైలు ప్రాంగణంలో మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి కేబినెట్‌ ఓకే చెప్పింది. ప్రస్తుతమున్న ఖైదీలను ఇతర ప్రాంతాలకు తరలించి.. నెల రోజుల్లోగా స్థలాన్ని వైద్య శాఖకు అప్పగించాలని హోంశాఖను ఆదేశించింది. మామునూరులో విశాలమైన ప్రదేశాన్ని ఎంపిక చేసి.. అత్యాధునిక వసతులతో కూడిన జైలును నిర్మించాలని నిర్ణయించింది. 

జూన్‌ 15 నుంచి రైతుల ఖాతాల్లోకి ‘రైతు బంధు’ 
రాష్ట్రంలో రుతుపవనాల ప్రవేశం, వానాకాలం సీజన్‌ నేపథ్యంలో రైతులు, వ్యవసాయ సంబంధ అంశాలపైనా మంత్రివర్గం చర్చించింది. రైతుబంధు ఆర్థిక సాయాన్ని వచ్చే నెల 15 నుంచి 25వ తేదీ మధ్య రైతులకు అందజేయాలని నిర్ణయించింది. జూన్‌ పదిని కటాఫ్‌ తేదీగా నిర్ణయించి.. పార్ట్‌ బి నుంచి పార్ట్‌ ఏలోకి మారిన భూముల వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాలని ఆదేశించింది.
 
వరిలో ‘వెదజల్లే విధానం’అనుసరించాలి 
రైతుబంధు సమితులను క్రియాశీలం చేయడంతోపాటు రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిరంతం జరిగేలా చూడాలని.. అందులో వ్యవసాయ అధికారులు కూడా పాల్గొనాలని మంత్రివర్గం ఆదేశించింది. వానాకాలంలో వరి, పత్తి, కంది పంటల సాగుపై అవగాహన కల్పించాలని సూచించింది. వరి నాట్లు వేసే పద్ధతి కాకుండా వెదజల్లే విధానాన్ని అవలంబించాలని రైతులకు మంత్రివర్గంæ పిలుపునిచ్చింది. 

కేబినెట్‌ తీసుకున్న మరిన్ని నిర్ణయాలు..
కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా అతి తక్కువ మందితో రాష్ట్రావతరణ వేడుకల నిర్వహణ. జిల్లాల్లో మంత్రులు అమరవీరులకు నివాళి అర్పించి జాతీయ పతాకాన్ని ఎగురవేయాలి. 
 చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వారి అడ్మిషన్‌ లెటర్‌ ఆధారంగా వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యత. దీనిపై విధి విధానాలు ఖరారు చేయాలని వైద్యశాఖకు ఆదేశం. 
రాష్ట్రంలో వ్యవసాయ కార్యకలాపాలు విస్తరిస్తున్న నేపథ్యంలో ఆ శాఖలో కొత్తగా రెండు అదనపు డైరెక్టర్‌ పోస్టులు మంజూరు. 
 రాష్ట్రంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల కోసం తొమ్మిది, పది క్లస్టర్లలో స్థలాల గుర్తింపునకు ఆదేశం. 
వానాకాలం సీజన్‌ వస్తుండటంతో.. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉండేలా చూడాలని వ్యవసాయ శాఖకు... కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు అమ్మేవారి పట్ల కఠినంగా ఉండాలని వ్యవసాయ, హోం, విజిలెన్స్‌ విభాగాలకు ఆదేశాలు.. 
ప్రస్తుతం అమలవుతున్న బీసీ రిజర్వేషన్లను మరో పదేండ్లు పొడిగించాలని కేబినెట్‌ నిర్ణయించింది. 
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా హైదరాబాద్‌లోని నెక్లెస్‌ రోడ్డుకు పీవీ నరసింహారావు (పీవీఎన్‌ఆర్‌)మార్గ్‌గా నామకరణం. 

ధాన్యం సేకరణలో కేంద్రం వైఖరిపై ప్రధానికి లేఖ 
ధాన్యం సేకరణ విషయంలో తెలంగాణ పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ప్రధాని మోదీకి లేఖ రాయాలని మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం, దిగుబడి పెరుగుతున్న నేపథ్యంలో కొత్తగా మరిన్ని రైస్‌మిల్లులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. యాసంగికి సంబంధించి 87 శాతం ధాన్యం సేకరణ జరగడంపై సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రివర్గం.. నాలుగైదు రోజుల్లో సేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖను ఆదేశించింది. వరి సన్నరకాలకు డిమాండ్‌ ఎక్కువగా ఉందని పేర్కొంది. భవిష్యత్తులో పత్తి సాగు ఎక్కువ లాభదాయకంగా ఉంటుందని అభిప్రాయపడింది. మార్కెట్లో డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని కంది పంటను ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖకు సూచించింది. 

లాక్‌డౌన్‌ మార్గదర్శకాలు ఇవీ.. 
కరోనా నియంత్రణ కోసం లాక్‌డౌన్‌ను పొడిగించాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం మేరకు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌  ఆదివారం రాత్రి మార్గదర్శకాలను విడుదల చేశారు. సోమవారం నుంచి పది రోజుల పాటు లాక్‌డౌన్‌ పొడిగింపు ఉంటుందని.. ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సడలింపు వర్తిస్తుందని పేర్కొన్నారు. 

  • అన్ని రకాల వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు, ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు, ఇతర సంస్థలు మధ్యాహ్నం ఒంటి గంట వరకే మూసివేయాల్సి ఉంటుంది. 
  • ఆర్టీసీ, సెట్విన్‌ బస్సులు, హైదరాబాద్‌ మెట్రో, ఆటోలు, క్యాబ్‌లకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకే అనుమతి. అంతర్‌ రాష్ట్ర బస్సులు, ప్రైవేటు ఆపరేటర్ల వాహనాలకు అనుమతి లేదు. 
  •  హోం ఐసోలేషన్‌లో ఉండకుండా బయటికొస్తే కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు ప్రభుత్వ ఐసోలేషన్‌ సెంటర్‌కు తరలిస్తారు. 
  • ఉద్యోగులు, కార్మికులకు పూర్తి వేతనాలు చెల్లించని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలపై కఠిన చర్యలుంటాయి. 
  • గరిష్టంగా 40 మందితో వివాహాలకు, 20 మందితో అంతిమ సంస్కారాలకు సంబంధించిన కార్యక్రమాలకు అనుమతి ఉంది. 
  • అన్ని రకాలైన దేవాలయాలు, ప్రార్థనా మందిరాల్లోకి సందర్శకులకు అనుమతి లేదు. 
  •  అన్ని రకాల సామాజిక, రాజకీయ, మతపరమైన, క్రీడా, వినోద, సాంస్కృతిక కార్యక్రమాలపై నిషేధం. 
  • అంగన్‌వాడీ కేంద్రాలు మూసివేసినా.. గర్భిణులు, బాలింతలకు రేషన్‌ సరుకులు ఇవ్వాలి. 
  •  సినిమా హాళ్లు, అమ్యూజ్‌మెంట్‌ పార్కులు, క్లబ్బులు, స్విమ్మింగ్‌ పూల్స్, బార్లు, పబ్బులు, జిమ్‌లు, స్టేడియంలు పూర్తిగా మూసివేయాలి. 

పూర్తి మినహాయింపు ఉన్నవి ఇవే.. 
∙వైద్య సేవలు, వాక్సినేషన్‌ సంబంధిత కార్యకలాపాలు, ఆస్పత్రులు, మెడికల్‌ షాపులు, ఔషధ, వైద్య పరికరాల తయారీ రంగం.  ∙వ్యవసాయ సంబంధిత పనులు, విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ యంత్రాలు రవాణా.  ∙విద్యుత్, తాగునీరు, పారిశుధ్యం, ఇతర అత్యవసర సేవలు, మీడియా, ఇతర మినహాయింపు ఉన్న సర్వీసులు, ఉపాధి హామీ పథకం పనులు. 

రిజిస్ట్రేషన్‌ కార్యకలాపాలకు అనుమతి
లాక్‌డౌన్‌ను మరో పది రోజుల పాటు కొనసాగించాలనే కేబినెట్‌ నిర్ణయం నేపథ్యంలో నిబంధనలను కొంత మేర సడలిస్తూ కోవిడ్‌ నిబంధనల మేరకు ప్రభుత్వ పనిదినాల్లో ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లు చేయాలని స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్ల శాఖను ఆదేశించింది. రవాణా శాఖ ఆధ్వర్యంలో వాహనాల రిజిస్ట్రేషన్‌ కార్యకలాపాలను కూడా అనుమతించాలని నిర్ణయించింది. కాగా కరోనా మూలంగా రాష్ట్ర ప్రభుత్వం కోల్పోతున్న ఆదాయాన్ని సమీకరించుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపైనా కేబినెట్‌ భేటీలో సుదీర్ఘ చర్చ జరిగింది. ప్రభుత్వ భూముల అమ్మకం, గృహ నిర్మాణ సంస్థ ఆధీనంలోకి భూములు, ఇండ్ల అమ్మకం కోసం వెంటనే చర్యలు ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ను మంత్రివర్గం ఆదేశించింది. 


7 మెడికల్‌ కాలేజీలకు గ్రీన్‌సిగ్నల్‌
రాష్ట్రంలో కొత్తగా ఏడు మెడికల్‌ కాలేజీలు, వాటికి అనుబంధంగా నర్సింగ్‌ కాలేజీలు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. నాగర్‌ కర్నూల్, వనపర్తి, మంచిర్యాల, జగిత్యాల, సంగారెడ్డి, మహబూబాబాద్, కొత్తగూడెంలలో మెడికల్‌ కాలేజీలు ఏర్పాటవుతాయి. వీటితోపాటు ఇప్పటికే మంజూరైన వైద్య కళాశాలలకు అనుబంధంగా నర్సింగ్‌ కాలేజీలను కేబినెట్‌ మంజూరు చేసింది. సెకండ్‌ వేవ్‌ తగ్గుముఖం పడుతున్నా.. భవిష్యత్తులో థర్డ్‌ వేవ్‌ వచ్చే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని వైద్యారోగ్య శాఖకు ఆదేశం. 

చదవండి: లాక్‌డౌన్‌ వేళ.. ఇంటింటా హింస.. ఇంతింతా కాదు! 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement