CM KCR Comments On Telangana Lockdown In COVID-19 Review Meeting | తెలంగాణలో లాక్‌డౌన్‌ ఉండదు - Sakshi
Sakshi News home page

తెలంగాణలో లాక్‌డౌన్‌ ఉండదు: సీఎం కేసీఆర్‌

Published Thu, May 6 2021 9:50 PM | Last Updated on Fri, May 7 2021 8:57 AM

CM KCR Says There Is No Lockdown In Telangana After Review Mwwting On Corona - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో లాక్‌డౌన్‌  విధించబోమని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ విధిస్తే జనజీవనం స్తంభించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదముందని స్పష్టం చేశారు. గత అనుభవాలు, ఇతర రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ విధించినా పాజిటివ్‌ కేసులు తగ్గకపోవడం వంటి అంశాల పరిశీలన అనంతరం ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎంవో తెలిపింది. కాగా కేసులు అధికంగా ఉన్న ప్రాంతాలను మైక్రో లెవల్‌ కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించి కరోనా నివారణకు తక్షణ చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు. మే 15 తర్వాత కరోనా సెకెండ్‌ వేవ్‌ తీవ్రత తగ్గిపోతుందని నివేదికలు సూచిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై కేసీఆర్‌ గురువారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రానికి వ్యాక్సిన్లు, ఆక్సిజన్, రెమిడెసివిర్‌ ఇంజెక్షన్లు, ఆక్సిజన్‌ బెడ్ల అవసరాలు ఏమేరకు ఉన్నాయి? ఎంత లభ్యత ఉంది? అన్న అంశంపై విస్తృతంగా చర్చించారు. ఔషధ కంపెనీలతో ఫోన్‌లో మాట్లాడి రాష్ట్రానికి రెమిడెసివర్‌ సరఫరాను పెంచాలని కోరారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 9,500 ఆక్సిజన్‌ బెడ్లు ఉన్నాయని, వారం రోజుల్లో హైదరాబాద్‌ సహా జిల్లాల్లో మరో 5 వేల బెడ్లను పెంచాలని ఆదేశించారు. 5,980 పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో కోవిడ్‌ ఓపీ సేవలను ప్రారంభించామని, వీటి సేవలను ఉపయోగించుకోవాలని సీఎం ప్రజలకు పిలుపునిచ్చారు. వివాహ వేడుకల్లో వంద మందికి మించి జమ కావద్దని సూచించారు. 

గురువారం ప్రగతిభవన్‌లో కరోనా రోగులకు ఇచ్చే మందులను చూపిస్తున్న సీఎం కేసీఆర్‌

వాయుమార్గంలో ఆక్సిజన్‌ ట్యాంకర్లు 
రాష్ట్రానికి మెరుగైన ఆక్సిజన్‌ సరఫరా కోసం చైనా నుంచి ఒక్కొక్కటి రూ.కోటి వ్యయంతో 12 క్రయోజనిక్‌ ట్యాంకర్లను వాయుమార్గంలో అత్యవసరంగా దిగుమతి చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఐఐసీటీ డైరక్టర్‌ చంద్రశేఖర్‌తో ఫోన్లో మాట్లాడిన కేసీఆర్‌ రాష్ట్రంలో తక్షణమే ఆక్సిజన్‌ నిల్వలను పెంచేందుకు ఉన్న అవకాశాలను ఆరాతీశారు. వారి సూచనల మేరకు వెంటనే 600 ఆక్సిజన్‌ ఎన్‌రిచర్లను కొనుగోలు చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. త్వరలో మరిన్ని సమకూర్చాలని, తక్కువ సమయంలో ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసే వ్యవస్థలను నెలకొల్పేందుక చర్యలు తీసుకోవాలని సూచించారు. 

రోజూ మీడియాకు బ్రీఫింగ్‌ ఇవ్వండి
రాష్ట్ర వైద్యశాఖ ఉన్నతాధికారులు ప్రతిరోజూ సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించి రాష్ట్రంలో కరోనా పరిస్థితుల వివరాలను వెల్లడించాలని సీఎం ఆదేశించారు. ప్రజారోగ్య విభాగం డైరెక్టర్‌ దీనికి బాధ్యత తీసుకోవాలని కోరారు. పాజిటివ్‌ కేసులు, కోలుకున్నవారు, హోం క్వారంటైన్‌లో ఉన్నవారు, ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాల్లో చికిత్స పొందుతున్న వారి వివరాలను పబ్లిక్‌ డొమైన్‌లో ప్రదర్శించాలని ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు వైద్యశాఖ తీసుకుంటున్న చర్యల పర్యవేక్షణకు ప్రత్యేకాధికారిని నియమించాలన్నారు. వైద్య శాఖకు అవసరమైన నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేయాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు.

నిధుల విడుదలకు ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు. మొదటి డోస్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి నిర్ణీత గడువులోగా రెండో డోస్‌ ఇచ్చేందుకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. కరోనా లక్షణాలు కనిపిస్తే టెస్టుల కోసం ఆందోళన చెందకుండా, ప్రభుత్వం సరఫరా చేస్తున్న కిట్లలోని మందులు ప్రారంభించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంల బృందాలు ఇంటింటికీ తిరిగి ఈ కిట్లను అందిస్తున్నాయని తెలిపారు. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కాలంలో రాష్ట్రంలో ఇప్పటివరకు 1.56 లక్షల పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 1.35 లక్షల (85 శాతం) మంది కోలుకున్నారని అధికారులు సీఎంకు వివరించారు. 

లాక్‌డౌన్‌తో ఆకలి సంక్షోభం
‘తెలంగాణ దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందుతున్న (మోస్ట్‌ హాపెనింగ్‌ స్టేట్‌) ప్రాంతం కావడంతో ఇక్కడ 25– 30 లక్షల మంది ఇతర రాష్ట్రాల కార్మికులు పనిచేస్తున్నారు. ఫస్ట్‌ వేవ్‌ కట్టడికి లాక్‌డౌన్‌ విధించడంతో వీరందరి జీవితాలు ఛిన్నాభిన్నామయ్యాయి. వీళ్లు వెళ్లిపోతే మళ్లీ తిరిగి రావడం కష్టం. రాష్ట్రంలో ధాన్యం పుష్కలంగా పండింది. గ్రామాల్లోని 6,144 కొనుగోలు కేంద్రాల నిండా ధాన్యం ఉంది. ప్రస్తుతం అక్కడ వడ్ల కాంటా నడుస్తున్నది. వరి కొనుగోలు అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఈ ప్రక్రియలో దిగువ నుంచి పైవరకు గొలుసుకట్టు వ్యవస్థ ఇమిడి వుంటుంది. ఐకేపీ కేంద్రాల బాధ్యులు, హమాలీలు, కాంటా పెట్టేవాళ్లు, మిల్లులకు తరలించే కూలీలు, లారీలు మిల్లులకు చేరవేయడం, అక్కడ తిరిగి దించడం, మళ్లీ అక్కడి నుంచి ఎఫ్‌సీఐ గోదాములకు తరలించడం, మళ్లీ అక్కడ దించి నిల్వ చేయడం, తిరిగి వివిధ ప్రాంతాలకు పంపించడం .. ఇంత వ్యవహారం ఉంటది. ఇందులో లక్షల మంది భాగస్వాములు అవుతారు.

వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి రైస్‌ మిల్లుల్లో పనిచేసే కార్మికులు ఏం కావాలి? లాక్‌డౌన్‌ విధిస్తే ఇంతమంది ఎక్కడికి పోతారు? కార్మికులు చెల్లాచెదురైపోతే తిరిగి వారిని రప్పించడం ఎట్లా ? కొనుగోలు చేయకపోతే పండించిన వరి ధాన్యాన్ని రైతు ఎక్కడ పెట్టుకుంటాడు? మొత్తం ధాన్యం కొనుగోళ్ల వ్యవస్థ ఎక్కడికక్కడ స్తంభించే ప్రమాదముంటది. తద్వారా ఘోర సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉంది. నిత్యావసర సరుకులు, పాలు, కూరగాయలు, పండ్లు, మందులు, వైద్యం, ప్రసవాలు, పారిశుద్ధ్య కార్యక్రమాలు వంటి వాటికి అంతరాయం కలుగుతుంది.
వ్యాక్సిన్లు, ఆక్సిజన్‌ సరఫరాకూ ఆటంకం
లాక్‌ డౌన్‌ విధిస్తే ఇతర రాష్ట్రాల నుంచి వ్యాక్సిన్లు, ఆక్సిజన్, ఇతర నిత్యావసరాల సరఫరాకు కూడా ఆటంకం కలుగుతుంది. ప్రభుత్వమే ఒక భయానక పరిస్థితిని సృష్టించినట్లవుతుంది. పరిశ్రమలు ఉన్నపళంగా మూతపడితే అంతా ఆగమాగం కాదా? క్యాబ్‌లు, ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏమిటి ? కొన్ని లక్షల కుటుంబాలు ఉపాధి కోల్పోయి మొత్తం వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది. కరోనా ఏమోగాని ఆకలి సంక్షోభం తలెత్తే ప్రమాదంఉంది. గొంతు పిసికినట్టు చేస్తే మొత్తం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. అందుకే లాక్డౌన్‌ విధించలేం’ అని సీఎం స్పష్టం చేశారు.      

     చదవండి: తెలుగు రాష్ట్రాల సీఎంలకు ప్రధాని ఫోన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement