సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఈ నెల 31 వరకు కరోనా లాక్‌డౌన్‌ను కేంద్రం పొడిగించడంతోపాటు రాష్ట్రాలకు మరిన్ని సడలింపులు కల్పించిన నేపథ్యంలో రాష్ట్రంలోనూ పెద్ద ఎత్తున సడలింపులను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. రాష్ట్రంలోని కంటైన్మెంట్ ఏరియాలు తప్ప మిగతా మొత్తం ప్రాంతాన్ని గ్రీన్‌జోన్‌గా ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. మంగళవారం నుంచే బస్సులు రోడ్డెక్కుతాయని, అన్ని రకాల వ్యాపార సముదాయాలు తెరుచుకునేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో ఈ నెల 29 వరకు లాక్‌డౌన్‌ను అమలు చేస్తామని గతంలోనే ప్రకటించామని, తాజాగా కేంద్రం దేశవ్యాప్తంగా 31 వరకు లాక్‌డౌన్ 4.0ను ప్రకటించడంతో రాష్ట్రంలోనూ ఈ నెల 31 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుందన్నారు. సోమవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం పొద్దుపోయేవరకు నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాలపై కూలంకషంగా చర్చించిన అనంతరం సీఎం కేసీఆర్ విలేకరుల సమావేశంలో అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ఇండియా బ్యాక్ టు వర్క్..
దేశవ్యాప్తంగా ఇండియా బ్యాక్ టు వర్క్ అనే మాట వినిపిస్తోందని, ఆ దిశగా పలు రాష్ట్రాలు వ్యవహరిస్తున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. వాటిల్లో రాష్ట్రానికి అనుకూలమైన అంశాలను ఎంచుకొని అమలుచేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను అంతం చేసే వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో తెలియని అనిశ్చితి నెలకొందని, వైద్యరంగ శాస్త్రవేత్తలు, నిపుణులు కూడా వ్యాక్సిన్ ఇప్పట్లో రాదనే తరహాలో మాట్లాడుతున్నారన్నారు. అందుకే కరోనాతో ఇక కలసి సహజీవనం చేయాల్సిన గత్యంతరంలేని పరిస్థితి నెలకొందని వివరించారు.
ఇక ప్రజలంతా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ బతుకు కొనసాగించాలని, ఎక్కువకాలం ఇళ్లకే పరిమితం కావడం కూడా సరికాదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను బాగా అనుసరించామని, దీనివల్ల మంచి ఫలితాలు కూడా వచ్చాయన్నారు. ఈ విషయంలో ప్రజలు ఎంతో సహకరించారని, వారందరికీ చేతులెత్తి ధన్యవాదాలు చెబుతున్నట్లు సీఎం పేర్కొన్నారు. ఇకపైనా కరోనాతో కలసి సహజీవనం చేయాల్సిన పరిస్థితి ఉన్నందున ప్రజలు కరోనా నిబంధనలు పాటించి సమస్య తీవ్రం కాకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. దు
కాణాల నిర్వాహకులు వారి దుకాణాలను శానిటైజ్ చేసుకోవడంతోపాటు కొనుగోలుదారులకు కూడా శానిటైజర్ అందిస్తూ కరోనా విస్తరించకుండా చూడాలని విన్నవించారు. ఆంక్షలు ఎత్తేశాం కదా అని జనం ఇష్టమున్నట్లు బయటకు వచ్చి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మళ్లీ సమస్య పెరుగుతుందని, కరోనా తిరగబెడితే మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్ ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. అందరూ కచ్చితంగా మాస్కులు ధరించాలని, మాస్కు లేకుండా బయటకు వచ్చిన వారికి రూ. వెయ్యి జరిమానా విధిస్తామన్నారు. 65 ఏళ్ల పైబడ్డ వృద్ధులు, చిన్నపిల్లలు అత్యవసరం అయితే తప్ప బయటకు రాకుండా ఇళ్లకే పరిమితం కావాలని కేసీఆర్ సూచించారు.
సర్వసన్నద్ధమయ్యాకే సడలింపులిస్తున్నాం...
కొన్ని మున్సిపాలిటీలు, గ్రామాల్లో ఇప్పటికే అన్ని రకాల షాపులకు అనుమతిచ్చామని, ఎక్కడా ఎటువంటి ఇబ్బంది రాలేదని సీఎం కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్‌లోనే కరోనా ఇబ్బంది ఉన్నందున 17 వేల బెడ్లు, అన్ని రకాల పరికరాలతో సర్వసన్నద్ధంగా ఉన్న తర్వాతే సడలింపులు ఇస్తున్నామన్నారు. సమస్య వస్తే మళ్లీ వెనక్కి వెళ్తామని, మున్ముందు పరిస్థితిని బట్టి సమీక్షించుకుంటామని చెప్పారు. కులవృత్తుల వారికి ఇప్పుడే చాలా చేస్తు న్నామని, అత్యవసరమైతే వారిని ఆదుకుంటామని కేసీఆర్ పేర్కొన్నారు. లాయర్ల తరహాలో జర్నలిస్టులను ఆర్థికంగా ఆదుకొనే విషయంపై ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణతో మాట్లాడి 2, 3 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఫుడ్ హోం డెలివరీ ఓకే!
హోటళ్లు, రెస్టారెంట్లను తెరిచేందుకు అనుమతించే విషయంలో సీఎం కేసీఆర్ ఎలాం టి స్పష్టత ఇవ్వలేదు. అయితే కేంద్ర ప్రభుత్వ తాజా మార్గదర్శకాల ప్రకారం హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర ఆతిథ్య సేవలకు అనుమతి ఉండదని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఆహారం వండి హోం డెలివరీ చేసేందుకు రెస్టారెంట్లకు అనుమతి ఉంటుందని స్పష్టంచేశాయి. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయనున్న లాక్‌డౌన్ పొ డిగింపు జీవోలో దీనిపై స్పష్టత ఇవ్వనుంది.
ఆటోలు, క్యాబ్‌లకు ఓకే.. మెట్రోకు నో
కంటైన్మెంట్ జోన్లు తప్ప రాష్ట్రవ్యాప్తంగా ఆటోలు, కార్లు, ట్యాక్సీలు, క్యాబ్‌లు, ప్రైవేటు వాహనాలను అనుమతిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. క్యాబ్‌లలో డ్రైవర్ కాకుండా ముగ్గురు ప్రయాణికులను అనుమతిస్తామని, ఆటోల్లో డ్రైవర్ కాకుండా ఇద్దరు మాత్రమే ఎక్కాలని వెల్లడించారు. దీన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అయితే హైదరాబాద్ మెట్రో రైల్ సర్వీసులకు మాత్రం అనుమతి ఇవ్వట్లేదని పేర్కొన్నారు.
కంటైన్మెంట్ ఏరియాలో 1,452 కుటుంబాలు..
రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా కేసులున్న కంటైన్మెంట్ ఏరియాల పరిధిలో 1,452 కుటుం బాలు ఉన్నాయని, ఆ కుటుంబాలకు సంబం ధించిన ఇళ్లు, వాటి పరిసరాలు మాత్రమే ఇక కంటైన్మెంట్ ప్రాంతాలుగా ఉంటాయని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఈ ప్రాంతాలను మాత్రమే రెడ్‌జోన్లుగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. కంటైన్మెంట్ ప్రాంతాల్లోని వారిని ఆ పరిధి దాటి బయటకు అనుమతించబోమని, బయటి వారిని లోనికి అనుమతించబోమన్నారు. ఈ విషయంలో గట్టి నిఘా ఉంటుందని చెప్పారు. కంటైన్మెంట్ ఏరియాల పరిధిలోని కుటుంబాల వారికి కావాల్సిన నిత్యావసరాలను డోర్ డెలివరీ తరహాలో ప్రభుత్వమే సరఫరా చేస్తుందని కేసీఆర్ తెలిపారు. ఇది ఆయా కుటుంబాలు, ఆ ప్రాంతాల సంక్షేమంతోపాటు రాష్ట్ర సంక్షేమానికి సంబంధించిన విషయం అయినందున ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
బస్సులకు రైట్‌రైట్...
కరోనాతో కలసి జీవించాల్సిన అవసరం ఉందని పేర్కొన్న ముఖ్యమంత్రి... రాష్ట్రంలో ప్రజారవాణాకు పచ్చజెండా ఊపారు. హైదరాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచే రోడ్డెక్కుతాయని తెలిపారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా ఆర్టీసీ అధికారులు కొన్ని పద్ధతులు రూపొందించారని, వాటి మేరకు బస్సులు తిరుగుతాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో కరోనా కేసులు ఎక్కువగా వస్తున్నందున సిటీ బస్సులను మాత్రం అనుమతించట్లేదని, అలాగే అంతర్రాష్ట్ర బస్సులకు కూడా అనుమతి ఇవ్వట్లేదన్నారు.
తెలంగాణ ఆర్టీసీ బస్సులు వేరే రాష్ట్రాలకు, వేరే రాష్ట్రాల ఆర్టీసీ బస్సులు తెలంగాణకు రాకపోకలు సాగించేందుకు అనుమతి ఇవ్వట్లేదన్నారు. ‘జిల్లాల నుంచి హైదరాబాద్‌కు ఆర్టీసీ బస్సులు వస్తాయి. కానీ ఇమ్లిబన్ (ఎంజీబీఎస్) బస్ స్టేషన్‌కు బస్సులను రానీయరు. జూబ్లీ బస్‌స్టేషన్‌కు రానిస్తరు. కరోనా సమస్య ఉన్న దిల్‌సుఖ్‌నగర్ వైపు రానీయరు. సికింద్రాబాద్, జూబ్లీ బస్‌స్టేషన్ వద్ద సమస్య లేదు. ఎల్బీనగర్ వైపు బస్సులను అనుమతించాలని మంత్రులు కూడా అడిగారు. నేను అనుమతించలేదు. బస్సులన్నీ రాత్రి 7 గంటల్లోపు డిపోలకు తిరిగి వచ్చేయాలి. ఏదైనా కొన్ని బస్సులు దూర ప్రాంతాల నుంచి వచ్చేవి, ప్రత్యేకమైన పరిస్థితి ఉంటే రాత్రి 8 గంటల వరకు అనుమతిస్తం.
ప్రయాణికుల వద్ద టికెట్ ఉంటది. దాన్ని చూసి అనుమతిస్తరు. జిల్లాల మధ్య ప్రైవేటు బస్సులు, స్టేజీ కార్యరియర్లు, వ్యక్తిగత వాహనాలు, ఆటోలు, కార్లు కూడా నడుస్తయి. కేంద్రం ఇచ్చిన కొత్త మార్గదర్శకాలతో అన్ని తెరుచుకుంటున్నయి. వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లిపోవచ్చు. ఇబ్బంది ఉండదు. మహారాష్ట్ర, ఏపీలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. అక్కడికి బస్సులు నడపట్లేదు. అంతర్రాష్ట్ర బస్సు ప్రయాణాల విషయంలో రాష్ట్రాలు పరస్పర అంగీకారంతో నిర్ణయం తీసుకోవాలని కేంద్రం సూచించింది. మేము అంతర్రాష్ట్ర బస్సులు నడిపేందుకు అనుమతించట్లేదు’అని కేసీఆర్ స్పష్టం చేశారు.
అనుమతించేవి...
- కరోనా కేసులున్న ప్రాంతా ల్లోని కంటైన్మెంట్ జోన్లు మినహా రాష్ట్రం మొత్తం అన్ని రకాల దుకాణాలు.
- జీహెచ్‌ఎంసీ పరిధిలో సరి–బేసి పద్ధతిలో ఒకరోజు కొన్ని, మరోరోజు ఇంకొన్ని షాపులు. వాటి పూర్తి వివరాలను జీహెచ్‌ఎంసీ కమిషనర్ విడుదల చేస్తారు.
- కంటైన్మెంట్ జోన్లు తప్ప అన్ని ప్రాంతాల్లో హెయిర్ కటింగ్ సెలూన్లు, ఈ–కామర్స్ సముదాయాలు.
- ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో పూర్తిస్థాయిలో కార్యకలాపాలు. పరిశ్రమలు, తయారీరంగ యూనిట్లలో పూర్తిస్థాయిలో పనులు.
- వాటన్నింటిలో మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, శానిటైజ్ చేసుకోవడం లాంటి నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి.
మూతపడే ఉండేవి
- ప్రార్థనా మందిరాలు.
- మతపరమైన సమావేశాలు, ఉత్సవాలు.
- ఫంక్షన్ హాళ్లు, మాల్స్, సినిమా హాళ్లు.
- బార్లు, పబ్బులు, క్లబ్బులు, స్టేడియాలు, పార్కులు, స్విమ్మింగ్‌పూళ్లు, జిమ్‌లు, అమ్యూజ్‌మెంట్ పార్కులు.
- అన్ని విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు.
రాత్రి కర్ఫ్యూ యథాతథం..
ప్రస్తుతం రాత్రివేళ అమలులో ఉన్న కర్ఫ్యూ యథాతథం. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది.
సోమవారం ప్రగతిభవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్. చిత్రంలో మంత్రులు గంగుల కమలాకర్, మహమూద్ అలీ, ఈటల రాజేందర్, శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment