సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం లాంటి భారీ సాగునీటి ప్రాజెక్టును కట్టేశాం.. సంప్రదాయ–ఆధునిక నమూనాల మేళవింపుతో కొత్త సచివాలయ నిర్మాణం సాగుతోంది.. భాగ్యనగరంలో ఎన్నో ఆకాశహర్మ్యాలూ సిద్ధమవుతున్నాయి.. ఇలాంటి భారీ కట్టడాలకు నిర్మాణ కంపెనీలు పోటీపడుతున్నాయి.. కానీ, ఓ కట్టడానికి మాత్రం ఇంజనీర్లు దొరకడం లేదు. అదే మజ్నూ బురుజు. గోల్కొండ కోటకు అనుబంధంగా ఉన్న నయాఖిల్లాలో ఈ బురుజు ప్రస్తుతం శిథిలగుట్టగా ఉంది. దీన్ని పునర్నిర్మించేందుకు గతేడాది నుంచి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. తెలంగాణకు బురుజులు కొత్త కాదు. చాలా ఊళ్లలో అవి దర్శనమిస్తాయి. అప్పట్లో ఊరూవాడా వాటిని సులభంగా నిర్మించేశారు. ఇప్పుడు వాటిని కట్టేవా రి కోసం కేంద్ర పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్‌ఐ) భూతద్దం పెట్టి గాలిస్తున్నా దొరకడం లేదు.
ఇదీ సంగతి..
నయాఖిల్లాలో 500 ఏళ్ల క్రితం లైలా–మజ్నూల పేరుతో రెండు బురుజులు నిర్మించారు. ఇందులో మజ్నూ బురుజు కాస్త పెద్దది. గత అక్టోబర్‌లో కురిసిన అతి భారీ వర్షాలకు కుప్పకూలింది. అంతకు కొన్ని నెలల ముందే దానికి భారీ పగుళ్లు ఏర్పడ్డాయి. గోల్ఫ్ కోర్టు అభివృద్ధి చేసే క్రమంలో దాని దిగువన జరిగిన మట్టిపనులతో సమతౌల్యం దెబ్బతిని పగుళ్లు ఏర్పడటానికి కారణమైందని సామాజిక కార్యకర్తలు పేర్కొంటున్నారు. ఆ పగుళ్లకు ఏఎస్‌ఐ సకాలంలో స్పందించలేదు. ఆలస్యంగా పనులు ప్రారంభించినా, శాస్త్రీయత లేకుండా లోపభూయిష్టంగా చేపట్టడంతో వాననీళ్లు సులభంగా లోనికి చొరబడి మట్టి జారి కట్టడం కూలిపోయింది. ఇది పూర్తిగా మట్టి కట్టడం. చుట్టూ భారీ బండరాళ్లను పద్ధతి ప్రకారం పేర్చి బురుజు రూపమిచ్చారు. నాటి ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనం. మట్టి కట్టడం ఐదు శతాబ్దాల పాటు నిలబడి, మానవ తప్పిదంతో చివరకు కూలిపోయింది. చరిత్రలో ఆ కట్టడానికి స్థానం ఉండటం, చారిత్రక గోల్కొండ కోట అంతర్భాగం కావటంతో దాన్ని తిరిగి నిర్మించాలని ఏఎస్‌ఐ నిర్ణయించి గతేడాది చివరి నుంచి ప్రయత్నిస్తోంది. జాతీయ స్థాయిలో రెండు దఫాలు టెండరు నోటిఫికేషన్ ఇచ్చినా దాన్ని నిర్మించగలిగే సంస్థలు రాలేదు.
నైపుణ్యం ఉన్న వారు కరువు...
మట్టితో నిర్మించి, బాహ్య భాగాన్ని డంగు సున్నం పూతతో పెద్ద రాళ్లతో నిర్మించాలని ఈసారి నిర్ణయించారు. ఈ తరహా కట్టడాలను నిర్మించిన అనుభవం ఉన్న వారిని ఆహ్వానిస్తూ టెండర్లు పిలిచారు. బురుజుల పునర్నిర్మాణం, లేదా ఆ తరహా భారీ గోడలను నిర్మించిన వారు, ఆ పనుల్లో కనీసం ఏడేళ్ల అనుభవం ఉన్నవారు కావాలని పేర్కొన్నారు. ఇలాంటి నైపుణ్యం ఉన్నవారికి కరవు వచ్చి పడింది. కొందరు వచ్చినా అనుభవం లేకపోవటంతో రద్దు చేశారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆ పనితీరు అనుభవం ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. కేవలం రూ.కోటి విలువైన ఈ పని పూర్తి చేయటం ఇప్పుడు ఏఎస్‌ఐకి కత్తిమీద సాములా మారింది. అది కూలిన సమయంలో పై భాగంలో గాలిలో వేళ్లాడుతూ ఉండిపోయిన 18 అడుగుల పొడవైన 150 టన్నుల బరువున్న భారీ తోపును కిందకు దింపేందుకు రెండు రోజులు పట్టింది. అందుకే ఇప్పుడు ఆ పనులు సవాల్ విసురుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment