కనకయ్యకు నచ్చ చెపుతున్న ఎస్‌ఐ పుష్పరాజ్
కొండపాక(గజ్వేల్): డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాల్లో భూమిని కోల్పోయానని, అయినా ఇల్లు ఇవ్వలేదని ఆరోపిస్తూ తీవ్ర మనస్తాపం చెందిన ఓ వ్యక్తి కత్తితో పొడుచుకొని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన కుకునూరుపల్లి మండలం మేదీనీపూర్‌లో చోటుచేసుకుంది. మేదినీపూర్‌కు ప్రభుత్వం ఐదేళ్ల క్రితం 50 డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేసింది. అయితే ప్రభుత్వస్థలం అందుబాటులో లేకపోవడంతో సర్పంచ్ విరుపాక లావణ్య ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించి స్థానికుడైన నంగి కనకయ్య దంపతులకు చెందిన కొంతస్థలాన్ని డబుల్ బెడ్‌రూం ఇళ్ల కోసం ఎంపిక చేశారు.
ఆ సమయంలో ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాక కనకయ్యకు ఒక డబుల్ బెడ్‌రూం ఇంటిని అందిస్తామని తీర్మానించారు. కాగా, 2022 జూన్ 27న మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా 48 ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. తనకు ఇల్లు కేటాయించలేదని ఆగ్రహించిన కనకయ్య మిగిలిన రెండు ఇళ్లలో ఓ ఇంటిని ఆక్రమించుకొని 6 నెలలుగా నివాసం ఉంటున్నాడు. శుక్రవారం రెవెన్యూ అధికారులు కనకయ్య ఉంటున్న ఇంటికి వెళ్లి ఖాళీ చేయాలని సూచించారు.
డబుల్ బెడ్రూంల నిర్మాణంలో 14 గుంటల భూమిని కోల్పోయానని, అయినా తనకు ఇల్లు ఇవ్వలేదని, ఇప్పుడు ఉంటున్న ఇంట్లో నుంచి వెళ్లమంటారా అంటూ మనస్తాపం చెంది కత్తితో పొడుచుకొని ఆత్మహత్యకు యత్నించాడు. చుట్టుపక్కలవారు అప్రమత్తమై అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ పుష్పరాజ్ ఘటనాస్థలానికి చేరుకొని కనకయ్యకు నచ్చజెప్పారు. ఈ విషయమై తహసీల్దార్ ఆశాజ్యోతిని వివరణ కోరగా సమాధానం దాటవేశారు.
సమాఖ్య భవనంలో ఉంటున్నాం...
డబుల్ బెడ్రూం నిర్మాణాల్లో ఇంటి స్థలంతోపాటు 12 గుంటల భూమిని కోల్పోయాం. లబ్ధిదారుల జాబితాలో పేరు రావడంతో అధికారులు పట్టా సర్టిఫికెట్ అందజేశారు. కానీ, ఇప్పటివరకు ఇంటిని అప్పగించలేదు. దీంతో మహిళా సమాఖ్య భవనంలో ప్రస్తుతం నివాసం ఉంటున్నాం. అధికారులు స్పందించి త్వరగా ఇంటిని కేటాయించాలి.
– మరో బాధితురాలు నంగి ఐలవ్వ
Comments
Please login to add a commentAdd a comment