పోలీస్ శాఖలో భారీ ప్రక్షాళన!
ఎన్నికల కోడ్ ముగియడంతో బదిలీలపై సర్కార్ కసరత్తు
డీజీపీ రేసులో శివధర్‌రెడ్డి, జితేందర్, సీవీ ఆనంద్
పని భారం ఉన్న అధికారులకు ఉపశమనం కలిగించేలా పోస్టింగులు
ఒకటి, రెండు రోజుల్లోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం
సాక్షి, హైదరాబాద్: వరుస ఎన్నికల హడావుడి, కోడ్ ముగియడంతో పాలనపై దృష్టి సారించిన ప్రభుత్వం.. అత్యంత కీలకమైన పోలీస్ శాఖలో భారీ ప్రక్షాళనకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. తనదైన టీంను సెట్ చేసుకోవడంపై సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారని, పెద్ద సంఖ్యలో ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం.
డీజీపీ, పలువురు పోలీస్ కమిషనర్లు సహా పలు కీలక పోస్టుల్లో ఉన్న అధికారులకు స్థాన చలనం తప్పదనే చర్చ జోరుగా నడుస్తోంది. కీలక బాధ్యతల్లో కొత్త అధికారులను నియమించడంతో పాటు ఇప్పటికే ఒకటికి మించి అదనపు పోస్టులతో పని భారం ఉన్న అధికారులకు ఉపశమనం కలిగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఒకట్రెండురోజుల్లోనే ఉత్తర్వులు వెలువడే చాన్స్ ఉందని సమాచారం.
శివధర్‌రెడ్డి వైపు సర్కారు మొగ్గు
ప్రస్తుతం డీజీపీ (హెచ్‌ఓపీఎఫ్–హెడ్‌ఆఫ్ పోలీస్ ఫోర్స్)గా ఉన్న రవిగుప్తా స్థానంలో కొత్త డీజీపీ (హెచ్‌ఓపీఎఫ్)గా సీనియర్ ఐపీఎస్ అధికారులు సీవీ ఆనంద్, శివధర్‌రెడ్డి, జితేందర్‌ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం డీజీ ర్యాంకులో ఉన్న సీవీ ఆనంద్ అత్యంత కీలకమైన ఏసీబీ డీజీ పోస్టులో ఉన్నారు.
డీజీ ర్యాంకులో ఉన్న మరో అధికారి జితేందర్ హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం సీనియర్ ఐపీఎస్ శివధర్‌రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అడిషనల్ డీజీ ర్యాంకులో ఇంటిలిజెన్స్ చీఫ్‌గా ఉన్న శివధర్‌రెడ్డిని ఇటీవల ఏర్పడిన రెండు డీజీపీ ర్యాంకు ఖాళీల భర్తీలో భాగంగా పదోన్నతి ఇచ్చి పోలీస్ బాస్‌గా నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఇద్దరికి డీజీపీలుగా పదోన్నతి
ప్రస్తుతం డీజీపీ ర్యాంకులో నలుగురు సీనియర్ ఐపీఎస్‌లు కొనసాగుతున్నారు. వీరిలో రవిగుప్తాతో పాటు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమయంలో అనూహ్యంగా రోడ్డు సేఫ్టీ అథారిటీ చైర్మన్‌గా బదిలీ అయిన అంజనీకుమార్, సీవీ ఆనంద్, జితేందర్ ఉన్నారు. డీజీపీ ర్యాంకులోనే విజిలెన్స్ డీజీగా ఉన్న రాజీవ్‌రతన్ గుండెపోటుతో హఠాన్మరణం పాలయ్యారు.
అదేవిధంగా టీఎస్ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్‌గా పనిచేసిన సందీప్ శాండిల్య కొద్దిరోజుల క్రితం పదవీ విరమణ పొందారు. ఇలా రెండు డీజీపీ ర్యాంకులు ఖాళీ అయ్యాయి. ప్రస్తుతం హైదరాబాద్ సీపీగా ఉన్న కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, ఇంటిలిజెన్స్ అడిషనల్ డీజీగా ఉన్న శివధర్‌రెడ్డిలకు డీజీపీలుగా పదోన్నతి లభించే అవకాశం ఉంది.
ఆ ముగ్గురు కమిషనర్‌లు కూడా..
కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిõÙక్ మొహంతి, వరంగల్ కమిషనర్ అంబర్ కిషోర్‌జా, రామగుండం సీపీ శ్రీనివాసులుకు స్థాన చలనం కలిగే అవకాశం ఉన్నట్టు ప్రచారం ఉంది. ఇంటిలిజెన్స్ ఏడీజీ పోస్టులో ఉన్న శివధర్‌రెడ్డికి డీజీపీగా బాధ్యతలు అప్పగిస్తే ఆ స్థానంలోకి మరో సీనియర్ ఐపీఎస్ అధికారి రమేశ్‌రెడ్డి వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఇక ప్రస్తుతం అడిషనల్ డీజీగా ఉన్న శిఖా గోయల్ వద్ద కీలక పోస్టులైన సీఐడీ, మహిళా భద్రత విభాగం, టీఎస్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలు ఉన్నాయి. వీటిలో కొన్నింటిని ఇతర ఐపీఎస్‌లకు అప్పగించే అవకాశం ఉంది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో అత్యంత కీలకమైన ట్రాఫిక్ అడిషనల్ సీపీ, స్పెషల్ బ్రాంచ్ అడిషనల్ సీపీ, క్రైమ్స్ అడిషనల్ సీపీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉన్న అధికారులకే అదనపు బాధ్యతలు అప్పగించి కొనసాగిస్తున్నారు.
ఆర్గనైజేషన్ ఐజీగా ఉన్న విశ్వప్రసాద్‌కే మళ్లీ ట్రాఫిక్ అడిషనల్ సీపీ పోస్టును ఇచ్చే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా చాలా జిల్లాల ఎస్పీలు, డీసీపీలు ఎన్నికల బదిలీల్లో భాగంగా పోస్టింగ్‌లు పొందారు. వారిలో కొందరిని ప్రభుత్వం తమ ప్రాధాన్యాల మేరకు బదిలీ చేసి, ఆ స్థానాల్లో కొత్తవారికి బాధ్యతలు అప్పగించే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం.
హైదరాబాద్‌కూ కొత్త సీపీ?
రాష్ట్రంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సహా మొత్తం 9 పోలీస్ కమిషనరేట్లు ఉన్నాయి. కాగా త్వరలో జరగనున్న బదిలీల్లో ఎక్కువ మంది పోలీస్ కమిషనర్లకు స్థాన చలనం తప్పదనే వార్తలు వస్తున్నాయి. కమిషనర్ల తీరుపై రాజకీయ నాయకులు, సొంత శాఖలోని అధికారులు, సామాన్యుల నుంచి వచ్చిన ప్రతి స్పందనలు ప్రాతిపదికగా తీసుకుని బదిలీలు చేసే చాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం హైదరాబాద్ సీపీగా కొనసాగుతున్న కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి బదిలీ అయ్యే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆయన స్థానంలో హైదరాబాద్ సీపీ పోస్టుకు టీఎస్‌ఆర్టీసీ ఎండీగా పనిచేస్తున్న వీసీ సజ్జనార్, రైల్వే, రోడ్డు భద్రత అడిషనల్ డీజీగా ఉన్న మహేశ్ భగవత్, అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్న నాగిరెడ్డి పోటీలో ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఎన్నికల కోడ్ కారణంగా రాచకొండ సీపీగా ఉన్న సు«దీర్‌బాబు అనూహ్యంగా బదిలీ కావడంతో ఐజీ తరుణ్ జోషీకి రాచకొండ సీపీగా బాధ్యతలు అప్పగించారు. అయితే సు«దీర్‌బాబు తిరిగి సీపీగా వెళ్లే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. మరోవైపు గతంలో ఈ పోస్టులో పనిచేసి, పౌరసరఫరాల కమిషనర్‌గా బదిలీ అయిన డీఎస్ చౌహాన్ పేరు సైతం పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment