1,205 రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన డెంగీ కేసులు 432 ఇందులో ఒక్క హైదరాబాద్‌లోనే నమోదైనవి డెంగీ తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలు హైదరాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్‌నగర్, ఆసిఫాబాద్, సంగారెడ్డి, వనపర్తి, నిజామాబాద్, నారాయణపేట్, హన్మకొండ, ఖమ్మం. మలేరియా తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలు కొత్తగూడెం, ములుగు, ఆసిఫాబాద్, భూపాలపల్లి, వనపర్తి, హన్మకొండ, మహబూబాబాద్, వరంగల్, మంచిర్యాల, ఆదిలాబాద్, హైదరాబాద్. గ్రేటర్‌లో ఫీవర్.. టెర్రర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డెంగీ, మలేరియా వ్యాధులు కోరలు చాస్తున్నాయి. కరోనా కేసులు ఒకవైపు నమోదు అవుతుండగా, మరోవైపు విషజ్వరాలు జనాన్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. డెంగీ అత్యంత తీవ్రతలో 12 జిల్లాలు ఉండగా, మలేరియా అత్యంత తీవ్రతలో 11 జిల్లాలు ఉన్నాయని వైద్య, ఆరోగ్యశాఖ తాజాగా ప్రకటించింది. అత్యంత తీవ్రత జిల్లాల్లోనే 70 శాతం మేర డెంగీ, మలేరియా కేసులు నమోదైనట్లు చెబుతున్నారు. హైదరాబాద్‌లో అత్యధిక శాతం కేసులు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఆ తర్వాత ఖమ్మం, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో అధికంగా కేసులు నమోదయ్యాయి. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వెళ్తున్నా, కొన్ని జిల్లాల్లో వైద్య యంత్రాంగం తూతూమంత్రపు చర్యలకే పరిమితమైందన్న విమర్శలు ఉన్నాయి.
ఆగస్టు, సెప్టెంబర్‌లో భారీగా కేసులు...
రాష్ట్రంలో డెంగీ, మలేరియాతో పాటు చికున్‌గున్యా వంటి సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. వర్షాలతో చెరువులు, కుంటలు నిండిపోయాయి. ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది. దీంతో నీరు నిలిచినచోట్ల దోమలు స్వైర్యవిహారం చేస్తున్నాయి. దీంతో దోమల కారణంగా వచ్చే వ్యాధులు పెరుగుతున్నాయి. ఇప్పటికే కరోనాతో జనం ఆందోళన చెందుతుంటే, దానికి డెంగీ, మలేరియా తోడు కావడంతో పరిస్థితి దారుణంగా మారింది. ఆగస్టు, సెప్టెంబర్‌లో డెంగీ, మలేరియా కేసులు విపరీతంగా నమోదు అవుతాయని వైద్య, ఆరోగ్యశాఖ హెచ్చరించింది. జ్వరాల కేసులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ఏది సాధారణ జ్వరమో, ఏది కరోనా లేదా డెంగీ జ్వరమో అర్థంగాక ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు.
ఇదిలా ఉండగా, డెంగీతో వచ్చే రోగులను ప్రైవేట్ ఆసుపత్రులు పీల్చిపిప్పిచేస్తున్నాయి. ఎవరెన్ని చెప్పినా ఆసుపత్రుల తీరు మారడంలేదు. హైదరాబాద్‌లో కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో ప్లేట్‌లెట్లను ఎక్కిస్తే రూ. 50 వేల నుంచి లక్ష వరకు వసూలు చేస్తున్నారు. సాధారణ ప్రైవేట్ ఆసుపత్రుల్లో రూ. 50 వేల వరకు గుంజుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల కొరత ఉండటంతో రోగులు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. 40 వేల లోపు ప్లేట్‌లెట్లు పడిపోతేనే సమస్య ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు. కానీ 50 వేలున్నా కూడా ప్లేట్‌లెట్లు ఎక్కిస్తున్నారు. దోమల నుంచి రక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
జ్వరం వస్తే పరీక్షలు చేయించుకోండి
జ్వరం ఉన్నవాళ్లు వైద్యున్ని సంప్రదించి, నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. ప్రస్తుత సీజన్‌లో వ్యాధులు ప్రబలే అవకాశముంది. డెంగీ, మలేరియా వంటి వ్యాధులు పెరగకుండా వైద్య, ఆరోగ్యశాఖ అన్ని చర్యలు తీసుకుంటోంది. హైదరాబాద్, ఖమ్మం జిల్లాల్లో డెంగీ కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో మలేరియా కేసులు ఎక్కువగా వస్తున్నాయి. పెద్దాసుపత్రుల్లో ప్రత్యేకంగా ఫీవర్ క్లినిక్‌లను ఏర్పాటు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా 20 జిల్లాల్లో డయాగ్నోస్టిక్ సెంటర్లు పని చేస్తున్నాయి. డెంగీ చికిత్స కోసం 24 ప్లేట్‌లెట్ ఎలక్ట్రిక్ యంత్రాలను సిద్ధంగా ఉంచాం. లక్షణాలున్నవారు ఆయా కేంద్రాలకు వెళ్లి టెస్టులు చేయించుకోవాలి.
– డాక్టర్ శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకుడు
Comments
Please login to add a commentAdd a comment