సాక్షి, హైదరాబాద్: రోగాన్ని ముందస్తుగా గుర్తిస్తే వేగంగా నయం చేయ వచ్చనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. క్యాన్సర్ లాంటి రోగాన్ని సైతం ప్రాథమిక దశలో గుర్తిస్తే మెరుగైన చికిత్స అందించవచ్చని పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లను ప్రారంభిస్తున్నామని తెలిపారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లో అందుబాటులోకి తెచ్చామని, వచ్చే నెలాఖరులోగా మరో 19 చోట్ల ఈ సెంటర్లను ప్రారంభించనున్నట్లు వివరించారు. రూ.1.5 కోట్లతో సంబంధిత పరికరాలను కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. త్వరలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేసి పేదలకు ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి, ఆనంద్ లేవనెత్తిన అంశాలపై మంత్రి ఈటల వివరణ ఇచ్చారు.
హైదరాబాద్‌లోని నారాయణగూడలో అత్యాధునిక పరికరాలతో లేబొరేటరీని అందుబాటులోకి తెచ్చామన్నారు. నగరంలో 20 చోట్ల శాంపిల్ కలెక్షన్ సెంటర్లను తెరిచి రోగుల నుంచి శాంపిల్స్ తీసుకుని నారాయణగూడ ల్యాబ్‌కు పంపిస్తున్నామని తెలిపారు. భూపాలపల్లిలో వంద పడకల ఆస్పత్రిని ఉద్యోగుల నియామకం పూర్తిచేసి త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.
కరోనాపై అసెంబ్లీలో మంత్రి ఆరా
రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో నివేదిక సమర్పించాలని ఆరోగ్య శాఖ ఈటల అధికారులను ఆదేశించారు. అధికారుల నుంచి అందే నివేదిక ఆధారంగా భవిష్యత్తు ప్రణాళిక సిద్ధం చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న విషయాన్ని అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేలు ఈటల వద్ద ప్రస్తావిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే అసెంబ్లీలోని తన చాంబర్ నుంచి వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, డీఎంఈ రమేశ్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాస్‌తో పాటు ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసి యేషన్లతో మంత్రి రాజేందర్ ఫోన్‌లో మాట్లాడారు.
కొద్ది రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయని, ఆస్పత్రుల్లో చేరుతున్న ఇన్‌పేషంట్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నా, తీవ్రత మాత్రం అంతగా లేదని అధికారులు వివరించారు. కరోనా పరీక్షల సంఖ్య పెంచడంతో పాటు కరోనా బారిన పడిన వారికి మెరుగైన చికిత్స అందేలా ఏర్పాట్లు చేయాలని మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment