Minister KTR Sensational Comments On BJP In Telangana Assembly Sessions - Sakshi
Sakshi News home page

4 కోట్ల మంది మా కుటుంబ సభ్యులే.. కేసీఆర్‌ మా పెద్ద

Published Sat, Feb 4 2023 1:22 PM | Last Updated on Sun, Feb 5 2023 9:33 AM

Minister KTR Sensational Comments In Telangana Assembly Sessions - Sakshi

దేశమంటే అదానీ, ప్రధాని మాత్రమే కాదు. 140 కోట్ల మంది ప్రజలు. ఒకరు అమ్మేవారు, మరొకరు కొనేవారు. సీబీఐ, ఐటీ, ఈడీలను వేటకుక్కల్లా వాడిన నీతి బాహ్య సర్కార్‌ బీజేపీది. తెలంగాణపై పగబట్టినట్టు సవతి తల్లి ప్రేమ చూపుతూ కేంద్రం ఆర్థిక పరమైన ఆంక్షలతో కుంగదీసే ప్రయత్నం చేస్తోంది. ఐటీఐఆర్‌ను రద్దు చేశాక కాకతీయ టెక్స్‌టైల్‌ పార్కు తదితరాలకు ఉత్తుత్తి మాటలే తప్ప ఇప్పటిదాకా ఇచ్చింది గుండుసున్నా. నా మాటలకు కట్టుబడి ఉన్నా.     
– కేటీఆర్‌

ఇది వసుదైక కుటుంబం...’’అని మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. కేసీఆర్‌ జై తెలంగాణ అనడం లేదంటూ ఇటీవల కొందరు మాట్లాడుతున్నారని.. అసలు కేసీఆర్‌ జైతెలంగాణ అనకుంటే తెలంగాణ వచ్చేదా? అని ప్రశ్నించారు. తెలంగాణతో కేసీఆర్‌కు ఉన్న పేగు బంధాన్ని తెంపే దమ్ము ధైర్యం ఎవరికీ లేవని స్పష్టం చేశారు. గవర్నర్‌ తమిళిసై ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై శనివారం శాసనసభలో వాడివేడీగా చర్చ జరిగింది. దీనికి సీఎం కేసీఆర్‌ తరఫున కేటీఆర్‌ సమాధానమిచ్చారు. చర్చలో బీజేపీ సభ్యుడు రఘునందన్‌రావు చేసిన విమర్శలను ప్రస్తావిస్తూ.. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ, ఇతర బీజేపీ నేతలపై విమర్శలు చేశారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రగతిని వివరించారు. కేటీఆర్‌ ప్రసంగం వివరాలు ఆయన మాటల్లోనే.. 

‘‘పదేళ్లు కూడా దాటని పసిగుడ్డు తెలంగాణ.. ఇప్పుడు దేశానికే టార్చ్‌బేరర్‌. సమీకృత, సమ్మిళిత, సమగ్ర అభివృద్ధి సూచిక. దేశానికి కాంతిరేఖ. పల్లె కన్నీరు పెడుతోందంటూ పాడుకున్న తెలంగాణ పల్లెలు ఇప్పుడు నవ చరిత్రకు నాంది పలుకుతున్నాయని కీర్తించుకునేలా పరిస్థితులు ఉన్నాయి. దేశంలో ఉత్తమ పంచాయతీలుగా 20 గ్రామాలు నిలిస్తే అందులో 19 తెలంగాణవి కావడమే దీనికి నిదర్శనం. వ్యవసాయ ఉత్పత్తుల్లో 26వ స్థానం నుంచి ఇప్పుడు పంజాబ్, హరియాణా తర్వాత దేశంలోనే మూడో స్థానానికి తెలంగాణ ఎగబాకిందని నాబార్డు నివేదికే చెప్తోంది. 2015లో 68.17 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తయితే.. ఇప్పుడు 2.02 కోట్ల టన్నులు వస్తోంది. ప్రభుత్వంపై విమర్శలు చేసే ప్రతిపక్షాలకు ఈ గణాంకాలు కనిపించటం లేదా? 

కొందరివి పసలేని విమర్శలు 
ప్రభుత్వ పథకాలు గొప్పగా ఉన్నా కొందరు వాటిపై పసలేని విమర్శలు చేస్తున్నారు. రైతుబంధును ఐక్యరాజ్యసమితి కూడా కీర్తిస్తే.. బడా వ్యక్తులకు దోచిపెడుతున్నారంటూ ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో పదెకరాలకు మించి భూమి ఉన్న వారి సంఖ్య కేవలం 3.1 శాతమే. రైతుబీమా కూడా పేద రైతు కుటుంబాలకు అండగా నిలుస్తోంది. రాష్ట్రంలో రైతు సంక్షేమం ఇలా ఉంటే మూడు వ్యవసాయ నల్ల చట్టాలు తెచ్చి రైతాంగం నడ్డి విరిచేందుకు కేంద్రం ప్రయత్నించింది. వాటిని వ్యతిరేకిస్తూ రోడ్డెక్కిన 700 మంది రైతుల ప్రాణాలు తీశారు. ఇలాంటి ప్రధాని ప్రపంచంలో ఎక్కడా ఉండరు. ఎల్‌ఐసీ వంటి సంస్థను దోస్త్‌కు దోచిపెట్టి క్రోనీ క్యాపిటలిజంను పెంచి పోషించారు. ప్రధాని కొందరు కార్పొరేట్‌ వ్యక్తుల మేలు కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ సీఎం కేసీఆర్‌ ప్రతి నిర్ణయం వెనుక మానవీయ కోణం ఉంది. 

కాళేశ్వరానికి ఖర్చు తప్పా..? 
కాళేశ్వరం ప్రాజెక్టును ప్రపంచం పొగుడుతోంది. డిస్కవరీ చానల్‌ ప్రత్యేక ప్రోగ్రామ్‌ రూపొందించి ప్రపంచం ముందుంచటం మనకు గర్వకారణం. కానీ అందులో అవి నీతి అంటూ ప్రతిపక్షాలు పసలేని విమర్శలు చేస్తున్నాయి. ముంబై–అహ్మదాబాద్‌ మధ్య బుల్లెట్‌ రైలుకు లక్ష కోట్లను ప్రధాని ఖర్చు పెట్చొచ్చు. కానీ 45 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే గొప్ప ప్రాజెక్టుకు లక్ష కోట్లు ఖర్చు పెడితే తప్పా? రివర్స్‌ పంపింగ్‌కు కాళేశ్వరం కేరాఫ్‌గా నిలిస్తే.. పచ్చటి పంటలతో కళకళలాడుతూ ఇప్పుడు పాలమూరు రివర్స్‌ మైగ్రేషన్‌కు చిరునామాగా నిలుస్తోంది’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. 

‘జోడో’ అంటూ పక్క నుంచి వెళ్లిపోం 
మునుగోడు ఎన్నికప్పుడు వంద మంది ఎమ్మెల్యేలను బరిలో దింపారన్న విమర్శలకు కేటీఆర్‌ స్పందిస్తూ.. ‘‘అవి ఎన్నికలు.. కచ్చితంగా పోరాడుతాం. ఎంత మందితోనైనా ప్రచారం చేయిస్తాం. జోడో యాత్ర అని నడుస్తూ ఎన్నిక జరిగే ప్రాంతం పక్కనుంచి వెళ్లిపోయే రకం కాదు..’’ అని పరోక్షంగా రాహుల్‌గాంధీ భారత్‌జోడో యాత్రపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీనిపై భట్టి విక్రమార్క అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్‌ది రాజకీయ యాత్ర కాదని.. వైషమ్యాలు పెంచి దేశాన్ని ముక్కలు చేసే ప్రయత్నం జరుగుతున్న సమయంలో.. దేశాన్ని ఒక్కటి చేసే భారత్‌జోడో యాత్ర అని స్పష్టం చేశారు. దీనిపై కేటీఆర్‌ వివరణ ఇస్తూ.. తాను మునుగోడు ఎన్నికను దృష్టిలో పెట్టుకుని మాట్లాడలేదని, ఎన్నికలు జరుగుతున్నప్పుడు గుజరాత్‌లో జోడోయాత్ర చేయకుండా పక్క నుంచి వెళ్లిపోవటాన్ని ప్రస్తావించానని చెప్పారు. ఇక ఈటల రాజేందర్‌ టీఆర్‌ఎస్‌లో బాగానే ఉండేవారని, బీజేపీలో చేరాక అసంబద్ధ విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. 

రెండున్నర గంటలు.. లెక్కలు, విమర్శలు.. 
మంత్రి కేటీఆర్‌ అసెంబ్లీలో దాదాపు రెండున్నర గంటల పాటు మాట్లాడారు. పలు గణాంకాలను వివరిస్తూ, ఆయా అంశాలకు సంబంధించిన పత్రికల క్లిప్పింగ్‌లు, ఇతర పత్రాలను చూపిస్తూ ప్రసంగించారు. శుక్రవారం నాటి గవర్నర్‌ ప్రసంగంలో ఎక్కడా కేంద్రంపై విమర్శలు లేకపోగా.. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై కేటీఆర్‌ సమాధానం మాత్రం కేంద్రం తీరును విమర్శిస్తూనే సాగింది. కేటీఆర్‌ గత ఎనిమిదిన్నరేళ్లలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ.. తెలంగాణ రాక ముందు ఉన్న పరిస్థితులతో బేరీజు వేసి విశ్లేషించారు. కాంగ్రెస్‌ పాలనను ఉటంకిస్తూ కొన్ని విమర్శలు చేసినా.. కేటీఆర్‌ ప్రసంగం ఆసాంతం బీజేపీ, మోదీ ప్రభుత్వమే లక్ష్యంగా సాగింది.  దేశానికి గుజరాత్‌ మోడల్‌ అంటూ చేసిన ప్రచారం పూర్తి డొల్లేనని విమర్శిస్తూ.. బీజేపీ పాలిత గుజరాత్, మధ్యప్రదేశ్‌లలో కరెంటు, రైతుల సమస్యలపై అక్కడి బీజేపీ ఎమ్మెల్యేల స్టేట్‌మెంట్లు, అక్కడి పత్రికల క్లిప్పింగులను ప్రదర్శించారు. మోటార్లకు మీటర్ల బిగింపు గురించి ప్రస్తావిస్తూ.. ఈ అంశంలో కేంద్రం రాసిన లేఖ ప్రతిని చూపారు.  

ప్రధాని మాటలన్నీ డొల్లే.. 
ప్రధాని మోదీ ఊదరగొట్టే మాటల్లో డొల్లతనమే తప్ప ఫలితాలు అంతంతే. కేసీఆర్‌ నేతృత్వంలో సాగుతున్నది ‘డబుల్‌ ఇంపాక్ట్‌ సర్కార్‌’. మోదీ డబుల్‌ ఇంజన్‌తో ఏమాత్రం పొంతన ఉండదు. సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్‌ అని గొప్పలు చెప్తున్నవారు చెప్పేవన్నీ ‘సబ్‌ బక్వాస్‌’. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమంలా సాగుతున్న కంటి వెలుగు కార్యక్రమంలో అందించే కళ్లద్దాలు మేడిన్‌ తెలంగాణ. ఈ నిజాలు ప్రతిపక్షాల కళ్లకు కనిపించడం లేదు. వారి కోసం అసెంబ్లీలో కంటి వెలుగు శిబిరం పెట్టించాలి. ప్రజాసంక్షేమం విషయంలో కేసీఆర్‌కు కులమతాలతో సంబంధం లేదు. ఆయనకు పేదరికమే గీటురాయి. 

దళిత బంధు లబ్ధిదారులతో సభ 
రాష్ట్రంలో దళిత బంధు పథకంతో ఎంత సంపద ఒనగూరిందో లెక్కలు తీసే బాధ్యతను సెస్‌కు అప్పగించాం. త్వరలో ఆ వివరాలు వస్తాయి. పథకం ప్రారంభించి త్వరలో రెండేళ్లు అవనున్న సందర్భంగా.. దాన్ని ప్రారంభించిన ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో దళిత బంధు లబ్ధిదారులతో భారీ సభ నిర్వహిస్తాం. జాతీయ స్థాయి ప్రముఖులు దీనికి హాజరవుతారు. 

రియల్‌ లీడర్‌గా తెలంగాణ 
చాక్లెట్‌ నుంచి రాకెట్‌ వరకు, ట్రాక్టర్‌ నుంచి హెలికాప్టర్‌ వరకు, యాప్స్‌ నుంచి మ్యాప్స్‌ వరకు ఉత్పత్తి, అభివృద్ధి చేస్తూ తెలంగాణ  రాష్ట్రం రియల్‌ లీడర్‌గా ఎదిగింది. వరల్డ్‌ గ్రీన్‌ సిటీగా, హరితహారం ద్వారా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ప్రయత్నం చేయడంవంటి తెలంగాణ విజయాలను ‘మన్‌కీబాత్‌’లో ప్రస్తావించేందుకు కూడా ప్రధాని మోదీకి నోరు రాలేదు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement