వరంగల్ (హన్మకొండ అర్బన్) : తెలంగాణ రాష్ట్రాన్ని, కేసీఆర్‌ను బీట్ చేసే మొగోడు ఏ రాష్ట్రంలో లేడని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. కార్మిక మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం హనుమకొండలోని తారా గార్డెన్స్‌లో ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బీజేపీని...మోదీని నమ్మి దేశప్రజలు తీవ్రంగా మోసపోయారని, మరోసారి అలా జరిగే పరిస్థితి లేదని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. దేశంలో కేసీఆర్ కొత్త పార్టీ అధికారంలోకి వస్తే ఆటోలకు ఫిట్‌నెస్‌తో సహా అన్నీ ఫ్రీ చేస్తామన్నారు. వచ్చే దసరా పండగరోజు భద్రకాళికి మొక్కి కేసీఆర్ కేంద్రంపై యుద్ధానికి బయలు దేరుతారని అన్నారు.
మోదీ అంటేనే మోసాలకు నంబర్ వన్ కేడీ అని అన్నారు. ఏ ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గాని దళిత బంధు అమలు చేస్తే తన మంత్రి , ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేస్తానన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తే శాశ్వతంగా రాజకీయాల్లో నుంచి తప్పుకుంటానని రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఓర్వలేకనే బీజేపీ, కాంగ్రెస్ అధ్యక్షులు కుట్రలు చేస్తున్నారన్నారు. వీళ్లు నడుమంత్రపు దొంగలు, చెడ్డగొట్టుడు గాళ్లని అన్నారు. కేసీఆర్ సంపూర్ణ మద్దతు ఇద్దామని కార్మికులకు పిలుపునిచ్చారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కార్మికులకే కేటాయించాలని కోరారు.
తాము అధికారంలోకి వస్తే ధాన్యం క్వింటాల్ రూ.2500కు కొంటామని రేవంత్‌రెడ్డి చెపుతున్నాడని, అసలు వాడు వచ్చేది లేదు సచ్చేది లేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ముందుగా ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేయాలన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులను ఇబ్బంది పెడుతుందని, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ వస్తే చాలా ఉద్యోగాలు వచ్చేవని, కాంగ్రెస్, బీజేపీలు దక్కకుండా తొక్కిపడేశాయన్నారు. కేంద్రం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను సీఎం కేసీఆర్ అడ్డుకున్నారన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం కార్మికులకు ఇచ్చే టూ వీలర్స్‌లలో వరంగల్, హనుమకొండ జిల్లాలకు పదివేల సైకిల్ మోటార్లు ఇవ్వాలని మంత్రి మల్లారెడ్డి విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేకంగా పనిచేస్తుందని, కార్మికులంతా కలిసి కట్టుగా ఉండాలన్నారు. కార్మిక శాఖలో అధికారుల నిర్లక్ష్యం వల్ల క్లయిమ్‌లు పేరుకు పోయాయని, దీంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రికి తెలిపారు. ఆటోకార్మికుల కోసం ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ నెల 31న కాజీపేట రైల్వే క్రీడా మైదానంలోనిర్వహించే సభకు పెత్త సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. కాగా అంతకు ముందు మంత్రి మల్లారెడ్డి భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పుల్ల శ్రీనివాస్, అజీజ్‌ఖాన్, బొట్లబిక్షపతి, సారంగపాణి, కార్పొరేటర్లు, పలు కార్మిక సంఘాల నాయకులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment