సాక్షి, మేడ్చల్ జిల్లా: టీపీసీసీ కొనుక్కున్న మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యేల టికెట్లు అమ్ముకుంటున్నాడని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పనాశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అంటే స్కాములని, ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే స్కీములని, తెలంగాణ రాష్ట్రంలో ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో ఎక్కడా లేవని మంత్రి పేర్కొన్నారు.
శనివారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో సంపద పెంచుతూ..పేద ప్రజలకు పంచుతున్నారని కొనియాడారు. రాహుల్ గాంధీ పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుందని, వారి హయాంలో నీళ్లు, కరెంట్ ఉన్నా..ఇవ్వలేకపోయారని మంత్రి మల్లారెడ్డి ఎద్దేవా చేశారు. మల్కాజిగిరి ఎంపీగా గెలిచిన తర్వాత రేవంత్‌రెడ్డి నియోజకవర్గం ప్రజల ముఖం చూసింది లేదని, వారి మంచి, చెడ్డలను ఆలోచించింది కూడా లేదని ఆయన ధ్వజమెత్తారు.
ప్రాంతీయ పా ర్టీలు ఉన్న చోట బీజేపీ గెలువలే..
ప్రాంతీయ పా ర్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ గెలువలేదని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్న చోటనే గెలించిందని, అలాగే, కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీ ప్రభుత్వాలు ఉన్నచోటనే గెలించిందని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి ప్రజలను లూటీ చేసిందన్నారు. మేడిగడ్డపై బీజేపీ, కాంగ్రెస్ పా ర్టీలది ఎన్నికల స్టంట్ మాత్రమేనని, దేశానికే ఆదర్శంగా నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టుపై బురద జల్లే ప్రయత్నం జరుగుతుందన్నారు.
‘మైనంపల్లి పిచ్చికుక్క అయిండు’
మైనంపల్లి హన్మంతరావు బీఆర్‌ఎస్‌లో ఉన్నప్పడు మంచిగుండే...ఇప్పుడేమో పైల్మాన్‌గా, రౌడీగామారి ‘చంపేస్తా.. కాలేజీలను మూసేస్తానని’ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతూ..పిచ్చి కుక్క అయిండని మంత్రి మల్లారెడ్డి విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిలోనూ..పేదలకు సంక్షేమ పథకాలను అందించటంలోనూ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా నంబర్ వన్‌గా నిలిచిందని మల్లారెడ్డి తెలిపారు. మీట్ ది ప్రెస్ కార్యక్రమాన్ని హైదరాబాద్ ప్రెస్ క్లబ్ నిర్వహించగా, ఇందులో అధ్యక్షుడు వేణుగోపాల్‌నాయుడు, ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment