
నగదుని ఆలయ అధికారులకు అందజేస్తున్న మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ విమాన గోపురానికి బంగారం తాపడంకోసం మూడున్నర కిలోల బంగారానికి సరిపడే నగదును కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి (మల్లన్న) గురువారం తన నియోజకవర్గ కార్పొరేటర్లతో కలిసి అందజేశారు. మేడ్చల్‌లోని తన క్యాంప్ కార్యాలయం నుంచి భారీ ర్యాలీతో మం త్రి మల్లారెడ్డి యాదాద్రి కొండకు చేరుకున్నారు. రూ.కోటి 83 లక్షల నగదును తలపై పెట్టుకొని కుటుంబ సభ్యులు, కార్పొరేటర్లతో కలిసి బాలాలయం వద్దకు వచ్చారు.
ఈ సందర్భంగా ఆలయ ఈవో గీతారెడ్డి, ఆచార్యులు సంప్రదాయంగా స్వాగతం పలికారు. ఇటీవల సీఎం కేసీఆర్ యాదాద్రిలో పర్యటించిన సందర్భంగా.. మంత్రి మల్లారెడ్డి తన కుటుంబం తరపున కిలో బంగారం, అలాగే మేడ్చల్ ప్రజల తరపున కూడా బంగారం అందిస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే మంత్రి మల్లారెడ్డి తన కుటుంబం తరపున కిలో బంగారం, మేడ్చల్ నియోజకవర్గ ప్రజల తరపున రూ.1 కోటి 83 లక్షలను విరాళంగా అందజేశారు.
ఇందులో రూ.72 లక్షలు చెక్కు రూపంలో, రూ.కోటి 11 లక్షలు నగదు రూపంలో అందజేసినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. మల్లారెడ్డి ఆలయానికి వస్తున్న నేపథ్యంలో గురువారం ఉదయం 11.20 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు దర్శనాలు నిలిపివేశారు. దీంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు.మల్లారెడ్డి అనుచరులు బాలాలయంలో శ్రీస్వామివారి ప్రతిష్టా కవచమూర్తుల విగ్రహాలను సెల్ ఫోన్‌లతో ఫొటోలు తీశారు. దీంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేసి, ఫొటోలను సెల్ ఫోన్‌లో నుంచి తొలగించారు.
‘జేఎస్‌ఆర్ సన్‌సిటీ’రూ.50 లక్షల విరాళం
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ విమాన గోపురానికి బంగారం తాపడం పనులకు స్థిరాస్తి సంస్థ జేఎస్‌ఆర్ సన్‌సిటీ అధినేత జడపల్లి నారాయణ విరాళం అందజేశారు. గురువారం రూ.50 లక్షల చెక్కును ఆయన ఆలయ ఈవో గీతారెడ్డికి అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment