సదస్సులో మాట్లాడుతున్న మంత్రి నిరంజన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్/గచ్చిబౌలి: సమాజం ఎదుర్కొంటున్న పలు సమస్యలకు టెక్నాలజీ ఆధారంగా పరిష్కారం చూపేందుకు తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) ఆధ్వర్యంలోని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ముందుకు రావడం అభినందనీయమని వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. టీ–హబ్‌లో నిర్వహించిన టీటా గ్లోబల్ సింపోజియంను ఆదివారం ప్రారంభించిన అనంతరం నిరంజన్‌రెడ్డి మాట్లాడారు. 50 దేశాల నుంచి పలువురు టెక్కీలు, టీటా సభ్యులు ఆన్‌లైన్ ద్వారా పాల్గొన్న ఈ జనరల్ బాడీని మంత్రి ప్రారంభించారు.
అగ్రికల్చర్‌లో టెక్నాలజీ అనుసంధానం ఎలా అనే అంశంపై టీటాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు కృషి చేయడం అభినందనీయమని ప్రశంసించారు. టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మఖ్తల సారథ్యంలోని యువ ఇంజినీర్లకు తమ తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీఇచ్చారు. కేసీఆర్ వంటి విజన్ గల నేత, కేటీఆర్‌లాంటి మంత్రి ఉండటం అదృష్టమన్నారు. అహంకారం లేని సంస్కారంతో కూడిన జ్ఞానాన్ని పంచకలిగే వ్యక్తులను తయారుచేయాలని టీటాకు సూచించారు.
అప్లికేషన్ వాడుకునే పరిజ్ఞానం ఉన్నప్పటికీ ఐటీలో తన మనవడు బెటర్ టీచర్ అని చమత్కరించారు. ఐహబ్ చైర్మన్ కల్పన మాట్లాడుతూ అన్నదాతలు ఎదుర్కొంటున్న పలు సమస్యలకు టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలు ఉత్తమమార్గంగా నిలుస్తాయని పేర్కొన్నారు. సందీప్ మఖ్తల మాట్లాడుతూ, 12 ఏళ్లుగా 50 దేశాలకు పైగా టెక్కీలతో టీటా సింపోజియంను ఏటా నిర్వహిస్తున్నామన్నారు. ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, లెఫ్టినెంట్ కల్నల్ బిక్షపతి, ప్రత్యూష, రమేశ్ తదితరులు మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment