హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, ఐఓటీ వంటి కొత్త టెక్నాలజీలు ఐటీ రంగం రూపాన్ని మార్చేస్తుండటంతో ఈ రంగంలో కొత్త పెట్టుబడులకు విదేశీ దిగ్గజాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఐటీ రంగంలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న హైదరాబాద్‌ను ఇందుకు వేదిక చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే దాదాపు 10 విదేశీ దిగ్గజాలు ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి.
‘‘ఇవన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. ఖరారు కాకుండా వెల్లడించకూడదన్న (నాన్ డిస్‌క్లోజన్) నిబంధనల కారణంగా వాటి పేర్లను వెల్లడించలేం. కాకపోతే వీటిద్వారా రూ.15వేల కోట్ల పెట్టుబడులు, 75వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి’’ అని ఐటీ విభాగం ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. గడిచిన నాలుగేళ్లలో తెలంగాణలో 150కిపైగా భారీ, మధ్య తరహా కంపెనీలు కార్యాలయాలను ఏర్పాటు చేశాయని, టీ హబ్ ఏర్పాటుతో భారీగా స్టార్టప్‌లు వచ్చాయని చెప్పారాయన.
కాగా అమెరికాకు చెందిన రెండు ఫాస్ట్‌ఫుడ్ కంపెనీలు ఇక్కడ అతిపెద్ద టెక్ డెవలప్‌మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయటానికి చేస్తున్న ప్రయత్నాలు తుది దశలో ఉన్నట్లు కూడా విశ్వసనీయంగా తెలిసింది. వీటితో పాటు అంతర్జాతీయంగా పేరొందిన ఆటోమొబైల్ కంపెనీ తన పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని త్వరలోనే ఇక్కడ ఏర్పాటు చేయనుంది. మరోవంక కొరియాకు చెందిన కార్ల విడిభాగాల తయారీ సంస్థ హ్యూందాయ్ మొబిస్ భారీ క్యాంపస్‌ను హైదరాబాద్ సమీపంలో ఏర్పాటు చేస్తున్నట్టు సెప్టెంబరులో ప్రకటించింది. 20 ఎకరాల్లో రానున్న ఈ ఫెసిలిటీ ద్వారా 2,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని కంపెనీ ప్రతినిధులు చెప్పారు.
ఐటీలో 4.75 లక్షల మంది...
తెలంగాణలో ఐటీ, ఐటీఈఎస్ రంగంలో 2018 జూన్ నాటికి 4.75 లక్షల పైచిలుకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో గడిచిన ఏడాదిలో చేరినవారు 43,417 మంది. గత నాలుగేళ్లలో ఐటీలో దాదాపు 1.5 లక్షల మందికి కొత్తగా ఉద్యోగాలొచ్చాయనేది సంబంధిత వర్గాల మాట. ఇక ఐటీ ఎగుమతులు 2013–14లో రూ.52,258 కోట్లుంటే, నాలుగేళ్లలో రూ.93,442 కోట్లకు ఎగిశాయి. నాస్కాం గణాంకాల ప్రకారం ఐటీ ఎగుమతులు దేశంలో సగటు 7–9% నమోదైతే.. తెలంగాణలో ఇది 9.32 శాతం. 2020 నాటికి ఎగుమతులు రూ.1.20 లక్షల కోట్లు దాటుతాయని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.
టీఎస్ ఐపాస్‌తోనే: కేటీఆర్
తెలంగాణ ఏర్పాటుకు ముందు ఉన్న ఎన్నో అనుమానాలను పటాపంచలు చేస్తూ పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యంగా రాష్ట్రాన్ని మార్చామని కేటీఆర్ ‘సాక్షి’ బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘తెలంగాణకు, ముఖ్యంగా హైదరాబాద్‌కు భౌగోళిక సానుకూలతలున్నాయి.
ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనంలో టీఎస్ ఐపాస్ వంటి వినూత్న పారిశ్రామిక అనుమతుల ప్రక్రియను తీసుకురావడం దీనికి తోడయింది. దీంతో రాష్ట్రంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులొచ్చాయి. మున్ముందు కూడా ఈ అనుకూల వాతావరణాన్ని కొనసాగిస్తాం. మరిన్ని పెట్టుబడులను రప్పించి ఉద్యోగావకాశాలు పెంచుతాం. రానున్న సంవత్సరాల్లో తెలంగాణ మరింత వేగంగా పెట్టుబడులను ఆకర్షిస్తుందన్న నమ్మకం నాకుంది’ అని చెప్పారాయన.
Comments
Please login to add a commentAdd a comment