కేంద్రమంత్రి శోభకు వినతిపత్రం అందిస్తున్న నిరంజన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్/కుత్బుల్లాపూర్: ఎగుమతులు పెరిగితేనే రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి శోభ కరంద్లాజే అన్నారు. అందువల్ల రైతులు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల మీద దృష్టి సారించాలని పిలుపు నిచ్చారు. తెలంగాణ పర్యటనకు వచ్చిన ఆమె సోమవారం బీఆర్‌కేఆర్ భవన్‌లో రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి శోమిత బిశ్వాస్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు తదితరులు పాల్గొ న్నారు.
ఈ సందర్భంగా శోభ మాట్లాడుతూ, అన్ని పరిశ్రమలకు ప్రాధాన్యం ఇచ్చినట్లే పరిశ్రమలశాఖ ఆహార ఉత్పత్తుల ఎగుమతులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వ్యవసాయ, ఉద్యాన, పరిశ్రమల అధికారులతో ఒక బృందం ఏర్పాటు చేయాలని సూచించారు. పంటల సాగులో ఎరువులు, రసాయనాల వినియోగం తగ్గించి, అంతర్జాతీయ ప్రమాణాలు పాటించినప్పుడే ఇతర దేశాలకు ఎగుమతి చేయగలుగుతామన్నారు. ఈ దిశగా రైతులు దృష్టి సారించాలన్నారు. వేరుశనగ, పొద్దుతిరుగుడు వంటి నూనెగింజలతో పాటు పప్పుగింజల సాగుకు కేంద్ర సహకారం అందిస్తామని అన్నారు. ఆయిల్ పామ్ సాగుకు వంద శాతం సబ్సిడీని పరిశీలిస్తామన్నారు.
దొడ్డు వడ్లను కొనుగోలు చేయాలి..
అన్నదాతలకు కేంద్రం అండగా నిలవాలని మంత్రి నిరంజన్‌రెడ్డి కోరారు. దొడ్డు రకం వడ్లు కొనుగోలు చేయబోమన్న ఎఫ్‌సీఐ అర్థాంతర నిర్ణయం రైతాంగానికి గొడ్డలిపెట్టు అన్నారు. ఈ నిర్ణయంతో రైతాంగం ఆందోళనలో ఉన్నారన్నారు. వరి సాగు నుంచి నూనె, పప్పుగింజలు, ఆయిల్ పామ్ సాగు వైపు రైతాంగాన్ని మళ్లించేందుకు ప్రణాళికతో ముందు కెళ్తున్నామన్నారు. దొడ్డు వడ్లను సేకరించ బోమన్న ఎఫ్‌సీఐ నిర్ణయం వాయిదా వేయాలన్నారు.
తెలంగాణ మామిడికాయకు అంతర్జాతీయ ప్రసిద్ధి ఉందన్నారు. కానీ, కేంద్రం నుంచి తగినంత సహకారం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయిల్ పామ్‌కు వంద శాతం రాయితీ కల్పించాలన్నారు. అలాగే రాష్ట్రానికి నిధుల కేటాయింపు పెంచాలని నిరంజన్‌రెడ్డి కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేశారు. కాగా, శోభ హైదరాబాద్ జీడిమెట్ల వద్ద ఉన్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (కూరగాయలు, పువ్వులు)ను సందర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment