
సాక్షి,హైదరాబాద్: కేరళ రాజధాని తిరువనంతపురంలో ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు జరిగే జాతీయ మహిళా లెజిస్లేచర్ సదస్సులో పాల్గొనాల్సిందిగా శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవితకు ఆహ్వానం అందింది. ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’లో భాగంగా కేరళ శాసనసభ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సదస్సుకు జాతీయస్థాయి నేతలు హాజరుకానున్నారు.
సదస్సులో భాగంగా ఈ నెల 27న ‘నిర్ణయాత్మక విభాగాల్లో మహిళల ప్రాతినిథ్యం’అనే అంశంపై లోక్‌సభ సభ్యురాలు రమ్యా హరిదాస్ అధ్యక్షతన జరిగే చర్చా గోష్టిలో కవిత ప్రసంగించనున్నారు. కవితతో పాటుగా ఉత్తరాఖండ్ అసెంబ్లీ స్పీకర్ రితు ఖండూరీ, భారత మహిళా జాతీయ సమాఖ్య ప్రధాన కార్యదర్శి అనీరాజా పాల్గొననున్నారు. కేరళ ఎమ్మెల్యేలు ఓఎస్ అంబిక, దలీమా సమన్వయం చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment