జయశంకర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్సీ కవిత, మంత్రి మల్లారెడ్డి తదితరులు
మేడ్చల్: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి విడుదల చేస్తున్న నిధులపై రాష్ట్ర ప్రజలందరూ లెక్కలు రాసి వాటిని అవసరమైనప్పుడు చూపాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మేడ్చల్ పట్టణంలోని కేఎల్‌ఆర్ వెంచర్ ఫేజ్–2 కమాన్ వద్ద ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని, అమరవీరుల స్థూపాన్ని ఆదివారం ఆమె మంత్రి మల్లారెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రొ. జయశంకర్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ కోసం ఖర్చు చేసిన నిధులపై లెక్కలు రాసి రాష్ట్ర సాధన ఉద్యమాల సమయంలో ప్రజలకు నాయకుల ద్వారా వివరించారన్నారు.
ఆయన రాసిన లెక్కల ద్వారానే తెలంగాణ ఎంత అన్యాయం జరిగింది ప్రజలకు తెలిసిందన్నారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు. మోసం చేస్తున్న వారిని పక్కాగా గుర్తు పెట్టుకోవాలన్నారు. ఆర్టీసీ బిల్లుపై గవర్నర్‌కు వచ్చిన ఇబ్బంది ఏమిటో తమకు అర్థంకావడం లేదని అన్నారు.
అలుపెరగని యోధుడు జయశంకర్..
అలుపెరగని యోధుడు జయశంకర్ అని ఆమె పేర్కొన్నారు. జీవితాన్ని తెలంగాణ కోసం త్యాగం చేశాడన్నారు. ఆంధ్రలో తెలంగాణ వీలీనాన్ని ఆయన ఒప్పుకోలేదని, ఆ తర్వాత ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నాడని, ఆ తర్వాత తొలిదశ, మలి దశ ఉద్యమాల్లో పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించాడని కొనియాడారు. ఆయన జీవితం యువతకు ఆదర్శనీయమన్నారు.
కేసీఆర్‌కు అండగా నిలిచారు..
రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో కేసీఆర్ దొర అని ఆయన వెనుక బీసీ అయిన జయశంకర్ ఉండవద్దని ఎంతో మంది జయశంకర్‌కు చెప్పారని అందుకు ఆయన కేసీఆర్ తెలంగాణ కోసం ఉద్యమం చేస్తున్నాడని ఆయన తెలంగాణ నినాదం వదిలితే తాను కేసీఆర్‌ను వదులుతానని అనేవారని గుర్తు చేశారు. కేసీఆర్ ఉద్యమాన్ని వదలేదని జయశంకర్ కేసీఆర్‌ను వదలేదన్నారు.
ఉద్యమంలో అమరుడైన శ్రీనివాస్ కుటుంబానికి రూ.5 లక్షలు ఇస్తానని మంత్రి మల్లారెడ్డి ఈ సందర్భంగా ప్రకటించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దేవీ వరప్రసాద్, బీఆర్‌ఎస్ నాయకులు మహేందర్‌రెడ్డి, వీరభద్రారెడ్డి, ప్రవీణ్‌కుమార్ ,సత్యపాల్‌రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ దీపిక నర్సింహారెడ్డి, మద్దుల శ్రీనివాస్‌రెడ్డి, భాస్కర్ యాద వ్, శంకర్‌ముదిరాజ్, జగన్‌రెడ్డి, దయానంద్‌యాదవ్, రమేష్ , దేవ, శ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిలర్లు, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment