ఈ నెలలోనే కేంద్ర బడ్జెట్..ఈసారైనా పట్టాలెక్కేనా?
» కోట్లాదిమంది భక్తులు సందర్శించే ఆధ్యాత్మిక క్షేత్రం వారణాసికి కొంతకాలంగా హైదరాబాద్ నుంచి భక్తుల రద్దీ పెరిగింది. కానీ భక్తుల డిమాండ్ మేరకు రైళ్లు లేవు.
» నగరవాసులు అయోధ్య బాలరాముడిని సందర్శించాలంటే ఖరీదైన ఐఆర్‌సీటీ ప్యాకేజీతో భారత్ గౌరవ్ రైళ్లు ఎక్కాల్సిందే. పైగా అది వారం, పది రోజుల పర్యాటక రైలు (టూరిస్ట్ ట్రైన్). జంటనగరాల నుంచి నేరుగా అయోధ్యకు వెళ్లేందుకు ఎలాంటి సదుపాయం లేదు.
» సికింద్రాబాద్ నుంచి దానాపూర్‌కు ఒకే ఒక్క రైలు అందుబాటులో ఉంది. ఇది ప్రతిరోజూ 180 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తోంది. తాజాగా ఈ ట్రై న్‌కు 2 సాధారణ బోగీలను అదనంగా ఏర్పాటు చేశారు. కానీ ఈ రూట్‌లో మరో రైలు ఏర్పాటు చేయాలనే డిమాండ్ చాలాకాలంగా ఉంది.
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ నుంచి తిరుపతి, విశాఖ, బెంగళూరులకు ప్రవేశపెట్టిన వందేభారత్ రైళ్లు మినహా హైదరాబాద్ మహా నగరానికి సంబంధించి ఈ పదేళ్లలో కొత్తగా పట్టాలెక్కిన రైళ్లు తక్కువే. ముచ్చటగా మూడోసారి కొలువుదీరిన మోదీ సర్కార్ ఈ నెలలోనే బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేపట్టింది.
దీంతో ఈసారైనా కొత్త రైళ్లు కరుణిస్తాయేమోనని నగర ప్రయాణికు లు ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రయాణికుల రద్దీ, డిమాండ్ అత్యధికంగా ఉన్న మార్గాల్లో కొత్త రైళ్లు ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనకు గ్రీన్‌సిగ్నల్ వే స్తారా లేదా అనేది మరికొద్ది రోజుల్లోనే తేలనుంది.
ఈ మార్గాల్లో భారీ డిమాండ్ ....
∙సికింద్రాబాద్ నుంచి బిహార్‌లోని దానాపూర్‌కు ఇప్పుడు ఒకే ఒక్క సూపర్‌ఫాస్ట్ రైలు ఉంది. కానీ ప్రతిరోజూ కనీసం రెండు రైళ్లకు సరిపడా ప్రయాణికులు పడిగాపులు కాస్తూనే ఉంటారు. ఈ రూట్‌లో అన్ని వర్గాల ప్రయాణికులు రాకపోకలు సాగించే విధంగా మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ఏర్పాటు చేయవలసి ఉంది.
అలాగే హైదరాబాద్ నుంచి అయోధ్యకు నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, బల్లార్షా, గోండియా, జబల్‌పూర్, కట్ని, ప్రయాగరాజ్, వారణాసిల మీదుగా వారానికి రెండుసార్లు బై వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును నడపాలనే డిమాండ్ ఉంది. ఈ ట్రైన్ అందుబాటులోకి వస్తే నగరానికి చెందిన భక్తులు ఐఆర్‌సీటీసీ రైళ్లపైన ఆధారపడవలసిన అవసరం లేకుండా నేరుగా అయోధ్య, వారణాసిలకు రాకపోకలు సాగించే అవకాశం లభిస్తుంది.
» సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చి ( కోల్‌కతా )కి కూడా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది. ఈ రూట్‌లో ఒక బై వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ను ప్రవేశపెట్టవలసి ఉంది. దీంతో సికింద్రాబాద్ నుంచి కాజీపేట, బల్లార్షా, గోండియా, రాయ్‌పూర్, ఝర్సుగూడ, టాటానగర్‌ల మీదుగా ప్రయాణికులకు సదుపాయం లభిస్తుంది. కాజీపేట– బల్లార్షా సెక్షన్‌లో కోల్‌కతాకు వెళ్లేందుకు ప్రస్తుతం ఒక్క రైలు కూడా లేదు.
» ప్రతి సంవత్సరం లక్షలాది మంది అయ్యప్ప భక్తులు శబరికి వెళ్తారు. కానీ ప్రస్తుతం హైదరాబాద్–శబరి ఎక్స్‌ప్రెస్ ఒక్కటే ఇక్కడినుంచి అందుబాటులో ఉంది. ఈ రూట్‌లో సికింద్రాబాద్ నుంచి కొల్లాం వరకు ఒక బై వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును వికారాబాద్, గుంతకల్, తిరుపతిల మీదుగా నడపాలని భక్తులు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి గాం«దీధాం (గుజరాత్) వరకు బై వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలును ప్రవేశ పెట్టాలనే డిమాండ్ కూడా పెండింగ్‌లోనే ఉంది.
తెలంగాణ సంపర్క్ క్రాంతి ఏమైనట్లు?
హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ వరకు రాకపోకలు సాగించే విధంగా తెలంగాణ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలును నడపాలనే ప్రతిపాదన పదేళ్లుగా పెండింగ్‌లోనే ఉంది. ప్రస్తుతం తెలంగాణ ఎక్స్‌ప్రెస్ మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ప్రతిరోజూ వందలాది మంది వెయిటింగ్ లిస్ట్‌పై దృష్టి పెట్టి పడిగాపులు కాస్తుంటారు.
మరోవైపు ఇటీవలి కాలంలో నగరవాసులు ఎక్కువగా రాకపోకలు సాగిస్తున్న సికింద్రాబాద్ నుంచి రామేశ్వరం రూట్‌లో ఒక వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను కాజీపేట, విజయవాడ, గూడూరు, రేణిగుంట, కాంచీపురం, విల్లుపురం మీదుగా ప్రవేశపెడితే ప్రయాణికులకు ఎంతో ఊరట లభిస్తుంది.
రాజధానితో అనుసంధానం ఏదీ?
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి, ఉమ్మడి జిల్లా కేంద్రాలకు ట్రైన్ కనెక్టివిటీ అరకొరగానే ఉంది. ఇంటర్‌సిటీ రైళ్ల తరహాలో ప్రత్యేకంగా వివిధ జిల్లా కేంద్రాలకు రైళ్లను ప్రవేశపెట్టాలని చాలాకాలంగా ప్రతిపాదనలు ఉన్నాయి.
సికింద్రాబాద్ నుంచి కరీంనగర్ వరకు కాజీపేట, పెద్దపల్లి పట్టణాల మీదుగా వందే మెట్రో రైలును ప్రవేశపెట్టాలి, అలాగే సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్ మార్గంలో ఒక ఇంటర్ సిటీ రైలును నడపాలనే ప్రతిపాదన చాలా రోజులుగా పెండింగ్‌లో ఉంది. అలాగే హైదరాబాద్ – బోధన్, కాచిగూడ–పుదుచ్చేరి తదితర మార్గాల్లో రైళ్లకు డిమాండ్ ఉంది.
చర్లపల్లిని ప్రారంభిస్తారా?
టెరి్మనల్‌గా అందుబాటులోకి వచ్చిన చర్లపల్లి స్టేషన్ ఇప్పటివరకు ప్రారంభానికి నోచుకోలేదు. నిర్మాణ పనులు పూర్తయినప్పటికీ ఇంకా రైళ్ల రాకపోకలు అందుబాటులోకి రాలేదు. ఇది ప్రారంభమైతే సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లపై ఒత్తిడి తగ్గనుంది. మరోవైపు సికింద్రాబాద్ స్టేషన్ పునర్నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్న దృష్ట్యా కూడా చర్లపల్లిని వినియోగంలోకి తేవలసి ఉంది.
ఎన్నికల నేపథ్యంలో చర్లపల్లి ప్రారంభోత్సవం వాయిదా పడినట్లు అప్పట్లో అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం కొలు వుదీరింది. ఇప్పటికైనా చర్లపల్లి అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు సదుపాయంగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment