మళ్లీ జరిగింది.. మరో ఎలక్ట్రిక్ వాహనం(ఈవీ) మంటల్లో కాలిపోయింది.. గత వారం రోజుల్లో ఇది నాలుగోసారి.. చమురు ధరలు భగ్గుమంటున్న నేపథ్యంలో ప్రజలంతా నెమ్మది నెమ్మదిగా ఈవీల వైపు మళ్లుతున్నారు. వీటి అమ్మకాలూ ఊపందుకుంటున్నాయి. భవిష్యత్తు వాహనాలుగా ఈవీలను అభివర్ణిస్తున్న సమయంలో ఇటీవలి సంఘటనలు ఎలక్ట్రిక్ వాహనాల భద్రతపై ప్రజల మనసుల్లో పలు సందేహాలను రేకెత్తించాయి.. నిజంగా వీటి వల్ల ప్రమాదమా? లేక వాటిని హ్యాండిల్ చేయడంలో మనమేమైనా తప్పులు చేస్తున్నామా? ఎండలకు వీటికీ సంబంధమేంటి? ఇంతకీ నిపుణులేమంటున్నారు?
– సాక్షి, సెంట్రల్ డెస్క్
అసలేం జరిగింది?
►తమిళనాడులోని వెల్లూరులో ఓ వ్యక్తి తన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇంటి ముందు పార్క్ చేసి.. చార్జింగ్ పెట్టి.. పడుకోవడానికి వెళ్లాడు.. రాత్రి సమయంలో ఒక్కసారిగా ఎలక్ట్రిక్ వాహనానికి నిప్పంటుకుంది. ఆ మంటలు పక్కనున్న బైక్(పెట్రోలు వాహనం)కు అంటుకుని అది పేలింది. ఇళ్లంతా పొగ కమ్ముకుంది.. ఇంటి ముందు వాహనాలు తగులబడుతుండటంతో బయటకు వచ్చే మార్గం లేక.. ఆ వ్యక్తితోపాటు అతడి 13 ఏళ్ల కుమార్తె ఊపిరాడక మృతి చెందారు.
►అటు తిరుచ్చిలో ఎలక్ట్రిక్ వాహనం నుంచి పొగ లు వస్తుండటంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. అదృష్టవశాత్తూ ప్రమాదం తప్పింది.
►పుణేలో జరిగిన మరో ఘటనలో రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ నుంచి పొగ రావడం అంతలోనే.. భగ్గుమంటూ కాలిపోవడం క్షణాల్లో జరిగిపోయింది. చెన్నైలోనూ తాజాగా మరో ఎలక్ట్రిక్ స్కూటర్‌కు నిప్పంటుకుంది.
►అయితే, వెల్లూరు దుర్ఘటనకు సంబంధించి పాత కాలపు చార్జింగ్ సాకెట్ వాడటం వల్ల షార్ట్ సర్క్యూట్ అయిందని.. అదే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తేల్చారు. మిగతా ఘటనల్లో బ్యాటరీ నుంచి పొగలు రావడం ఆయా వీడియోల్లో కనిపించింది. అయితే, ఈ ప్రమాదాలు ఎలా జరిగాయన్న విషయంపై విచారణ జరుపుతున్నట్లు ఆయా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలు ప్రకటించాయి.
►మరోవైపు వరుస ఘటనల నేపథ్యంలో కేంద్రం స్పందించింది. ఈ వాహనాల తయారీలో నిర్మాణపరమైన లోపాలు ఏమైనా ఉన్నాయా అన్న విషయాన్ని తేల్చేందుకు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో), సెంటర్ ఫర్ ఫైర్ ఎక్స్‌ప్లోజివ్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సేఫ్టీ(సీఎఫ్‌ఈఈఎస్)ను రంగంలోకి దించింది.
నిపుణులేమంటున్నారు?
ఈవీల్లో లిథియం అయాన్ బ్యాటరీలు వాడతారు. ఇవి ప్రధానంగా రెండు కారణాల వల్ల ఫెయిల్ అవుతాయి. ఒకటి.. బ్యాటరీ తయారీలోనే లోపం ఉండటం... రెండోది.. బ్యాటరీపై తీవ్రమైన ఒత్తిడి పడటం.. వీటి వల్ల బ్యాటరీలో విపరీతమైన వేడి ఉత్పత్తై.. షార్ట్ సర్క్యూట్ కావడం లేదా బ్యాటరీకి నిప్పంటుకోవడం వంటివి జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో మండే లక్షణమున్న వాయువులు విడుదలవడం వల్ల పేలుడు సంభవిస్తుందని అంటున్నారు.
‘ముఖ్యంగా మన దేశంలో ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకూ చేరుతాయి.ఇలాంటి అతి ఉష్ణ పరిస్థితులు కూడా దీనికి కారణమవుతున్నాయి. ఇలాంటివి నివారించాలంటే.. మన వాతావరణానికి తగ్గట్లుగా బ్యాటరీలను తయారుచేయాలి’అని బెంగళూరుకు చెందిన నానో టెక్నాలజీ కంపెనీ లాగ్9 సీఈవో డాక్టర్ అక్షయ్ సింఘాల్ చెప్పారు.
కొన్ని కంపెనీలు చైనా నుంచి అంతగా నాణ్యత లేని బ్యాటరీలను దిగుమతి చేసుకుని వాడుతున్నాయని.. అవి కూడా ప్రమాదాలకు కారణమవుతాయన్నారు. ‘ముఖ్యంగా వీటిల్లోని బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టం మన పరిస్థితులకు తగ్గట్లు లేదు. ఈవీ కంపెనీలు ఇప్పుడు మన వాతావరణ పరిస్థితులు, రహదారులకు అనుగుణంగా సొంత బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టంను తయారుచేసుకోవాలి.. అప్పుడే ఇలాంటి ఘటనలను నివారించగలుగుతాం’అని ఈవీ పరిశ్రమకు సంబంధించిన నిపుణులు పేర్కొంటున్నారు.
మనమేం చేయాలి?
►వాస్తవానికి మిగతా వాహనాలతో పోలిస్తే.. ఈవీలు నిప్పంటుకోవడం అన్నది చాలా అరుదు. అయితే.. మనం కొన్ని జాగ్రత్తలు పాటిస్తే.. ప్రమాదం జరగకుండా చూసుకోవచ్చు.
►ఈవీలను ఎక్కువ గంటలపాటు ఎండలో పార్క్ చేయొద్దు. ఈ వాహనాలు మనకు కొత్త. అందుకే కంపెనీ బుక్‌లెట్‌ను క్షుణ్ణంగా చదవండి. చార్జింగ్‌కు ఉపయోగించే సాకెట్లు వంటివి అప్‌డేటెడ్‌గా ఉండేలా సరిచూసుకోండి. బ్యాటరీ ఎలా పనిచేస్తుందన్న దానిపై ఈవీ కంపెనీలు యాప్‌లు ఇస్తున్నాయి. అందులో మీ బ్యాటరీ పరిస్థితి ఎలా ఉందన్న విషయాన్ని అప్పుడప్పుడు గమనిస్తూ ఉండండి.
►తేమ అన్నది ఇటు బ్యాటరీలకు అటు చార్జర్లకు మంచిది కాదు. కాబట్టి.. తేమ తక్కువగా ఉండే లేదా పొడిగా ఉండే ప్రదేశాల్లో బండిని ఉంచండి.
►బయట నుంచి తిరిగి వచ్చిన వెంటనే.. వాహనాన్ని చార్జ్ చేయవద్దు. ఎందుకంటే.. ఆ సమయంలో బ్యాటరీ వేడిగా ఉంటుంది. అది చల్లబడ్డాక చార్జ్ చేయండి. అది డిటాచబుల్ బ్యాటరీ అయి ఉంటే.. దాన్ని బండి నుంచి తీసి చార్జ్ చేయడం ఉత్తమం.
►కంపెనీ ఇచ్చిన చార్జింగ్ కేబుల్‌ని మాత్రమే వాడాలి. అలాగే వాహనానికి నిర్దేశించిన బ్యాటరీనే వాడండి.. స్థానికంగా తక్కువ ధరకు దొరుకుతుందని.. నాసిరకమైనవి వాడటం వంటివి చేయొద్దు. బ్యాటరీలు బాగా వేడిగా అవుతున్నట్లు అనిపించినా.. లేదా షేపు మారినట్లు.. అంటే ఉబ్బినట్లు కనిపించినా.. లేదా ఇతర సమస్యను గమనించినా.. వాటిని వాడవద్దు.. వెంటనే కంపెనీని సంప్రదించండి.
Comments
Please login to add a commentAdd a comment