దెయ్యం పట్టిందని బాలింతకు చిత్రహింసలు... | Name Of Exorcism Condition Of Woman Is Alarming In Mancherial | Sakshi
Sakshi News home page

దెయ్యం పట్టిందని బాలింతకు భూత వైద్యం

Published Sat, Aug 1 2020 11:01 AM | Last Updated on Sat, Aug 1 2020 12:59 PM

Name Of Exorcism Condition Of Woman Is Alarming In Mancherial - Sakshi

సాక్షి, మంచిర్యాల: జిల్లాలో దారుణం జరిగింది. భూతవైద్యం ఓ మహిళ ప్రాణాల మీదికి తెచ్చింది.‌ వైద్యం పేరుతో భూతవైద్యుడు మహిళకు నరకం చూపాడు. తల వెంట్రుకలు లాగుతూ కొట్టడంతో బాలింత మహిళ అపస్మారక స్థితికి చేరింది. పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. వివరాల్లోకెళ్తే..  మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కుందారంలో భూతవైద్యుడు పచ్చిబాలింత అయిన రజితకు నరకం చూపాడు. 4 నెలల క్రితం పాపకు జన్మనిచ్చిన రజిత అప్పటినుంచి అనారోగ్యంగా ఉండటంతో దయ్యం పట్టిందని కుటుంబ సభ్యులు భూతవైద్యుడిని ఆశ్రయించారు. రజిత మేనమామ భూత వైద్యుడిని తీసుకొని కుందారంలోని రజిత అత్తవారింటికి వెళ్ళి వైద్యం చేయించారు.

అక్కడ దెయ్యం వదిలిందా అంటూ రజిత కుటుంబ సభ్యుల ముందే నరకం చూపాడు. ఏదో చెబుతూ మంచంపై పడేశాడు. భూతవైద్యుడు కొట్టిన దెబ్బలకు చిత్రహింసలకు తాళలేక రజిత అపస్మారక స్థితికి చేరింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. రజితది కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గద్దపాక కాగా, ఏడాది క్రితం కుందారంకు చెందిన మల్లేశంతో ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లయిన కొద్ది రోజులకు అనారోగ్యం పాలు కావడంతో దెయ్యం పట్టిందని భూతవైద్యుడుతో వైద్యం చేయించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా, ఇంకా మూఢనమ్మకాలతో భూత వైద్యులను ఆశ్రయించి ప్రాణాలమీదికి తెచ్చుకోవడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. భూత వైద్యుల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement