సాక్షి, మంచిర్యాల: ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి ఇంటికి వచ్చినట్లే.. అయితే మానవుడు ఎంత అభివృద్ధి చెందినా.. తల్లిగర్భంలో ఉన్నది ఆడశిశువు అని తెలిస్తే బయట పడకుండానే హతమారుస్తున్నారు. మరికొందరు ఆడపిల్ల పుడితే చెత్తకుప్పల్లో, మురుగునీటి కాలువల్లో వదిలేసి వెళ్తున్నారు. ఆడపిల్ల పుట్టిందని భార్యలను పుట్టింట్లోనే వదిలేసిన భర్తలూ ఉన్నారు. ఈ నేపథ్యంలో బాలికల ఉన్నతి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నాయి. హక్కుల సాధన, రక్షణ కోసం అనేక చట్టాలు అమలు చేస్తున్నాయి. దీంతో బాలికలు ఉన్నత చదువుల్లోనే కాదు.. ఉద్యోగాల్లోనూ రాణిస్తున్నారు. భారత ప్రభుత్వం ‘నేషనల్ గర్ల్స్ డెవలప్‌మెంట్ మిషన్’ పేరుతో 2008 నుంచి ప్రతిసంవత్సరం జనవరి 24న బాలికా దినోత్సవం నిర్వహిస్తోంది. నేడు జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా కథనం...
సంక్షేమ పథకాలు
సుకన్య సమృద్ధి యోజన
సమాజంలో ఆడపిల్లలకు సమాన అవకాశాలు, ఉద్యోగాలు.. ఉన్నతమైన చదువు అందించాలని.. భ్రూణహత్యలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ‘‘బేటీ బచావో.. బేటీ పడావో’ కార్యక్రమాల్లో భాగంగా సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా అప్పడే పుట్టిన శిశువు నుంచి పదేళ్ల వయసున్న ఆడపిల్ల తల్లితండ్రులు బాలిక పేరుపై తపాలా శాఖలో రూ.250 చెల్లించి ఖాతా తెరవొచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు జమ చేయవచ్చు.
ఖాతా ప్రారంభం నుంచి 14 ఏళ్లు, గరిష్టంగా 21 ఏళ్ల వరకు ఖాతా నిర్వహించవచ్చు. బాలికకు 18 ఏళ్లు వచ్చాక చదువు కోసమైతే సగం డబ్బులు తీసుకోవచ్చు. చేసిన పొదుపుపై వడ్డీ ఉదాహరణ నెలకు రూ.వెయ్యి చొప్పున 14 ఏళ్లు జమ చేస్తే 21 ఏళ్ల తర్వాత రూ.6,07,128 వస్తాయి. 21 ఏళ్ల తర్వాత బాలిక వివాహ ధ్రువీకరణ పత్రాన్ని తపాలా కార్యాలయంలో అందజేస్తే పూర్తి మొత్తం అందజేస్తారు. ఇద్దరు బాలికలున్న వారు రెండు ఖాతాల్లో విడివిడిగా సొమ్ము జమ చేయాలి. ముగ్గురు కుమార్తెలుంటే మరో ఖాతా తెరిచేందుకు వీలు లేదు.
చదవండి: Saroornagar Lake: మారని కథ.. నెరవేరని సీఎం కేసీఆర్ హామీ!
బేటీబచావో.. బేటీపడావో..
బాలికల సంరక్షణకు, బాలికల ఉన్నతికి 2015 జనవరి 22న హర్యానాలోని పానిపట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక నుంచి బాలిక పుడితే మనం పండగ జరుపుకోవాలి. కూతురు పుట్టగానే ఐదు మొక్కలు నాటి సంబరం చేసుకోవాలి, కూతురు పుట్టినందుకు మనం గర్వపడాలని ప్రసంగించారు. ఈ పథకాన్ని కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖలు సమన్వయంతో నిర్వహిస్తాయి.
బాలికా సమృద్ధి యోజన
1997 నుంచి ఈ పథకం అమలులో ఉంది. పాఠశాలల్లో ఆడపిల్లల సంఖ్య పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. దీని కింద ఆడపిల్ల పుట్టిన తర్వాత అమ్మకు రూ.500 నగదు గిప్టుగా ఇస్తారు. ఆ తర్వాత బాలిక పాఠశాలకు వెళ్లినప్పటి నుంచి ప్రతి సంవత్సరం స్కాలర్‌షిప్ అందిస్తారు. ఒకటి నుంచి మూడో తరగతి వరకు సంవత్సరానికి రూ.300, నాలుగో తరగతికి రూ.400, ఐదోతరగతికి రూ.500, ఆరోతరగతికి రూ.600, ఏడోతరగతికి రూ.700, ఎనిమిదో తరగతికి రూ.800, తొమ్మిదో తరగతిలో రూ.1000 స్కాలర్‌షిప్ అందజేస్తారు.
కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్
ఆడపిల్లల భ్రూణహత్యల నివారణకు, బాలికల సంరక్షణకు, బాలికల ఉన్నతికి రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కిట్ కింద ఆడపిల్ల పుడితే రూ.13 వేలు అందిస్తోంది. పేదింట్లో ఆడపిల్ల వివాహం భారం కాకూడదని కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద రూ.లక్షా నూటపదహార్లు అందజేస్తోంది. స్వయం సహాయక సంఘాల్లో సభ్యులై ఉండి ప్రీమియం చెల్లించిన వారి పిల్లలు 9, 10, ఇంటర్, ఐఐటీ చదువుతుంటే ఏడాదికి రూ.1200 చొప్పున ఇస్తారు.
బాలికా సంరక్షణ యోజన
నిరుపేద బాలికల్లో భరోసా నింపేందుకు 2005లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బాలికా సంరక్షణ పథకం(జీసీపీఎస్) ప్రారంభించారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి ఒకే ఆడపిల్ల జన్మిస్తే రూ.లక్ష, ఇద్దరు ఆడపిల్లలు పుట్టి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే ఒక్కో బాలికకు రూ.30వేల చొప్పున ఈ మొత్తాన్ని 20 ఏళ్లు నిండిన తర్వాత అందజేస్తారు.
ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఫర్ గర్ల్స్
దేశంలో బాలికల విద్య, అభ్యున్నతికి ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్(అఐఇఖీఉ) ప్రగతి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా దేశంలోని 5 వేల మంది విద్యార్థినులకు సంవత్సరానికి రూ.50వేల ఆర్థిక సాయం అందజేస్తోంది.
హక్కులు.. చట్టాలు
బాలల హక్కులు
ప్రపంచ దేశాలన్నీ కూటమిగా ఏర్పడి సమాజంలో బాలలకూ హక్కులు ఉండాలని నిర్ణయించాయి. అందులో కొన్ని ముఖ్యమైన హక్కులను ఐక్యరాజ్య సమితి ప్రకటించింది.
రక్షణ హక్కు
బాలికలు తల్లిదండ్రుల నుంచి రక్షణ పొందవచ్చు. కుల, మత, లింగ వివక్ష, నిర్లక్ష్యం, దౌర్జన్యం, హింసాత్మక చర్యల నుంచి కాపాడుకోవడం, అంటువ్యాధులు, కరువు వరదలు, తదితర ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ పొందవచ్చు.
జీవించే హక్కు
శిశువుగా తల్లిగర్భంలో ఉన్న దశ నుంచే సమగ్రంగా ఎదిగే వరకు ఉపకరించే హక్కు. ఈ హక్కు బాలికల ఎదుగుదలకు కావాల్సిన ప్రాథమిక అవసరాలను పొందేవరకు ఉపయోగపడుతుంది. స్వేచ్ఛగా జీవించటానికి, ఆటంకాలు లేకుండా ఎదగడానికి బాలికలకు తోడ్పాడుతుంది.
అభివృద్ధి హక్కు
బాలలు స్వయం సమృద్ధిని సాధించటానికి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలను ఈ హక్కు ద్వారా వినియోగించుకోవచ్చు.
భాగస్వామ్య హక్కు
బాలలకు సంబంధించిన అన్ని నిర్ణయాలు, కార్యక్రమాలు, సమావేశాల్లో పాల్గొనేలా ఈ హక్కు ఉపయోగపడుతుంది. భవిష్యత్‌లో వారికి తగినట్లుగా ప్రణాళిక రూపొందించుకుని తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులతో అభిప్రాయాలను పంచుకునే వీలుంటుంది.
బాలికల సంరక్షణకు చట్టాలు
► 18 ఏళ్లలోపు బాలికలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు జరిగితే ఫోక్సో చట్టం కిందికి వస్తాయి. 2016 నుంచి ఈ చట్టాన్ని అమలు చేస్తున్నారు.
► 2006 నుంచి బాల్య వివాహాల నిరోధక చట్టం అమల్లోకి వచ్చింది.
► 2014 నుంచి బాలల అక్రమ రవాణా నిరోధక చట్టం అమలవుతోంది.
► దాడులకు గురైన బాలికలకు వన్‌స్టాప్ సెంటర్ (సఖి) అండగా నిలుస్తోంది.
► సమాజంలో జరుగుతున్న దాడులు, బాలికలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.
► విద్యార్థులు మహిళలను వేధింపులకు గురిచేసినట్లు రుజువైతే విద్యాలయాల నుంచి తా త్కాలికంగా లేదా శాశ్వతంగా తొలగించవచ్చు. మరే విద్యాలయంలో ప్రవేశం పొందకుండా చేయవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత లేకుండా చేయడం, పాస్‌పోర్టు జారీ చేయకుండా చర్యలు తీసుకోవచ్చు. ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్‌కు పాల్పడిన వారి ఉపకారవేతనాలు నిలిపివేయడం, పోటీ పరీక్షలకు హాజరుకాకుండా చేయడం, ఫలితాల నిలిపివేత, రూ.2.50 లక్షల వరకు జరిమానా విధించవచ్చు.
బాలికలను లైంగికంగా వేధిస్తే..
అత్యాచార నేరాల నుంచి పిల్లలకు రక్షణ కల్పించే చట్టానికి 2012లో అమోదంలభించింది. బాలిక ఆమోదం తెలిపినా, తెలపక పోయినా 18 ఏళ్లలోపు వారిపై ఏ లైంగిక దాడిచేస్తే ఏడేళ్లకు తగ్గకుండా జైలు శిక్ష, జరిమానా, లేద జీవిత ఖైదు కూడా విధించవచ్చు. పిల్లలపై అత్యాచారం లేదా వేధింపులు గురిచేస్తే 3 నుంచి 5 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా, రెండోసారి అదే నేరంపై దొరికితే ఏడేళ్ల జైలు శిక్ష జరిమాన విధించే అవకాశం ఉంది.
అమ్మా... నన్ను చంపొద్దు!
మంచిర్యాలక్రైం/బోథ్: ఆడపిల్ల అని తెలిస్తే చాలు భ్రూణహత్యలు చేస్తున్నారు.. కన్న తల్లే శిరచ్ఛేదనం చేస్తున్న సంఘటనలు చాలానే ఉన్నాయి. పుట్టబోయేది కూడా ఓ మహిళేనని తల్లులు గుర్తెరగడం లేదు. ఫలితంగా జనగణన లెక్కలోనూ స్త్రీ, పురుష నిష్పత్తిలో తేడాలు కనిపిస్తున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి వెయ్యి మందికి 940 మంది స్త్రీలు మాత్రమే ఉన్నారు. 2021 జనాభా ప్రకారం ప్రతి వెయ్యి మంది పురుషులకు 988 మంది మహిళలు ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం వెయ్యి మంది పురుషులకు 1001 మంది మహిళలు ఉన్నారు.
స్కానింగ్ సెంటర్ల పాపం..
తన గర్భంలో పెరుగుతున్నది ఆడా, మగా తెలుసుకునేందుకు స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులపై గర్భిణులు ఒత్తిడి తెస్తున్నారు. నిర్వాహకులకు డబ్బు ఆశ చూపించి గర్భంలో పెరిగే శిశువు గురించి తెలుసుకుంటున్నారు. ఒకవేళ తన గర్భంలో ఆడపిల్ల ఉంటే తన భర్త లేదా అత్తామామల ఒత్తిడి వల్లనో పసిగుడ్డు ప్రాణం తీస్తున్నారు.
శిక్షలు ఇలా...
భ్రూణ హత్యలను నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రీనాటల్ డయాగ్నోసిస్ టెక్నిక్స్(రెగ్యులేషన్ ఆండ్ ప్రివెన్షన్ ఆప్ మిస్ యూజ్ యాక్ట్) తీసుకొచ్చింది. దీని ప్రకారం లింగ నిర్దారణ పరీక్షలు చేయడం నేరమైనప్పటికీ చాలామంది రేడియాలజిస్టులు నిబంధనలు తుంగలో తొక్కి తమ దందా సాగిస్తున్నారు. లింగ నిర్ధారణ చేసే స్కానింగ్ సెంటర్లపై చట్టాలు కఠినంగా ఉన్నా అమలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఏ స్కానింగ్ సెంటర్ అయినా మొదటి సారి లింగనిర్ధారణ చేస్తే రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారు. రెండోసారి తప్పు చేస్తే జరిమానా విధించడంతోపాటు ఆరు నెలలు జైలు లేదా ఏడాది జైలు శిక్షతో పాటు మెడికల్ డిగ్రీని రద్దు చేస్తారు. జిల్లా వైద్యశాఖ అధికారుల దాడులు చేసిన సందర్భాలు లేకపోవడం గమనార్హం.
మగ పిల్లలకంటే తక్కువేం కాదు
బజార్‌హత్నూర్ గ్రామానికి చెందిన జువుల కళావతి, భూమన్న దంపతులకు ఇద్దరూ కూతుళ్లు సంతానం. అయినా వారు అధైర్య పడలేదు. ఆడపిల్లలను క్రమశిక్షణతో ఉన్నతంగా తీర్చిదిద్దాలనుకున్నారు. ఒకరిని డాక్టర్, ఒకరిని ఇంజినీర్ చేయాలని పిల్లలు పుట్టినప్పుడే నిర్ణయించుకున్నారు. తల్లిదండ్రుల కలలను కూతుళ్లు నిజం చేస్తున్నారు. భూమన్న మండలంలోని దేగామ జిల్లా పరిషత్ సెకండరి పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. పెద్ద కూతురు నిహారికను 6వ తరగతి వరకు మండల కేంద్రంలోని శ్రీసరస్వతి శిశుమందిర్‌లో, 10వ తరగతి వరకు కాగజ్‌నగర్ నవోదయ పాఠశాలలో, ఇంటర్ హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ కళాశాలలో చదివించాడు. ప్రస్తుతం నిహారిక ఆదిలాబాద్ రిమ్స్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతోంది. చిన్న కూతురు నిపుణ 6వ తరగతి వరకు శ్రీసరస్వతి శిశుమందిర్‌లో, 10వ తరగతి వరకు ఆదర్శ పాఠశాలలో, ఇంటర్ హైదరాబాద్‌లో చదువుకుంది. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతోంది.
అవగాహన కల్పిస్తున్నాం..
బాల్య వివాహాల నియంత్రణ కు ఐసీపీఎస్ ద్వారా అవగా హన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఆడపిల్లలకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులకు సూచిస్తున్నాం. మారుమూల ప్రాంతాల్లో ఈ అవగాహన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. గ్రామపంచాయతీల్లో 12 మంది సభ్యులతో కమిటీలను కూడా వేశాం. బాల్య వివాహాలు జరుగుతున్నట్లు సమాచారం కౌన్సెలింగ్ నిర్వహించి నిలిపివేస్తాం.
– మిల్కా, సంక్షేమ అధికారి, ఆదిలాబాద్
మేం ముగ్గురం ఆడపిల్లలం..
కుంటాల: మాది కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఆకునూర్ గ్రామం. అమ్మానాన్న రాణి–తిరుపతి. మేం ముగ్గురం ఆడపిల్ల లం. నాన్న వ్యవసాయం చేస్తూ మమ్మల్ని ఉన్నత చదువులు చదివించారు. నేను కుంటాల ఎస్సైగా పని చేస్తున్నా. పెద్ద చెల్లే స్నేహాంజలి బిటెక్ పూర్తి చేసింది. చిన్న చెల్లె మహిజ డిగ్రీ పూర్తి చేసింది. ఆడపిల్లలపై వివక్షత చూపు చూడకుండా నా వంతుగా కృషి చేస్తున్నా.
– పోగుల స్రవంతి, ఎస్సై, కుంటాల
ఒక్కరే ముద్దు
ఆదిలాబాద్‌టౌన్: ఒక్కరే ముద్దు.. ఇద్దరు వద్దు అనే నినాదంతో మేము మేమిద్దం ఒక్కరే చాలన్న నిర్ణయానికి వచ్చాం. మా పాప పేరు అవంతిక. ప్రస్తుతం 9వ తరగతి చదువుతోంది. పాపను ఉన్నత చదువులు చదివించి ప్రయోజకురాలిని చేసే దిశగా ముందుకు సాగుతున్నాం. అబ్బాయి అయినా, అమ్మాయి అయినా ఒక్కరు చాలు. మా కూతురే మాకు ప్రాణం.
– కూతురుతో గండ్రత్ అంకిత – సంతోష్ దంపతులు
కూతుర్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలని..
తాంసి: మాకు 2004 సంవత్సరంలో మొదటి సంతానంగా కూతురి జన్మించింది. ఒక్క కూతురే చాలనుకోన్నారు. కూ తురినే ఉన్నతంగా చదివించి సమాజానికి ఆదర్శంగా నిలుపాలని నిర్ణయించుకున్నాం. కూతురిని తన అభిరుచులకు తగ్గట్టు చది విస్తున్నారు. ప్రస్తుతం పదో తరగతి చదువుతోంది. ఆడపిల్ల అంటే మగ పిల్లల కంటే ఎక్కువ అనే విధంగా మా కూతురిని ఆదర్శంగా నిలుపుతాం.
– రామగిరి మాధవి, రమేష్ దంపతులు, తాంసి
వివక్ష రూపుమాపాలి
కాగజ్‌నగర్: తల్లి గర్భం నుంచే ఆడపిల్లకు వివక్ష మొదలవుతుంది. ఈ కారణంగానే భ్రూణ హత్యలకు దారితీస్తుంది. వివక్ష అనేది వారి కుటుంబాల నుండే మొదలవుతోంది. మనమంతా దీనిని రూపుమాపాలి. తల్లిదండ్రులు సైతం బాలురకు ఇచ్చే స్వేచ్ఛ ఆడపిల్లలకు ఇవ్వడం లేదు. సమాజంలో ఆడపిల్లలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు.
– కె శ్రావణి, బీజెడ్‌సీ, ద్వితీయ సంవత్సరం, కాగజ్‌నగర్
ఎవరైనా ఒక్కటే..
నేరడిగొండ: మేము కూతురైనా కొడుకైనా ఒక సంతానం చాలని 2011లోనే నిర్ణయించుకున్నాం. మాకు మొదటి సంతానంగా పాప పుట్టింది. తర్వాత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్నాం. కూతురుకు మంచి భవిష్యత్తు అందించాలని నిర్ణయించుకున్నాం. గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ.. పాప భవిష్యత్ కోసం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్నాం.
చిన్నారి స్పందన రెడ్డితో కుంట కిరణ్‌కుమార్ రెడ్డి దంపతులు
Comments
Please login to add a commentAdd a comment