సాక్షి, హైదరాబాద్: వేప చెట్లు మంచు ముత్యాలతో నిండినట్టు తెల్లటి పూతతో కళకళలాడుతున్నాయి. చైత్రమాసం ముంగిట ఇలా ఇవి కొత్త శోభను సంతరించుకోవటం సహజం. కానీ, ఈసారి దీనికో ప్రత్యేకత ఉంది. సరిగ్గా 4 నెలల కిందట వేప పరి స్థితి వేరు. ఉంటుందా లేదా అన్నంత ప్రమాదంలో పడిందా వృక్ష జాతి. కానీ.. నిలువెల్లా ఔషధ గుణాలను ఇముడ్చుకున్న వేప భయంకరమైన శిలీంద్ర దాడిని ఎదుర్కొంది. చిగుళ్లు, ఆకులు, కొమ్మలు.. క్రమంగా వాడి, ఎండిపోతూ చెట్టు నిలువెల్లా మాడిపోయే పరిస్థితిని అధిగమినించింది. చైత్రం ముంగిట ఆ చెట్టుకు మరో‘ఉగాది’ప్రారంభమైంది. కొత్త సంవ త్సరం వేళ షడ్రుచుల ఉగాది పచ్చడిలో తన ప్రత్యేకతను నిలుపుకొనేందుకు సిద్ధమైంది.
పూతతో పునరుజ్జీవ కళ
ఫోమోస్సిస్ అజాడిరక్టేగా పిలిచే డై–బ్యాక్ వ్యాధి వేపను ప్రభావితం చేసింది. తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో వేపకు సోకిన ఈ వ్యాధి తెలంగాణలో గతేడాది ఆగస్టులో ప్రవేశించింది. తొలుత గద్వాల ప్రాంతంలో రిపోర్టు అయింది. ఆ తర్వాత రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు పాకి నవంబర్ చివరి నాటికి ఉధృతమైంది. గాలిద్వారా ప్రబలిన ఈ శిలీంద్రం దాదాపు అన్ని వేపచెట్లకు సోకింది. కొమ్మల చివర్లలో ప్రారంభమై క్రమంగా చెట్టు అన్ని ప్రాంతాలకు పాకుతూ ఆకులు మాడిపోయేలా చేసింది.
శాస్త్రవేత్తలు దీనిని అతితీవ్ర వ్యాధిగా గుర్తించారు. దీంతో రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రభుత్వం దృష్టికి తెచ్చి, వెంటనే దాని నివారణకు పిచికారీ చేయాల్సిన మందులను సూచించింది. కానీ స్వతహాగా కీటక నాశని లక్షణాలున్న వేప.. జనవరి చివరి నాటికి శిలీంద్ర ప్రభావా న్ని తగ్గించుకోగలిగింది. వాతావరణంలో వచ్చి న మార్పులతో శిలీంద్రం క్రమంగా బలహీనపడింది. దీంతో పుంజుకున్న వేప మరొకసారి నిండుగా పూత పూసి పునరుజ్జీవ కళను సంతరించుకుంది.
చనిపోయిన చెట్లు ఒక శాతంలోపే..
డై–బ్యాక్‌కు గురైన వేప చెట్లు క్రమంగా పుంజుకుని పూర్వ వైభవానికి చేరుకుంటున్నాయని, ఇప్పట్లో వాటికి మళ్లీ ప్రమాదం ఉండకపోవచ్చని అగ్రి వర్సిటీ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. డై–బ్యాక్‌కు గురైన చెట్లలో దాదాపు ఒక శాతం చెట్లు డిక్‌లైన్ (క్షీణత) బారినపడ్డట్టు గుర్తించారు. వాటిల్లో దాదాపు 0.7 శాతం చెట్లు ఈపాటికే చనిపోయాయని, మిగతావి కూడా కోలుకునే పరిస్థితి ఉండకపోవచ్చని వర్సిటీ పరిశోధన విభాగం సంచాలకులు జగదీశ్వర్ ‘సాక్షి’తో చెప్పారు. డై–బ్యాక్‌కు గురై కోలుకునే చెట్లకు కావాల్సిన పోషకాలు సకాలంలో అందాల్సి ఉంటుంది. కానీ చెట్ల చుట్టూ నీటిని పీల్చుకునేందుకు అవాంతరం కలిగించేలా కాంక్రీట్ చేసి ఉండటం, మురికినీరు నిరంతరం చుట్టూ నిలిచి ఉండటం లాంటివి చెట్లు చనిపోవటానికి ఎక్కువ కారణమవుతున్నాయని గుర్తించినట్టు ఆయన పేర్కొన్నారు.
పరీక్షల్లో కానరాని శిలీంద్రం..
వేప డై–బ్యాక్‌కు గురైన సమయంలో చాలా ప్రాంతాల నుంచి చెట్ల నమూనాలు సేకరించి వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని ల్యాబ్‌లో కల్చర్ టెస్టులు నిర్వహించారు ఇందులో చాలా రకాల శిలీంద్రాలు గుర్తించా రు. కానీ నాలుగైదు రకాలు ఎక్కువగా ఉన్న ట్టు తేలింది. ఇప్పుడు శిలీంద్రాన్ని జయించిన చెట్ల నుంచి మళ్లీ నమూనాలు సేకరించి వారం కింద మళ్లీ పరీక్షించారు. ఈసారి వాటిపై శిలీంద్రాల అవశేషాలు కనిపించలేదని పేర్కొన్నారు.
పూత పూర్తిగా సురక్షితమే
శిలీంద్ర ప్రభావం తీవ్రంగా ఉన్న సమయంలో వేపపై పిచికారీ చేయాల్సిన రసాయనాలను మేం సూచించాం. కానీ ఇప్పుడు వేప పూర్తిగా కోలుకుంది. దాని పూత కూడా పూర్తిగా సురక్షితమే. ఉగాది పచ్చడిలో నిరభ్యంతరంగా వినియోగించొచ్చు. ఈ సమయంలో వేపచెట్లపై పురుగుమందుల పిచికారీ చేయకూడదు. అది పర్యావరణం, ఇతర జంతువులపై ప్రభావం చూపుతుంది.
– జగదీశ్వర్, అగ్రి వర్సిటీ పరిశోధన విభాగం సంచాలకులు
Comments
Please login to add a commentAdd a comment