వర్క్‌షాప్‌లో ఫొటో ప్రదర్శనను తిలకిస్తున్న మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు
సాక్షి, హైదరాబాద్: దేశంలోని మరే నగరంలోనైనా హైదరాబాద్ స్థాయిలో మెరుగైన మౌలిక సదుపాయాలు, వసతులు ఉన్నాయో చెప్పాలని ఇతర రాష్ట్రాల ప్రతినిధులకు పరిశ్రమలు, ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ఓవైపు హైదరాబాద్‌కు ‘ట్రీ సిటీ’గా ఐక్యరాజ్యసమితి నుంచి గుర్తింపు వచ్చిందని.. మరోవైపు సులభతర వాణిజ్య విధానంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని చెప్పారు. ఐదేళ్లలోనే గ్రీన్ కవర్‌ను 24 శాతం నుంచి 31.7 శాతానికి పెంచగలిగామని తెలిపారు. కచ్చితమైన లక్ష్యాలతో పాటు అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ రెండింటినీ సమతూకం చేసుకుని తెలంగాణ విజయం సాధించగా లేనిది ఇతర రాష్ట్రాలు ఎందుకు చేయలేకపోతున్నాయని ప్రశ్నించారు.
శుక్రవారం హైదరాబాద్‌లో ఆధునిక, సాంకేతిక పద్ధతుల్లో అటవీ శాఖ నిర్వహణ, కంపా నిధులు సద్వినియోగం, అటవీ పునరుద్ధరణ పనులపై జాతీయ వర్క్ షాప్‌ను రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, కేంద్ర అటవీ శాఖ డైరెక్టర్ జనరల్ సీపీ గోయల్‌లతో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. కేటీఆర్ మాట్లాడుతూ.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పరిశ్రమలు, అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని అనుమతుల విషయాన్ని కేంద్రం, అటవీ, పర్యావరణ శాఖలు సులభతరం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల సమస్యలు, అభివృద్ధి అంశాలను పక్కనబెట్టి గుడ్డిగా ఒక్క చెట్టునూ కొట్టేయనివ్వమనే పంథాలో అటవీ శాఖ వ్యవహరించడం సరికాదన్నారు. ఈ ఆలోచనా విధానంలో మార్పు రావాలని కోరుకుంటున్నామని చెప్పారు.
గ్రీన్ ర్యాంకింగ్స్ ఇవ్వండి
ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల వంద చెట్లను ట్రాన్స్‌లొకేషన్ లేదా తొలగింపు గురించే ఆలోచిస్తున్నారని.. సిగ్నల్ వద్ద వాహనాల నిలిపివేత వల్ల ఎంతశాతం కర్బన ఉద్గారాలు వెలువడి పర్యావరణానికి నష్టం జరుగుతుందనేది చూడాలని కేటీఆర్ చెప్పారు. సరళతర వాణిజ్య విధానం తరహాలో గ్రీన్ ర్యాంకింగ్స్ తీసుకొచ్చి రాష్ట్రాల మధ్య పోటీ పెంచాలని సూచించారు. జంగల్ బచావో–జంగల్ బడావో నినాదం అమలు చేస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణ అని, హరిత నిధి ఏర్పాటు సీఎం కేసీఆర్ వినూత్న ఆలోచన అని ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. పచ్చదనం పెంపులో రాష్ట్రాలకు ర్యాంకులు ఇవ్వాలన్న కేటీఆర్ సూచన బాగుందని.. కేటీఆర్ సూచనలపై కేంద్రంతో చర్చిస్తామని అటవీ శాఖ డీజీ సీపీ గోయల్ తెలిపారు. కార్యక్రమంలో సీఎస్ సోమేశ్ కుమార్, నేషనల్ కాంపా సీఈఓ సుభాష్ చంద్ర, అటవీ శాఖ స్పెషల్ సీఎస్ శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment