సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘ఆరోగ్య మహిళ‘ పేరిట సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం రాష్ట్ర మహిళలకు బహుమతిగా ఈ నెల 8న ప్రారంభిస్తున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
శనివారం బీఆర్‌కేఆర్ భవన్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలసి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ మహిళలు ప్రధానంగా ఎదుర్కొనే 8 రకాల ఆరోగ్య సమస్యలకు వైద్యం అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రతి మహిళా ఆరోగ్యంతో ఉండాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు తెలిపారు.
దశలవారీగా విస్తరణ..
మొదటి దశలో వంద ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహించి ఆపై 1,200 కేంద్రాలకు విస్తరించాలని యోచిస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించి ప్రత్యేక యాప్ ద్వారా పర్యవేక్షిస్తామని వివరించారు. మహిళకు పూర్తిగా నయం అయ్యే దాకా వైద్య సేవలు కొనసాగుతాయన్నారు. రెఫరల్ ఆసుపత్రుల్లో మహిళలు సేవలు పొందేందుకు వీలుగా ప్రత్యేక హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మార్చి 8న ప్రారంభించే ఈ కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొనాలని, ఇందుకు జిల్లా కలెక్టర్లు, డీఎంహెచ్‌వోలు చొరవ తీసుకోవాలన్నారు.
సీపీఆర్‌పై విస్తృత ప్రచారం
గుండెపోట్లు, కార్డియాక్ అరెస్ట్‌లకు గురైన వారిని సత్వరమే కాపాడటంలో దోహదపడే ప్రాథమిక చికిత్స కార్డియోపల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్)పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని మంత్రి హరీశ్‌రావు అధికారులకు సూచించారు. కరోనా తర్వాత సడెన్ కార్డియాక్ అరెస్ట్ కేసులు పెరిగినట్లు వైద్య నిపుణులు, పలు అధ్యయనాలు చెబుతున్నాయన్నారు.
ఇలా అరెస్ట్‌అయిన ప్రతి 10 మందిలో ఒకరు మాత్రమే బతుకుతున్నారని, అయితే సీపీఆర్ చేస్తే కనీసం ఐదుగురిని బతికించవచ్చన్నారు. కార్డియాక్ అరెస్ట్‌కు గురయ్యేవారికి చికిత్సలో భాగంగా ఉపయోగించే ఆటోమేటెడ్ ఎక్స్‌టర్నల్ డీఫిబ్రిలేటర్ (ఏఈడీ)ల కోసం మొదటి దశలో రూ.18 కోట్లతో 1,200 పరికరాలు కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. వాటిని పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు, బస్తీ దవాఖానాల్లో అందుబాటులోకి తెస్తామన్నారు.
‘కంటివెలుగు’ అందరికీ చేరాలి
కంటివెలుగు పథకంలో భాగంగా అందిస్తున్న కంటి పరీక్షలు అందరికీ చేరాలని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఇప్పటివరకు 63.82 లక్షల మందికి పరీక్షలు నిర్వహించామన్నారు. సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కుటుంబ సంక్షేమ కమిషనర్ శ్వేత మహంతి, సీఎం ఓఎస్డీ గంగాధర్ పాల్గొన్నారు.
మహిళలకు నిర్వహించే 8 పరీక్షలివే..
1.మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, ఇతర సాధారణ పరీక్షలు.
2. ఓరల్, సర్వ్యకిల్, రొమ్ము కేన్సర్ల స్క్రీనింగ్.
3. థైరాయిడ్ పరీక్ష, సూక్ష్మ పోషక లోపాల గుర్తింపు, అయోడిన్ సమస్య, ఫోలిక్ యాసిడ్, ఐరన్ లోపం, విటమిన్ బీ12, విటమిన్ డీ పరీక్షలు, చికిత్స, మందులు.
4.మూత్రకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు,పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ వ్యాధుల పరీక్షలు.
5.మెనోపాజ్ దశకు సంబంధించిన పరీక్షలు, అవసరమైన వారికి హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ, కౌన్సెలింగ్.
6. నెలసరి సమస్యలపై పరీక్షలు, సంతాన సమస్యలపై ప్రత్యేక పరీక్షలు, అవసరమైనవారికి అ్రల్టాసౌండ్ టెస్టులు.
7.సెక్స్ సంబంధిత అంటువ్యాధుల పరీక్షలు, అవగాహన.
8.బరువు నియంత్రణ, యోగా, వ్యాయామంపై అవగాహన
Comments
Please login to add a commentAdd a comment