బీజేపీ శాపం.. కాంగ్రెస్‌ పాపం..కేసీఆర్‌ దీపం: హరీశ్‌ | Harish Rao is comment on Kiran and Chandrababu | Sakshi
Sakshi News home page

బీజేపీ శాపం.. కాంగ్రెస్‌ పాపం..కేసీఆర్‌ దీపం: హరీశ్‌

Published Sun, Jul 30 2023 2:07 AM | Last Updated on Sun, Jul 30 2023 10:39 AM

Harish Rao is comment on Kiran and Chandrababu - Sakshi

గజ్వేల్‌లో ఏసీపీ కార్యాలయ భవనానికి హోంమంత్రి మహమూద్‌అలీతో కలిసి శంకుస్థాపన చేస్తున్న హరీశ్‌రావు 

గజ్వేల్‌: ’’తెలంగాణకు రూపాయి ఇయ్య.. ఏం చేసుకుంటావో చేసుకో అన్న కిరణ్‌కుమార్‌రెడ్డి ఇయ్యాల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి గురువు, ఉచిత కరెంట్‌ వద్దన్న చంద్రబాబు రేవంత్‌రెడ్డికి గురువు. దీపం లాంటి కేసీఆర్‌ ఉండగా.. తెలంగాణ ద్రోహుల చుట్టూ తిరుగుతున్న శాపం లాంటి బీజేపీ, పాపం లాంటి కాంగ్రెస్‌ మనకెందుకు..?’’ అని మంత్రి టి.హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలో హోంమంత్రి మహ మూద్‌ అలీతో కలిసి పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో హరీశ్‌రావు మాట్లాడుతూ.. మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతాంగం ఉసురుపో­సుకున్న బీజేపీ, మూడు గంటలే కరెంటు చాలంటున్న కాంగ్రెస్‌ను ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయన్నారు. అసెంబ్లీలో తెలంగాణకు నిధులివ్వరా? అని అప్పట్లో తాను ప్రశ్నిస్తే ఒక్క రూపాయి ఇయ్య...ఏం చేస్తారో చేసుకోండి అన్న కిరణ్‌కుమార్‌రెడ్డిని కిషన్‌రెడ్డి తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సోయి మరిచి ముఖ్య అతిథిగా ఆహ్వానించారని మండిపడ్డారు.

కిరణ్, బాబు కాళ్ల వద్ద ఆత్మగౌరవాన్ని తాకట్టుపెడతారా?
తెలంగాణను రాచి రంపాన పెట్టి, ఈ ప్రాంతానికి కరెంట్, నీళ్లు ఇయ్యకపోగా.. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు నేడు రేవంత్‌రెడ్డికి గురువు అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ ద్రోహులుగా ముద్రపడిన కిరణ్, చంద్రబాబు కాళ్ల దగ్గర ఈ ప్రాంత ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతారా..? ఇది సిగ్గుచేటు అంటూ వ్యా ఖ్యానించారు.

చంద్రబాటు ఇటీవల తెలంగాణపై ప్రేమ చూపినట్లు మాట్లాడు తున్నారని, అదీ ఏపీ సీఎం జగన్‌పై కోపంతో మాత్రమేనని, నిజంగా ఆయనకు తెలంగాణపై ప్రేమ లేదని, ముమ్మాటికీ ఆయన ఈ ప్రాంతానికి  ద్రోహి అని పునరుద్ఘాటించారు. కార్యక్రమాల్లో కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్, ఎమ్మెల్సీ డాక్టర్‌ యాదవరెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎఫ్‌డీసీ) చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement