అసెంబ్లీలో చర్చ పెట్టి తీర్మానాలు చేయడమంటే బ్లాక్ మెయిల్ చేయడమే
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయి
రాజీనామా చేయాల్సింది నేను కాదు.. రేవంత్ రెడ్డి చేయాలి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: గతంలో కేసీఆర్ ఎలాగైతే వ్యవహరించారో, అదే తరహాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. నాటి సీఎం కేసీఆర్ బాటలోనే రేవంత్ నడుస్తుండటం.. తెలంగాణ ప్రజల దురదృష్టమన్నారు. గతంలో తమ ప్రభుత్వ అసమర్థత కారణంగా కేంద్రంపై బీఆర్‌ఎస్ బురదజల్లిన విధంగానే నేడు కాంగ్రెస్ కూడా డ్రామాలు ఆడుతోందని ధ్వజమెత్తారు.
బుధవారం ఢిల్లీలోని అధికారిక నివాసంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో చర్చ పెట్టి తీర్మానాలు చేయడమంటే బ్లాక్‌మెయిల్ చేయడమేనని అన్నారు. ఢిల్లీలో దీక్ష చేద్దాం.. ఆమరణ దీక్షలు చేద్దామనడంలోనే వాళ్ల ఆలోచన స్పష్టమైందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక సహాయం చేయాలని గతంలో కోరిన బీఆర్‌ఎస్, కాంగ్రెస్.. నేడు అబద్ధాలు ప్రచారం చేస్తున్నా యని మండిపడ్డారు.
గత 8 నెలల్లో రేవంత్‌రెడ్డి ఢిల్లీకి ఎక్కువగా వచ్చింది కేవలం తమ పార్టీ నాయకులను, గాంధీ కుటుంబాన్ని కలవడానికేనని ఎద్దేవా చేశారు. రాజీనామా చేయాల్సింది తాను కాదని.. రేవంత్‌రెడ్డే చేయాలని చెప్పారు. కుర్చీ బచావో అనేది కాంగ్రెస్ నినాదమని.. డబ్బులిచ్చి సీఎం సీట్లు కొనుక్కోవడం ఆ పార్టీ సంస్కృతి అనే విషయం ప్రజలకు తెలుసునని విమర్శించారు.
ఎవరి కోసం బహిష్కరిస్తున్నారు?
నీతి ఆయోగ్ సమావేశాన్ని ఎవరి ప్రయోజనాల కోసం బహిష్కరిస్తున్నారని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని బహిష్కరించే సమయం ఎంతో దూరంలో లేదన్నారు. తెలంగాణ పదమే బహిష్కరించారని రేవంత్ అనడం హాస్యాస్పదమని.. తెలంగాణకు ఏం చేయాలో బీజేపీకి బాగా తెలుసునని చెప్పారు. కేంద్ర బడ్జెట్‌లో మధ్యప్రదేశ్, రాజస్తాన్, హరియాణా, పుదుచ్చేరి పదాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు.
వాళ్లు దీక్ష చేసినంత మాత్రాన.. తెలంగాణకు ఏం మేలు జరగదన్నారు. అమరావతికి నిధులిస్తే.. మీకు వచ్చిన ఇబ్బందేమిటి? అని రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. కేంద్రం పదేళ్లలో 10 లక్షల కోట్లు తెలంగాణ అభివృద్ధికి ఇచ్చిందని... అయితే, కేంద్ర ప్రభుత్వ నిధులను దారిమళ్లించిన విషయం వాస్తవం కాదా? అని నిలదీశారు.
సింగరేణిని ప్రైవేటీకరించే ఆలోచన లేదు
సింగరేణి సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు లోక్‌సభ వేదికగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. బుధవారం లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. సింగరేణి విషయంలో తెలంగాణ ప్రజానీకానికి, సింగరేణి ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తరపున భరోసా కల్పించారు.
సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వం వాటా 51%, కేంద్ర ప్రభుత్వం వాటా 49%గా ఉందని... అలాంటి సింగరేణిని ప్రైవేటీకరించే ఆలోచన కేంద్రానికి లేనే లేదన్నారు. సింగరేణి బలోపేతానికి మోదీ ప్రభుత్వం కృషిచేస్తూనే ఉందని చెప్పారు. తెలంగాణ విద్యుత్ ప్రయోజనాలను కాపాడే ఆలోచనతో.. అవసరమైన అన్ని చర్యలను కేంద్రం తీసుకుంటోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment