రిజర్వేషన్ల రద్దు ప్రచారంతో ఆ పార్టీలకే నష్టం
ఆ ఫలాల లబ్ధిదారులకు బీజేపీ పట్ల విశ్వాసం
కాంగ్రెస్ డబ్బులు పంచినా ఓట్లు వేసేది మాకే
ఆర్‌ఆర్ ట్యాక్స్ వసూళ్లు తప్ప రేవంత్‌కేమీ తెలియదు
శామ్ పిట్రోడావి జాత్యహంకార వ్యాఖ్యలు
మీడియాతో కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ డబుల్ డిజిట్ సీట్లు సాధించడం ఖాయమని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందనే సీఎం రేవంత్‌రెడ్డి, ఇతర విపక్షాల వ్యతిరేక ప్రచారాన్ని ప్రజలు నమ్మక పోవడంతో అది తమకు అనుకూలంగా మారిందని వ్యాఖ్యానించారు. బీజేపీని ఇరుకున పెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ చేసిన ‘రిజర్వేషన్’ ప్రచారం విఫలమైందన్నారు.
ఆ ఫలాల లబ్ధిదారులే బీజేపీపై విశ్వాసంతో మద్దతు పలుకుతున్నారని ఆయన చెప్పారు. దీంతో రేవంత్‌రెడ్డిలో అభద్రతాభావం, అసహనం పెరగగా, కాంగ్రెస్ పార్టీలో మరింత కలవరం పెరిగిందన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని డబ్బులు పంచినా.. ప్రజలు ఓట్లు మాత్రం బీజేపీకే వేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
బుధవారం బీజేపీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... రైతు భరోసాను కేంద్ర ఎన్నికల సంఘం ఆపితే బీజేపీ నిలిపేసిందని రేవంత్‌రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలు వస్తాయని ముందే తెలిసి నా.. రైతుభరోసా ఎందుకివ్వలేదో రేవంత్‌రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. అబద్ధాల ప్రచారంలో కల్వకుంట్ల కుటుంబానికి, రేవంత్‌కు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చునని ఎద్దేవాచేశారు.
ఆర్‌ఆర్ టాక్స్ వసూళ్లు తప్ప రేవంత్‌కేమీ తెలియదు
‘రేవంత్‌రెడ్డి బాధ్యతారహిత విమర్శలు చేస్తున్నారు. బూతులు మాట్లాడటం, కోతలు కోయడం తప్ప హామీల అమలు చేతల్లో చూపించే సోయి లేదు. ఆర్‌ఆర్ టాక్స్ వసూలు చేయడం తప్ప వేరే విషయం తెలియదు. రీసెర్చ్ టీం పెట్టుకుని.. ఏ తిట్లు తిట్టాలి, ఏ వీడియో ఫేక్ చేయాలనే దానిపై ఆలోచన చేస్తున్నారు. కేంద్రంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు.’ అని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ‘‘కేంద్రంతో బీఆర్‌ఎస్ ఘర్షణ పడ్డందుకే తెలంగాణకు అన్యాయం జరిగిందని గతంలో రేవంత్ అన్నారు... కేంద్రంతో సఖ్యతతో ఉంటా అని చెప్పి ఇప్పుడు గాడిద గుడ్డు పెట్టుకొని తిరుగుతున్నారు.
ఎన్నికలు రాగానే ఏం రోగం పుట్టిందో.. స్వార్థం కోసం తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు’ అని తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పదేళ్లలో కేంద్రం చేసిన దానిపై సీఎం రేవంత్‌రెడ్డితో ఎన్నికల తరవాత కూడా తాను చర్చకు సిద్ధమని చెప్పారు. ‘ఎక్కడ ప్రచారా నికి వెళ్ళినా ఆ అభ్యర్థిని కేంద్ర మంత్రి చేస్తా అని సీఎం అంటున్నారు... పోర్ట్‌ఫోలియోలు కూడా ఇస్తున్నారు. అసలు కాంగ్రెస్ ఎన్ని సీట్లలో పోటీ చేస్తోంది... ప్రధాని ఎవరు ?’ అని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ తప్పిదాలతో తెలంగాణకు నష్టం
‘మాజీ సీఎం కేసీఆర్ తప్పు వల్లనే కృష్ణా జలాల్లో తెలంగాణ నష్టం పోయింది. కేటీఆర్ చిల్లర గాని లెక్క మాట్లాడుతున్నారు. కేంద్ర మంత్రిగా తెలంగాణకు కేంద్రం ఎంత ఇచ్చిందో చర్చకు నేను సిద్ధం. హైదరాబాద్ డబ్బులు అదిలాబాద్‌లో ఖర్చు పెట్టొద్దా? అలాంటి వారికి ఏమి చెపుతాము’ అని వ్యాఖ్యానించారు. ‘కోమటిరెడ్డి వెంకటరెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. భువనగిరి కోట అభివృద్ధికి కేంద్రం ఏం చేసిందో టూరిజం శాఖను అడిగి తెలుసుకో లేదంటే మంత్రి జూపల్లి కృష్ణారావును అడిగి తెలుసుకోవాలి.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి వారి మాటలకు నేను సమాధానం చెప్పను. మా పార్టీ అధికారప్రతినిధులు మాట్లాడుతారు’ అని విలేకరుల ప్రశ్నలకు కిషన్‌రెడ్డి బదులిచ్చారు. ’’రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు శామ్ పిట్రోడావి జాత్యంహకార వ్యాఖ్యలు. దేశ ప్రజల పట్ల కాంగ్రెస్ దురహంకార వైఖరికి ఈ వ్యాఖ్యలు అద్దం పడతాయి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment