మాజీ ఎంపీ గడ్డం గంగారెడ్డి చిన్నకోడలికి ‘పద్మశ్రీ’ | Nizamabad: Kuchipudi Dancer Gaddam Padmaja Reddy Won Padma Shri Award | Sakshi
Sakshi News home page

మాజీ ఎంపీ గడ్డం గంగారెడ్డి చిన్నకోడలికి ‘పద్మశ్రీ’

Published Wed, Jan 26 2022 4:39 PM | Last Updated on Wed, Jan 26 2022 6:34 PM

Nizamabad: Kuchipudi Dancer Gaddam Padmaja Reddy Won Padma Shri Award - Sakshi

సాక్షి, నిజామాబాద్‌: జక్రాన్‌పల్లి మండలం కేశ్‌పల్లికి చెందిన డాక్టర్‌ పద్మజారెడ్డికి దేశంలోనే నాలుగో అత్యున్నతమైన ‘పద్మశ్రీ’ పురస్కారం వరించింది. కూచిపూడి విభాగంలో ఆమెకు ఈ అవార్డు దక్కింది. మాజీ ఎంపీ గడ్డం గంగారెడ్డి చిన్న కుమారుడు శ్రీనివాసరెడ్డి భార్య అయిన పద్మజారెడ్డి ఏపీలోని కృష్ణా జిల్లా పామర్రులో జన్మించారు. పామర్రు గ్రామం కూచిపూడి కళకు పుట్టినిల్లయిన కూచిపూడి సమీపంలో ఉంటుంది. దీంతో కూచిపూడి సిద్ధేంద్రయోగి స్ఫూర్తితో డాక్టర్‌ శోభానాయుడు శిష్యరికంలో పద్మజారెడ్డి నృత్య రీతులు నేర్చుకున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌లో పుట్టి, ఇందూరు కోడలిగా జిల్లాకు వచ్చిన పద్మజారెడ్డి తెలంగాణ సంస్కృతిపై మక్కువ పెంచుకున్నారు. తెలంగాణ సంస్కృతిలో భాగమైన రుద్రమదేవిని ఎక్కువగా ఇష్టపడే పద్మజారెడ్డి సత్యభామ, రుద్రమదేవి పాత్రల ద్వారా కూచిపూడిలో గుర్తింపు పొందారు. ఇందులో భాగంగా డాక్టర్‌ పద్మజారెడ్డి కూచిపూడిలో ‘కాకతీయం’ అనే తెలంగాణ క్లాసికల్‌ ఆర్ట్‌ ఫాంను రూపొందించి ప్రపంచానికి పరిచయం చేశారు. నృత్య రత్నావళిలోని భ్రమరి, పేరిణి, కందుక నృత్యం, లాస్యంగం వంటి ప్రధాన అంశాలతో నృత్య బ్యాలెట్‌ రూపొందించారు. అదేవిధంగా సామాజిక అంశాలపైనా నృత్యరూపకాలు రూపొందించి సమాజంలో అవగాహన కల్పించే విషయంలో తనవంతుగా కీలక పాత్ర పోషించారు. భ్రూణహత్యలు, జాతీయ సమైక్యత స్ఫూర్తిని రగిలించే నృత్య ప్రదర్శనలు చేశారు. 
చదవండి: పద్మ పురస్కారాలు మాకొద్దు.. మేం తీసుకోం

డాక్టర్‌ పద్మజారెడ్డి సాధించిన అవార్డుల్లో కొన్ని..

► భారత ప్రభుత్వం నుంచి సంగీత్‌ నాటక్‌ అకాడమీ అవార్డు 
► 2006లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా కళారత్న (హంస) అవార్డు 
►  శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి 2005లో డాక్టరేట్‌ పట్టా 
► 1994లో అప్పటి రాష్ట్రపతి శంకర్‌ దయాల్‌ శర్మ నాట్యవిశారద అవార్డు అందజేశారు. 
►  1990లో కల్కి కళాకార్‌ అవార్టు 
► 2001లో డాక్టర్‌ సి.నారాయణరెడ్డి చేతుల మీదుగా సంస్కృతి రత్న, అభినయ సత్యభామ అవార్డు అందుకున్నారు. 
► అక్కినేని నాగేశ్వరరావు చేతుల మీదుగా ఏఎన్‌ఆర్‌ గోల్డ్‌మెడల్‌ అందుకున్నారు. 
►  అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ 2014లో అవార్డు పొందారు. 
► యూరోపియన్‌ తెలుగు అసోసియేషన్‌ నుంచి అవార్డు
► తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా నుంచి ది డ్యాన్సింగ్‌ క్వీన్‌ అవార్డు 
►  అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ లైఫ్‌టైమ్‌ ఆచీవ్‌మెంట్‌తో అవార్డుతో సత్కరించింది. 
► 1979లో సర్‌ శ్రీనగర్‌ సంసద్‌ నృత్యవిహార్‌ అవార్డు అందజేశారు. 
►  2007లో త్యాగరాజ ఫెస్టివల్‌ కమిటీ విద్వాన్‌ మంత్‌తో సన్మానించింది. 
►  ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ కల్చరల్‌ రిలేషన్స్‌(ఢిల్లీ) జనరల్‌ అసెంబ్లీ మెంబర్‌గా 2017 వరకు ఉన్నారు. 
►   2012లో నేషనల్‌ టూరిజం అడ్వయిజరీ కౌన్సిల్‌ మెంబర్‌గా వ్యవహరించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement