
సాక్షి, సిటీబ్యూరో: ‘మాది బోడుప్పల్ కాకతీయ కాలనీ. రెండు వారాల క్రితం మా నాన్నకు కోవిడ్ నిర్ధారణ అయింది. వారికి శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది.
కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించే ఆర్థిక స్తోమత లేక ఆయనను అర్ధరాత్రి అత్యవసర పరిస్థితుల్లో గాంధీ కోవిడ్ సెంటర్‌కు తీసుకెళ్లాం. వైద్యులు ఐసీయూలో అడ్మిట్ చేసుకున్నారు. ఫోన్ చేద్దామంటే వారి వద్ద సెల్‌ఫోన్ కూడా లేదు. ఆస్పత్రి ల్యాండ్ నంబర్‌కు ఫోన్ చేసి అడిగితే...ఐసీయూలో ఉన్నట్లు చెప్పారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తే.. ఎవరూ ఏమీ చెప్పడం లేదు. పోయిన రోజు పోయిండు..మళ్లీ మాటా ముచ్చటా లేదు. ఉండబట్టలేక లోనికి వెళ్లేందుకు యత్నించా. ప్రధాన ద్వారం వద్దే పోలీసులు అడ్డుకున్నారు. అదేమంటే నాన్‌కోవిడ్ బాధితులకు ఆస్పత్రిలో అనుమతి లేదని స్పష్టం చేశారు. కనీసం మా నాన్న ఎలా ఉన్నాడో..? తెలుసుకుని చెప్పమని వేడుకున్నా. అయినా స్పందన లేదు’ అని బాధితుడి కుమార్తె సరస్వతి సహా ఇతర బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా సరస్వతి కుటుంబ సభ్యులు, బంధువులకే కాదు కోవిడ్‌తో గాంధీలో చికిత్స పొందుతున్న అనేక మంది కుటుంబ సభ్యులందరికీ ఇక్కడ ఇదే అనుభవం ఎదురవుతుంది. ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
అంతా..అయోమయం
1890 పడకల సామర్థ్యం ఉన్న గాంధీ జనరల్ ఆస్పత్రిలో ప్రస్తుతం 806 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో ఐసీయూలోని వెంటిలేటర్‌పై 178 మంది చికిత్స పొందుతున్నారు. ఆక్సిజన్‌పై 410 మంది చికిత్స పొందుతున్నారు. మరో 218 మంది సాధారణ ఐసోలేషన్ వార్డులో ఉన్నారు. ఆస్పత్రి పూర్తి స్థాయి కోవిడ్ సెంటర్ కావడంతో అత్యవసర పరిస్థితుల్లో ఉన్న బాధితులకు సహాయంగా కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిన వారి కుటుంబ సభ్యులను మినహా ఇతరులను అనుమతించడం లేదు. వీరిలో చాలా మంది వృద్ధులు, చిన్న పిల్లలు కూడా ఉంటున్నారు. వీరిలో చాలా మందికి సెల్‌ఫోన్లు లేవు. ఒక వేళ ఉన్నా..మాట్లాడలేని స్థితి.
బాధితులకు ఎలాంటి వైద్య సహాయం అందుతుంది? వారి ఆరోగ్య పరిస్థితి ఏమిటి? చికిత్సకు ఏమైనా స్పందిస్తున్నారా? వేళకు ఆహారం తీసుకుంటున్నారా? అసలు వారి ఆరోగ్యం ఎలా ఉంది? వంటి అనుమానాలను నివృత్తి చేసేందుకు ప్రత్యేక కో ఆర్డినేటర్లను నియమించనున్నట్లు ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకురాక పోవడంతో బాధితుల ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స చేసేందుకు అవసరమైన వైద్యులు, స్టాఫ్ నర్సులు ఉన్నా...వారు బాధితుల ఆరోగ్య పరిస్థితిని వివరించడం లేదు. కుటుంబ సభ్యులు నేరుగా ఐసోలేషన్ వార్డు వద్దకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీయాలని భావించే వారిని పోలీసులు లోనికి అనుమతించక..లోపల ఉన్న వారి ఆరోగ్య పరిస్థితి తెలియక..బయట ఉన్న బంధువులు ఆందోళన చెందుతున్నారు.
అదే కార్పొరేట్ ఆస్పత్రిలోనైతే...
ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు రోజుకు రెండు పూటలా కుటుంబ సభ్యులను కౌన్సిలింగ్‌కు పిలుస్తుంటాయి. రోగుల ఆరోగ్య పరిస్థితి, అందిస్తున్న వైద్యసేవలు, వాడుతున్న మందులు, రోగి స్పందిస్తున్న తీరు...చికిత్సలో ఎదురవుతున్న ఇతర సమస్యలను ఎప్పటికప్పుడు కుటుంబ స భ్యులకు వివరిస్తుంటాయి. ప్రభుత్వ కోవిడ్ సెంటర్లలో కౌన్సిలింగ్ కాదు కదా..! కనీసం రోగుల ఆరోగ్య పరిస్థితిని కూడా వివరించడం లేదు. కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చిదిద్దినట్లు ప్రభుత్వం చెప్పుతుంది. గాంధీ సహా ఒక్కో ఆస్పత్రిలో వంద మందికిపైగా పేషంట్ కేర్ ప్రొవైడర్లను నియమించినట్లు చెబుతోంది. క్షేత్రస్థాయిలో వీరెవరూ కన్పించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment