వరంగల్‌: కరోనా పేషెంట్లకు ‘టెక్నికల్‌’ కష్టాలు | Non Functioning Corona Toll Free Numbers In Warangal District | Sakshi
Sakshi News home page

వరంగల్‌: పనిచేయని కరోనా టోల్‌ ఫ్రీ నంబర్లు.. భయాందోళనలో పేషెంట్లు

Published Wed, Jan 19 2022 7:35 PM | Last Updated on Wed, Jan 19 2022 7:44 PM

Non Functioning Corona Toll Free Numbers In Warangal District - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, వరంగల్‌: కరోనా థర్డ్‌వేవ్‌ ఉధృతి రోజురోజుకూ పెరుగుతోంది. తొలి, రెండో వేవ్‌లు మించి పాజిటివ్‌  కేసులు నమోదు అవుతాయని ప్రచారమున్నా కూడా జిల్లా వైద్యారోగ్య శాఖ మేల్కోవడం లేదు. జనవరి తొలివారం నుంచి ముఖ్యంగా సంక్రాంతి పండుగ తర్వాత ఈ కేసుల సంఖ్య పెరుగుతున్నా.. అధికారుల గణాంకాలు విడుదల చేసేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు. అదే సమయంలో కరోనా పాజిటివ్‌ రోగులకు అవసరమైన సమయాల్లో సలహాలు, సూచనలిచ్చే ‘టోల్‌ ఫ్రీ నంబర్లు’ ఇంకా అందుబాటులోకి తీసుకురాకపోవడం ఉన్నతాధికారుల అలసత్వానికి నిదర్శనంగా మారింది.


టోల్‌ ఫ్రీ నంబర్లు అందుబాటులో ఉంటే ఏ సమయాల్లో ఏఏ మందులు వాడాలి, ఎన్ని రోజులు ఐసోలేషన్‌లో ఉండాలి, రాత్రి సమయాల్లో పరిస్థితి విషమిస్తే ఫోన్‌ ద్వారా వైద్య సిబ్బందితో మాట్లాడే వీలు లేకపోవడంతో  వందల మంది బాధితులు ఆందోళన చెందుతున్నారు. వైద్యుడితో మాట్లాడితే వచ్చే భరోసా కనబడకపోవడంతో కలవరపడుతున్నారు. ప్రస్తుతం జిల్లా వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారి పర్యవేక్షణ లోపంతోనే కరోనా కట్టడిపై సిబ్బంది కూడా సీరియస్‌గా లేరని  ఆ శాఖ వర్గాలే అంటున్నాయి. 

స్వీయ వైద్యం వద్దు..
జిల్లాలో వైరస్‌ బారిన పడిన వందలాది మంది ఇప్పుడు సొంత వైద్యం బాట పట్టి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. అనేక మంది రెండు దశల్లో మహమ్మారి సోకినప్పుడు వాడిన మందులనే ఇప్పుడూ వాడేస్తున్నారు. ఇలా సొంతంగా వాడడం ఆరోగ్యపరంగా మంచిది కాదని, దాని వల్ల ఇతర అవయవాలపై ప్రభావం చూపుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘ప్రస్తుతం వైరస్‌ సోకిన వారిలో చాలా మందికి పెద్దగా లక్షణాలు ఉండడం లేదు. స్వల్పంగా జలుబు, దగ్గు, గొంతునొప్పి, తలనొప్పి, జ్వరం ఉంటున్నాయి.

ఇలా ఉండి పరీక్ష చేయించుకుంటే పాజిటివ్‌ వచ్చిన వారు వెంటనే వైద్యుడ్ని సంప్రందించి మందులు వాడితే ఆరేడు రోజుల్లో లక్షణాలన్నీ తగ్గిపోతున్నాయి. నాలుగు రోజుల పాటు జ్వరం అలాగే ఉన్నా ఆక్సిజన్‌ 94 శాతం కంటే తగ్గితే వెంటనే ఆస్పత్రిలో చేరాలి. అయితే చాలా మంది పాజిటివ్‌ అని తేలగానే పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీలో వైద్యుడు అందుబాటులో లేకుంటే పాత వేవ్‌ల్లో వాడిన మందులు తీసుకెళ్తున్నారు. టోల్‌ఫ్రీ నంబర్ల ద్వారా తెలుసుకుందామన్నా.. అవి పనిచేయక పోవడంతో ఆందోళన చెందుతున్నారు. భరోసానిచ్చే వైద్యమంత్రం లేక మాన సికంగా క్రుంగిపోతున్నార’ని  సామాజిక కార్యకర్త శ్రావణి తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement