సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని పీపీ పోస్టుల ఖాళీలు భర్తీ చేయాలని ఆరు నెలల కిందటే ఆదేశించినా ఎందుకు భర్తీ చేయలేదని, ఇంకా ఎంత సమయం కావాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడింది. ఈ కేసును తదుపరి విచారించనున్న ఏప్రిల్ 1 నాటికి రాష్ట్రంలో ఒక్క పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) పోస్టు కూడా ఖాళీగా ఉండటానికి వీల్లేదని స్ప ష్టం చేసింది. రెండు, మూడు కోర్టులకు ఒక పీపీ ఉంటే సత్వర న్యాయం ఎలా సాధ్యమని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 414 ఖాళీలకుగాను ఇప్పటికే 212 ఖాళీలు భర్తీ చేశామని ప్రభుత్వ న్యాయవాది శ్రీకాంత్‌రెడ్డి కోర్టుకు నివేదించారు. మిగిలిన 202 ఖాళీల భర్తీకి సంబంధించి అడ్వొకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులతో చర్చిస్తున్నారని తెలిపారు. అయితే, తమకు చర్చలు కాదు, ఫలితాలు కావాలని కోర్టు పేర్కొంది. తదుపరి విచారణ నాటికి అన్ని ఖాళీలు భర్తీ చేయాలని, ఒక్క ఖాళీ కూడా లేదని చెప్పాలని జీపీని ఆదేశించింది.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రవ్యాప్తంగా పీపీ పోస్టులు ఖాళీగా ఉండటంతో కక్షిదారులకు న్యాయం అందడంలో జాప్యం జరుగుతోందని, ఈ నేపథ్యంలో ఖాళీల భర్తీకి వెంటనే సత్వర చర్యలు చేపట్టాలంటూ 2018లో అప్పటి సీజే నేతృత్వంలోని ధర్మాసనం సుమోటో ప్రజాహిత వ్యాజ్యంగా ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. పీపీ పోస్టుల భర్తీకి వెంటనే చర్యలు చేపట్టాలని అప్పుడు ఏజీని ఆదేశించింది. ఈ పిల్‌ను ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. ‘పీపీల కొరత, నియామకాల్లో జాప్యం న్యాయ ప్రక్రియకు విఘాతం కల్గించడమే. ప్రాసిక్యూషన్ విభాగానికి పూర్తికాలం డైరెక్టర్‌ను ఎందుకు నియమించలేదు? ప్రాసిక్యూషన్ విభాగం డైరెక్టర్ పోస్టుతో పాటు 2 వారాల్లోగా అన్ని ఖాళీలను భర్తీ చేయాలి. ఈ మేరకు వచ్చే విచారణ నాటికి స్టేటస్ రిపోర్టు సమర్పించండి’ అని ధర్మాసనం ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 1కి వాయిదా వేసింది.
ఒక్క పోస్టూ ఖాళీగా ఉండొద్దు
Published Fri, Mar 5 2021 4:14 AM | Last Updated on Fri, Mar 5 2021 4:15 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment