హైదరాబాద్‌ మెట్రో.. అదే తీరు! | The Number Of Hyderabad Metro Traveling Is Still Low | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ మెట్రో.. అదే తీరు!

Published Mon, Nov 9 2020 8:22 AM | Last Updated on Mon, Nov 9 2020 8:46 AM

The Number Of Hyderabad Metro Traveling Is Still Low - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌లో పూర్తిస్థాయిలో అన్‌లాక్‌ అయినా మెట్రో ప్రయాణికుల సంఖ్య మాత్రం అదే స్థాయిలో పెరగడంలేదు. లాక్‌డౌన్‌కు ముందు (ఈ ఏడాది మార్చి 22)తో పోలిస్తే ప్రస్తుతం మూడు రూట్లలో మెట్రో ప్రయాణికుల సంఖ్య 38 శాతం దాటకపోవడం గమనార్హం. ఎల్బీనగర్‌–మియాపూర్, జేబీఎస్‌–ఎంజీబీఎస్, నాగోల్‌–రాయదుర్గం  మార్గాల్లో మార్చి నెలకు ముందు నిత్యం 3.5 లక్షల మంది జర్నీ చేసేవారు. ప్రస్తుతం మూడు మార్గాల్లో నిత్యం 1.33 లక్షల మంది మెట్రో జర్నీ చేస్తుండడం గమనార్హం. సువర్ణ ఆఫర్‌తో ప్రయాణికులకు ఛార్జీల్లో రాయితీతోపాటు స్మార్ట్‌కార్డులో రీఛార్జీపై క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ అమలు చేస్తున్నప్పటికీ ప్రయాణికుల సంఖ్య అరకొరగానే పెరిగినట్లు స్పష్టమౌతోంది. 

ఆఫర్లు ప్రకటించినా.. 
దసరా, దీపావళి సందర్భంగా మెట్రోరైలు సంస్థ మెట్రో సువర్ణ ఆఫర్‌ను ప్రకటించింది. ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఈ ఆఫర్‌లో భాగంగా ఛార్జీల్లో రాయితీ కల్పించడంతోపాటు.. స్మార్ట్‌కార్డ్‌ రీఛార్జీపై క్యాష్‌బ్యాక్‌ఆఫర్‌ అమలు చేస్తోంది. వచ్చే ఏడాది జనవరి 15 వరకు ఈ ఆఫర్లు అమలుకానున్నాయి. అయితే ఆఫర్ల ద్వారా మెట్రో ప్రయాణికుల సంఖ్యను లాక్‌డౌన్‌ ముందున్న సంఖ్యకు చేర్చేందుకు మెట్రో అధికారులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. 

ప్రయాణీకుల సంఖ్య పెరగకపోవడానికి కారణాలివే.. 
- సిటీజన్లలో కోవిడ్‌ భయాందోళనలు తొలగకపోవడం. కోవిడ్‌ సెకండ్‌వేవ్‌ మొదలౌతుందన్న ఆందోళన. 
- ఐటీ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం అమలవుతుండడం. 
- మెట్రో స్టేషన్ల వద్ద బైక్, కార్ల పార్కింగ్‌కు చెల్లించే ఛార్జీలు తడిసి మోపెడు కావడం. 
- మెట్రో స్టేషన్ల నుంచి సమీప కాలనీలకు, బస్తీలకు కనెక్టివిటీ లేకపోవడంతో ఆటో, క్యాబ్‌ ఛార్జీలతో జేబులు గుల్లకావడం. 
- వ్యక్తిగత వాహనాలపై వెళితే కోవిడ్‌ బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చన్న భావన.  
- మెట్రో కోవిడ్‌ మార్గదర్శకాల ప్రకారం ఎప్పటికప్పుడు శానిటైజేషన్‌ చేస్తున్నప్పటికీ.. ఏసీ బోగీల్లో సులభంగా కోవిడ్‌ వ్యాప్తి చెందుతుందన్న భయాందోళనలు. 

క్రమంగా ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది 
నగరంలో మూడు మార్గాల్లో మెట్రో ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. క్యాష్‌బ్యాక్‌ ఆఫర్, సువర్ణ ఆఫర్‌ సత్ఫలితాన్నిస్తోంది. దేశరాజధాని ఢిల్లీలో 18 ఏళ్లుగా మెట్రో సర్వీసులు నడుస్తున్నాయి. ఈ నగరం మినహా నూతనంగా మెట్రో ప్రారంభమైన మిగతా మెట్రోసిటీలతో పోలిస్తే నగరంలో ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు తాజా గణాంకాలు చూస్తే అర్థమౌతుంది. 
– ఎన్వీఎస్‌రెడ్డి, హెచ్‌ఎంఆర్, ఎండీ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement